‘వరి’ వద్దన్న సార్లూ.. ఏం పంట వేయాలో చెప్పకపోతే ఎలా..?

by  |
‘వరి’ వద్దన్న సార్లూ.. ఏం పంట వేయాలో చెప్పకపోతే ఎలా..?
X

దిశ ప్రతినిధి, మెదక్ : ఖరీఫ్ పంట చేతికొచ్చింది.. కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఇక యాసంగి సాగుకు సిద్ధమవుతున్న రైతుకు ఏం పంట వేయాలో తోచడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం వరి పంట వేయొద్దని తెగేసి చెబుతోంది. మొక్కజొన్న పంటపై స్పష్టత కరువైంది. ప్రభుత్వం సాగు చేయమని చెబుతున్న పొద్దుతిరుగుడు, ఇతర ఆరుతడి పంటలకు విత్తనాలు సరిపడా దొరకడం లేదు. ఇదిలాఉండగా జిల్లాలో మాత్రం యాసంగికి సరిపడా నీళ్లు ఉన్నాయి. నీళ్లు పుష్కలంగా ఉన్నా ఇష్టమున్న పంట వేయడానికి వీలు లేకపోవడంపై రైతన్న ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

యాసంగి సాగుపై స్పష్టత కరువు..

ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రధానంగా వరి, మొక్కజొన్న, పత్తి పంటలు పండిస్తారు. రైతులకు తెలిసిన పంటలు సైతం ఇవే. ఈ యాసంగిలో ఏయే పంటలు పండించాలన్న దానిపై ప్రభుత్వం నుంచి గానీ, అధికారుల నుంచి సరైన స్పష్టత లేదు. వరి పంట వేయొద్దని జిల్లా అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం పదేపదే చెబుతోంది. అంతకుముందు నియంత్రిత విధానంలో మొక్కజొన్న పంటను సాగు చేయొద్దని చెప్పింది. ఈ సారి ఖరీఫ్ సీజన్లో పండించిన మొక్కజొన్న పంటను కొనుగోలు చేయడం లేదు. మరో ప్రధాన పంట పత్తిపై సైతం స్పష్టత కరువైంది. తక్కువ శ్రమ, తక్కువ పెట్టుబడితో కూడిన పంటలను సాగు చేద్దామంటే ప్రభుత్వం వరి, మొక్కజొన్న పంటలను కొనుగోలు చేస్తుందో లేదోనన్న అనుమానంతో రైతులు వెనక్కి తగ్గుతున్నారు.

అయోమయంలో అన్నదాత..

యాసంగిలో వరి వద్దన్న అధికారులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని క్లస్టర్ల పరిధిలో అవగాహన సదస్సులు నిర్వహించారు. అయితే, వరికి బదులు ఏ పంటలు సాగు చేయాలని స్పష్టంగా చెప్పలేదు. దీంతో అన్నదాతలు అయోమయంలో పడ్డారు. ఏయే పంటలు పండించాలి, తమకు వరి, మొక్కజొన్న తప్ప ఇతర పంటల సాగు విధానం తెలియదు. తెలిసిన పంటలు సాగు చేస్తేనే ప్రకృతి వైపరీత్యాలు, పురుగు తగిలి నష్టపోతున్నాం. ఇక కొత్త పంటలు సాగు చేస్తే పూర్తిగా నష్టపోతామని, పెట్టిన పెట్టుబడి కూడా రాదంటూ రైతులు లబోదిబోమంటున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలంటూ పలు రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

దొరకని విత్తనాలు..

జిల్లాలో వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలని చెబుతున్న ప్రభుత్వం దానికి సరిపడా విత్తనాలను అందుబాటులో ఉంచలేదు. సబ్సిడీపై దొరికే పొద్దు తిరుగుడు, కంది, శనగ, పెసర, నూనె గింజలు, పప్పు దినుసులు, ఇతర ఆరుతడి పంటలకు సంబంధించిన విత్తనాలు ఫెర్టిలైజర్, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల్లో లభ్యం కావడం లేదు. ఇప్పటికే ఖరీఫ్ పంట కోసి యాసంగికి సిద్ధమైతున్న రైతు విత్తనాలు దొరక్క వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆరుతడి పంటలకు సంబంధించిన విత్తనాలు అందుబాటులో ఉండేలా చూడాలని కోరుతున్నారు.

విత్తనాలు దొరకట్లే..

నాకు పదెకరాలు ఉంది. ప్రాజెక్టు కింద భూమి ఉండటంతో మా భూమి జాలు వారుతుంది. ఈ నేలలో వరి తప్పా వేరే పంట పండదు. ప్రభుత్వమేమో వరి సాగు చేయొద్దని చెబుతుంది. ప్రభుత్వ నిర్ణయం మేరకు వరికి బదులు పొద్దు తిరుగుడు సాగు చేద్దామంటే పది రోజులు తిరగంగా ఒక్క బ్యాగు పొద్దు తిరుగుడు విత్తనాలు దొరికినాయి. ఇవి ఒక్క ఎకరానికి కూడా సరిపోవు. ఇక పది ఎకరాలు ఎప్పుడు సాగు చేయలే. ప్రభుత్వం వెంటనే పొద్దు తిరుగుడు విత్తనాలను సబ్సిడీపై అందించాలి.

-మహేందర్ రెడ్డి, చిన్నకోడూరు, రైతు

వరి వేయొద్దడానికి కలెక్టర్‌కు ఏం అధికారం ఉంది..

వరి వేయొద్దనడానికి జిల్లా కలెక్టర్‌కు ఏం అధికారం ఉందో చెప్పాలి. రైతులపై ఆంక్షలు విధించడం ప్రభుత్వానికి సరికాదు. యాసంగిలో వరి సాగు వద్దంటున్న ప్రభుత్వం ప్రాజెక్టులు ఎందుకు కట్టిందో చెప్పాలే.

-బత్తుల నారాయణ, రైతు, సిద్దిపేట జిల్లా

ప్రతీ గింజను కొనుగోలు చేయాలి..

రైతు పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేయాలి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వరిని కొనుగోలు చేయలేమని ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకు సర్క్యూలర్ జారీ చేయడం సరైంది కాదు. వరి వేస్తే ఉరి అన్నట్లుగా రోజు వారీగా ప్రభుత్వ అధికారులు, మంత్రులు చెప్పడం విడ్డూరంగా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికైనా యాసంగి సాగుపై ప్రభుత్వాలు స్పష్టమైన వైఖరి చెప్పాలి. లేదంటే సీపీఎం ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉధృతం చేస్తాం.

-చల్లారపు తిరుపతి, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి

డ్రామాలు ఆపి వడ్లు కొనుగోలు చేయండి..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలు ఆపి మొదట ఖరీఫ్ పంట వడ్లు కొనుగోలు చేయాలే. యాసంగిలో వరి వద్దందని కేంద్రంపై రాష్ట్రం విరుచుకుపడటం, రాష్ట్రంపై కేంద్రం నెట్టేసుకుంటూ కొత్త డ్రామాకు తెరలేపారు. కేంద్రంతో కేసీఆర్ సంబంధం లేకుండా కేసీఆర్ యాసంగి పంటను కొనుగోలు చేయాలి. బండి, కేసీఆర్ పోటీపడి విమర్శలు చేసుకునుడు కాదు. రైతుల సంక్షేమానికి కృషి చేయాలి. యాసంగిలో వరి సాగు చేయాలని ప్రభుత్వం చెప్పని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దయెత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతాం.

-దేవులపల్లి యాదగిరి, టీపీసీసీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి



Next Story

Most Viewed