సమస్య పరిష్కరించకపోతే.. ఇక నాకు మరణమే దిక్కు (వీడియో)

by  |
Farmer protest
X

దిశ, ముధోల్: ‘‘నేను పళ్సీకర్ రంగారావు ప్రాజెక్ట్ బాధితుడిని. నన్ను ప్రభుత్వం ఆదుకోవాలి’’ అంటూ గురువారం భైంసా తహసీల్దార్ కార్యాలయం ఎదుట భైంసా మండలం కోతల్‌గావ్ గ్రామానికి చెందిన ఆనంద్ బోతే అనే రైతు నిరాహార దీక్షకు దిగారు. ఈ సందర్భంగా బాధితుడు ‘దిశ’ రిపోర్టర్‌తో మాట్లాడుతూ… ‘‘నేనో దళిత రైతుని. భైంసా మండలం కోతల్‌గావ్ గ్రామ శివారులో సర్వేనెంబర్ 195లో వారసత్వంగా వచ్చిన ఎనిమిది ఎకరాల భూమిలో 1996లో ఎస్సీ కార్పొరేషన్ కింద రెండు బోర్లు వేయించాను. అనంతరం 2006 వరకు సంతోషంగా పంటలు పండించకున్నాను. 2006లో పళ్సీకర్ రంగారావు ప్రాజెక్టు నిర్మాణ సమయంలో విద్యుత్ స్తంభాలను తొలగించారు. దీంతో నేను వేసిన బోర్లు అసౌకర్యానికి గురై మూలనపడ్డాయి. దీంతో రబీ సీజన్‌లో పంట మూగబోయింది.

ప్రాజెక్టు నిర్మాణం పూర్తైన తర్వాత కట్ట కిందకి నీరు వెళ్లడానికి అనువైన నిర్మాణాలు చేపట్టలేదు. దీంతో కట్టపై పడిన వర్షపునీరు మొత్తం పంటపొలాల్లోకి వచ్చి ఖరీఫ్ సీజన్ కూడా చేదు అనుభవాన్నే మిగిల్చింది. అయినా, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఇంట్లో ఉన్న బంగారం తాకట్టు పెట్టి విద్యుత్ సప్లైకి సంబంధించిన పనులను పూర్తి చేసుకున్నాము. ఈ సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు అది కూడా పాడైంది. తీసుకున్న అప్పు పెరిగిపోయింది. వడ్డీ కాస్త రెట్టింపు అయ్యింది. విద్యుత్, ఇరిగేషన్ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదు.’’ అని రైతు ఆనంద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే రిలే నిరాహారదీక్ష చేపట్టినట్లు తెలిపారు. అయినా, అధికారులు, ప్రభుత్వం పట్టించుకోకపోతే ఇక మరణమే దిక్కు అని కన్నీరుమున్నీరు అయ్యాడు.

Next Story