రైతులకు కోలుకోలేని దెబ్బ.. పాలేరులో వర్ష బీభత్సం

by  |
రైతులకు కోలుకోలేని దెబ్బ.. పాలేరులో వర్ష బీభత్సం
X

దిశ, పాలేరు : నియోజకవర్గంలో సోమవారం రాత్రి ఒక్కసారిగా గాలి వాన, ఈదురు గాలులు వీచడంతో ఖమ్మం- సూర్యాపేట ప్రధాన రహదారిపై భారీగా చెట్లు విరిగి పడ్డాయి. దీంతో పాలేరు ప్రధాన రహదారి పై వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనితో ఖమ్మం సూర్యాపేట జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పాలేరు- చౌటపల్లి రహదారి మార్గం మధ్యలో పలు చెట్లు, కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. నియోజకవర్గంలో పలు కరెంట్ స్తంభాలు నెలకొరగడంతో విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

రైతన్నకు తీవ్ర నష్టం..

ఇక రైతుల ఆశలు మాత్రం మరోసారి ఆవిరయ్యాయి. ఈదురుగాలులతో వర్షం కురవడంతో రైతుల ఆశలపై వరుణుడు నీళ్ళు చల్లాడు.గాలి దూమరంతో వర్షం పడి రైతాంగానికి అపార నష్టం వాటిల్లింది.సోమవారం రాత్రి కురిసన భారీ వర్షానికి చేతికి వచ్చిన పంట నేలపాలైంది. ఆరుగాలం శ్రమించిన రైతాంగానికి చివరికి కన్నీరే మిగిలింది. ఒక్కసారిగా అన్నదాత కుదేలైపోయాడు.పాలేరు,కూసుమంచి ప్రాంతంలో రాత్రి భారీ వర్షం కురిసింది. పంట కోతకు వచ్చిన సమయంలో గాలి దూమరంతో వర్షం రవడంతో పంట నేలవాలింది. వేలాది ఎకరాలు సాగర్‌ ఎడమ కాలువ ఆయకట్టు ప్రాంతంలోని జెక్కేపల్లి, ఈశ్వరమాధారం,పెరికసింగరం చెన్నారం పరిధిలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షంతో పంటకు తీవ్ర నష్టం కలిగింది మండలంలోని అనేక చోట్ల రైతులు కోసిన, ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. కల్లాల్లో, రోడ్ల మీద ధాన్యం ఆరబెట్టగా రాత్రి కురిసిన వర్షం వల్ల తడిసిపోయింది.

ఇంటిపై కప్పులు ఎగిరిపోయి..

అకాల వర్షం, ఈదురు గాలులకు చెట్లు కూలిపోయి రోడ్డుకు అడ్డంగా పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం ఉరుములు, మెరుపులతో ఈదురు గాలులు వర్షంతో రాత్రి 9గంటల నుంచి కరెంటు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తురకగూడెం,కూసుమంచి, గట్టుసింగరం,తల్లంపాడు గ్రామల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది.ఇళ్ళపై కప్పులు ఎగిరిపోయి నానా అవస్థలు పడుతున్నారు.మండలంలో ఈదురుగాలులతో కూడిన వర్షం వల్ల వరి, మామిడి రైతులకు తీరని వేదనని మిగిల్చింది. పెద్ద ఎత్తున కోతకొచ్చిన వరి పంట, మామిడి తోటలు ధ్వంసం అయ్యాయి. వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. వందల ఎకరాలలో మామిడి కాయలు నేలరాలాయి.కళ్ళల్లో ఉన్న మిర్చి తడిసి ముద్దయింది.


Next Story

Most Viewed