రైతుల డిమాండ్లు న్యాయమైనవే.. కేంద్రం వినడం లేదు : మేఘాలయ గవర్నర్

by  |
meghalaya governor satyapal malik
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సుమారు మూడున్నర నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో పోరాటం చేస్తున్న రైతుల పోరాటాలు న్యాయమైనవే అని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం వారి సమస్యలను తప్పక వినాలని సూచించారు. ఉత్తరప్రదేశ్‌లో భాగ్‌పట్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుల పోరాటంపై ఆవేదన చెందిన తాను ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశాననీ, కానీ వారినుంచి తనకు ఎలాంటి రిప్లై రాలేదని అన్నారు. రైతుల బాధను తాను అర్థం చేసుకోగలనని, తాను కూడా రైతు కొడుకునే అని ఆయన తెలిపారు.

దేశ రాజధాని సరిహద్దుల్లో పోరాటం చేస్తున్న రైతులపై బలవంతమైన చర్యలకు పాల్పడవద్దని.. అలా చేస్తే ఈ సమస్య పరిష్కారం కాదని సత్యపాల్ మాలిక్ అన్నారు. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)పై లీగల్ గ్యారెంటీ ఇస్తే రైతుల సమస్యను తాను పరిష్కరిస్తానని చెప్పారు. సిక్కు వర్గీయులు (పోరాటం చేస్తున్న వారిలో ఎక్కువ మంది పంజాబ్ నుంచే ఉన్నారు) వెన్ను చూపేవారు కాదని.. వారిని తక్కువగా అంచనా వేయొద్దని అన్నారు. రైతులు, సైనికులు సంతృప్తిగా లేని దేశం అభివృద్ధి దిశలో పయనించదని ఆయన తెలిపారు.


Next Story