రైతులకు నష్టాలు.. ధాన్యం విక్రయాల్లో దళారుల అడ్డదారులు

by  |
రైతులకు నష్టాలు.. ధాన్యం విక్రయాల్లో దళారుల అడ్డదారులు
X

దిశ, కాటారం: ఆరుగాలం శ్రమించి రైతులు పండించిన వరి ధాన్యాన్ని.. మద్దతు ధరకు విక్రయించి లాభం పొందాలన్న రైతుల ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆలస్యంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కావడం, ఇప్పుడు అల్పపీడన ప్రభావం మూలంగా వర్షాలు పడడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ధాన్యం విక్రయానికి రైతులు ఈ ఏడాది అష్టకష్టాలు పడుతున్నారు. తేమ, తరుగు, నూకల పేరిట రైస్ మిల్లర్లు రైతులకు తీవ్రంగా కోతలు విధిస్తుండడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. కొన్ని రోజులుగా రైస్ మిల్లులకు ధాన్యం తరలింపు చేసేందుకు కాంట్రాక్టర్ కొనుగోలు కేంద్రాలకు లారీలను కేటాయించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. రైతులు రోజుల తరబడి కల్లాల వద్దనే వేచి చూస్తున్నారు. చివరకు చేసేదేమీ లేక రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు.

ఇదే అదనుగా భావించిన గ్రామాల్లోని దళారులు రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుంటున్నారు. ప్రభుత్వ మద్దతు ధర చెల్లించకుండా క్వింటాకు 1,500 నుండి 1,650 ధర చెల్లిస్తున్నారు. కాటారం, మహదేవ్‌పూర్ మండలాల నుండి పక్క జిల్లా మంచిర్యాల ప్రాంతానికి ఈ ప్రాంతంలో దళారులు ఖరీదు చేసిన వరి ధాన్యాన్ని ఆ ప్రాంతాల్లోని ఐకేపీ సెంటర్లకు చేరవేస్తున్నారు.

పొరుగు జిల్లాలోని ఐకేపీ సెంటర్ నిర్వాహకులతో దళారులు ఒప్పందాలు కుదుర్చుకొని.. దళారులకు దగ్గరగా ఉన్న ఆ ప్రాంత రైతుల జాబితా, సెల్ నెంబర్లను ఐకేపీ సెంటర్ నిర్వాహకులకు ఇస్తున్నారు. లోడింగ్ పూర్తయిన వెంటనే తమకు అనుకూలంగా ఉన్న ఐకేపీ సెంటర్లకు లారీలను తరలిస్తున్నారు. ఇలా అక్రమ వ్యాపారం చేస్తూ దళారులు క్వింటా ధాన్యానికి సుమారు 200 రూపాయల లాభాన్ని ఆర్జిస్తున్నట్లు సమాచారం. కాటారం సబ్ డివిజన్ పరిధిలో ధాన్యం కొనుగోలు బాగా మందగించడంతో ఈ ప్రాంతం నుండి పొరుగు జిల్లా మంచిర్యాలకు ప్రతిరోజు దళారులు ధాన్యం రవాణా చేస్తూ మోసాలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. మిల్లర్లు సైతం ఐకేపీ సెంటర్ల ద్వారా వచ్చే ధాన్యానికి రూ. 50 వరకు కోత విధించి కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. ఫలితంగా ఈ ప్రాంత రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించుకునే పరిస్థితి లేక ఆర్థికంగా నష్టపోతున్నారు.

ధాన్యం రవాణాలో మడత పేచీ?

కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తూకం జరిగిన పిదప బస్తాలను రైస్ మిల్లులకు లారీల ద్వారా తరలిస్తారు. ఇప్పుడు ధాన్యం రవాణా చేయడంలో కిరాయి గిట్టుబాటు కావడం లేదంటూ లారీ కాంట్రాక్టర్ పూర్తిస్థాయిలో లారీలను ఆయా కొనుగోలు కేంద్రాలకు కేటాయించక పోతుండటంతో కాంటా అయిన బస్తాలు కేంద్రాల్లోనే ఉండిపోతున్నాయి. ఈ ఏడాది కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్లులకు ధాన్యం రవాణా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలువలేదు. గత ఏడాది రవాణా రేటు తోనే లారీ కాంట్రాక్టర్లు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. రవాణా చార్జీలు ఒప్పందం కుదుర్చుకునే ముందే డీజిల్ ధరలు పెరిగాయి. ప్రభుత్వం టెండర్లు పిలవకపోవడంతో ధాన్యం రవాణా చేసేందుకు కొత్త వారికి అవకాశం లభించలేదు.

ఇదే అదనుగా గత ఏడాది కాంట్రాక్టర్ ప్రభుత్వంతో అగ్రిమెంట్ అప్పటి రవాణా చార్జీల ప్రకారం రవాణా చేసేందుకు అగ్రిమెంట్ చేసుకున్నారు. ద్వారా ఈ కాంట్రాక్టు ఎవరికీ చెందకుండా వ్యవహరించారు. కొన్ని రోజుల పాటు ధాన్యం రవాణా చేసిన ట్రాక్టర్ ఇప్పుడు రవాణా చార్జీలు గిట్టుబాటు కావడం లేదని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పూర్తిస్థాయిలో లారీలను సరఫరా చేయకపోతుండడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య తేలకపోవడంతో కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తూకం చేయడంలో ఆలస్యం అవుతుండడంతో ధాన్యం కుప్పలు పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మరి కొన్ని నెలల పాటు ఖరీఫ్ సీజన్ ధాన్యం విక్రయాల కోసం రైతులు కేంద్రాల్లోనే పడిగాపులు పడాల్సి వస్తుంది.



Next Story

Most Viewed