జెండా పండుగలో అలంపూర్ ఎమ్మెల్యేకు చేదు అనుభవం

by  |
జెండా పండుగలో అలంపూర్ ఎమ్మెల్యేకు చేదు అనుభవం
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: ప్రాజెక్టులు నింపి నీళ్లు ఇస్తామన్నారు.. తుమ్మెళ్ళ ప్రాజెక్టు నుంచి నీళ్లు వస్తలేవు.. మరోవైపు వర్షాలు ఆశించిన స్థాయిలో కురువక చేన్లు ఎండిపోతున్నాయి. మేమంతా బాధపడుతుంటే మీరు జెండా పండుగ చేసుకుంటారా అని రైతులు అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం‌ను నిలదీశారు. పార్టీ అధిష్టానం మేరకు గురువారం జెండా పండుగ కార్యక్రమం‌లో భాగంగా ఉండవెల్లి మండల కేంద్రంలో నిర్వహించినకార్యక్రమానికి ఎమ్మెల్యే వెళ్లి జెండా ఆవిష్కరించారు.

అనంతరం రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతు బీమా, 24 గంటల విద్యుత్ సరఫరా, రుణమాఫీ తదితర పథకాలను గురించి ఎమ్మెల్యే ప్రసంగించారు. ఎమ్మెల్యే ప్రసంగం పూర్తి కాగానే రైతులు ఒక్కసారిగా వాహనం వద్దకు దూసుకువచ్చి తమ ఆవేదనను వ్యక్తపరిచారు. వర్షాలు లేక, ప్రాజెక్టుల నుంచి నీళ్లు రాక ఇబ్బందులు పడుతుంటే మీరు పండుగలు చేస్తారా..? మీరు ప్రజల సొమ్ముతో ఆనందంగా గడుపుతున్నారు. మా బాధలను ఎవరు తీర్చాలని ఎమ్మెల్యేను రైతులు ఘాటుగా నిలదీశారు. పలువురు నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోకుండా నియోజకవర్గానికి ఏం చేశారు మీరు అని ప్రశ్నించారు. ఇప్పుడు పార్టీ కార్యక్రమం కాబట్టి వచ్చి వెళ్తున్నారు. చేన్లు ఎండిపోతుంటే నీటి సౌకర్యం కల్పించడానికి ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. పరిస్థితి చేయి దాటుతుండటంతో ఎమ్మెల్యే అక్కడినుండి వెళ్లిపోయారు.

Next Story

Most Viewed