బల్దియాలో భయపెడుతున్న వైరల్ వ్యాధులు

by  |
బల్దియాలో భయపెడుతున్న వైరల్ వ్యాధులు
X

దిశ, సిటీ బ్యూరో: ఇప్పటికే కరోనా భయంతో వణికిపోతున్న మహానగరంపై సీజనల్ వ్యాధులు యుద్దాన్ని ప్రకటించాయి. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా జీహెచ్ఎంసీ అధికారులు చెత్త కుప్పలను సకాలంలో తొలగించకపోవటం, వర్షం నీటికి చెత్త బాగా తడిసి దోమలు వృద్ది చెంది స్థానికులను అనారోగ్యం పాల్చేస్తున్నాయి. నగరంలో ముఖ్యంగా పేదలు ఎక్కువగా నివసించే మురికివాడలు, మధ్య తరగతి ప్రజలు నివసించే బస్తీల్లో ఏ కుటుంబాన్ని కదిలించినా జ్వరం, జలుబు, వాంతులు, వీరేచనాలతో బాధపడే వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా సెప్టెంబర్ మాసంలో డెంగీ వ్యాధి ఎక్కువగా ప్రబలుతున్నట్లు గతంలోనే అధికారులు గుర్తించినా, ముందస్తు వ్యాధి నివారణ చర్యలు అంతంతమాత్రంగా తయారయ్యాయి. ఈ విషయాన్నే ఈ సారి కాస్త ముందుగా గుర్తించామని, ఇందుకు వంద రోజులు దోమల నివారణ కార్యక్రమానికి ప్రత్యేక యాక్షన్ ప్లాన్ తో ముందుకెళ్తున్నామని బల్దియా అధికారులు చెబుతున్నా, ఎక్కడ కూడా దోమలు కంట్రోల్ కావటం లేదు.

బల్దియాకు ఆన్ లైన్ లో, నేరుగా అధికారులకు అందుతున్న ఫిర్యాదుల్లో ప్రస్తుతం ఎక్కవ ఫిర్యాదులు దోమల బెడదకు సంబంధించినవే ఉంటున్నాయి. చాలా మురికివాడలు, బస్తీల్లో డెంగీ అనుమానిత లక్షణాలతో వందల సంఖ్యలో బాధితులు ఎక్కువగా ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించటంతో కేసుల తీవ్రత బయట పడటం లేదు. వైరల్ ఫీవర్ తో బాధపడే వారి సంఖ్య కూడా రోజురోజుకి పెరుగుతోంది. సీజనల్ అంటు వ్యాధుల నివారణ కోసం ముందస్తు చర్యలు చేపట్టాల్సిన జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి ఈ సారి ప్రత్యేకంగా తయారు చేసిన యాక్షన్ ప్లాన్ తో ప్రత్యేక బృందాలు దోమల నివారణ, స్థానికులకు వైద్య పరీక్షలతో విధులు నిర్వర్తించనున్నట్లు జిల్లా వైద్యారోగ్యాశాఖాధికారి డా. వెంటకి ప్రకటించినా, నేటికీ అమలుకు నోచుకోలేదు. డెంగీ ఆనవాళ్లు కన్పించిన ప్రాంతాల్లో వ్యాధి నివారణ చర్యలు చేపడుతామని ప్రకటించి పక్షం రోజులు గడుస్తున్నా, ఎక్కడా కూడా చర్యలు చేపట్టినట్లు దాఖలాల్లేవు.

శాస్త్రీయత లేని పరీక్షలు

డెంగీ అనుమానిత లక్షణాలున్న వారికి ప్రైవేటు ఆస్పతుల్లో ని సిబ్బంది స్ట్రిట్ టెస్టులు నిర్వహించి, వ్యాధి నిర్థారణ చేస్తూ వేలల్లో బిల్లులు వసూలు చేసుకుంటున్నాయి. ఈ పరీక్షల్లో శాస్త్రీయత అంతంతమాత్రమేనని జీహెచ్ఎంసీ అధికారులంటున్నారు. డెంగీ వ్యాధిని పక్కగా నిర్ధారించేందుకు ఎలీజా అనే యంత్రంతో పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని, ఆ యంత్రం ఖరారు చేస్తేనే నూటికి నూరు శాతం శాస్త్రీయమైన పరీక్షగా భావించవచ్చునని అధికారులు చెబుతున్నారు. కానీ ఇలాంటి పరీక్షలు ప్రస్తుతం నగరంలోని ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులతో పాటు మరో మూడు ప్రభుత్వ వైద్య సంస్థల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయని, ఇందులో నిర్వహించే పరీక్ష రిపోర్టు రావటానికి కనీసం 24 గంటల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.

ఈ విషయం మహానగరవాసులకు పెద్దగా తెలీకపోవటంతో ప్రైవేటు ఆస్పత్రుల్లో స్ట్రిప్ టెస్టులు చేసుకుని డెంగీ వచ్చిందన్న ఆందోళనకు గురవుతున్నట్లు అధికారులు వాదిస్తున్నారు. ప్రస్తుతం వైరల్ ఫీవర్ తో నగరంలో వందలాది బస్తీలు, మురికివాడలు సుస్తీ అయ్యాయి. అవన్నీ డెంగీ కేసులు కాకపోయినా ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే వైరల్ ఫీవర్లయినా, వాటిని ముందస్తు నివారణలో అధికారులెందుకు విఫలమవుతున్నారనే వాదనలున్నాయి.

రికార్డు స్థాయిలో కేసులు

గడిచిన మూడు ఏళ్ల నుంచి నగరంలో నమోదైన డెంగీ కేసులను గమనిస్తే ఈ ఏటా రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 2019లో ఏడాది పొడువున మొత్తం 3366 డెంగీ కేసులు నమోదు కాగా, వీటిలో 1960 అనుమానస్పద కేసులుగా, 1406 డెంగీ కేసులు నిర్థారణ అయినట్లు బల్దియా అధికారులు పేర్కొన్నారు.

అలాగే 2020లో ఏడాది మొత్తంలో 360 కేసులు వెలుగుచూడగా, వీటిలో 290 అనుమానాస్పద కేసులుగా గుర్తించగా, మిగిలిన 70 డెంగీ కేసులుగా ఖరారైనట్లు వెల్లడించారు. ఈ సంవత్సరం జనవరి నుంచి ఆగస్టు నెలాఖరు వరకు సుమారు 61 కేసులు నమోదైనట్లు ఆగస్టు రెండో వారంలో బల్దియా అధికారులు వెల్లడించగా, ఆ తర్వాత గడిచిన పక్షం రోజులకే డెంగీ కేసుల సంఖ్య 120కి ఈ నెల మొదటి వారం ముగిసే సరికి సుమారు 400 వరకు పెరిగినట్లు సమాచారం.

ఈ మూడేళ్లలో కేవలం సెప్టెంబర్ మాసంలోనే ఎక్కువగా కేసులు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2019 సెప్టెంబర్ లో 587 కేసులు నమోదైనట్లు గుర్తించగా, 2020 సెప్టెంబర్ లో 43, ఈ సారి ఆగస్టు నెలాఖరులోపే కేసుల సంఖ్య సుమారు 300 దాటినట్లు సమాచారం. కానీ బల్దియా అధికారులు మాత్రం పెరిగిన కేసులకు సంబంధించి అవన్నీ స్ట్రిప్ పరీక్షలు చేసి నిర్ధారించినవిగా కొట్టి పారేస్తున్నారు.


Next Story

Most Viewed