‘ వచ్చేనెల 1న పార్లమెంట్ మార్చ్’

by  |
‘ వచ్చేనెల 1న పార్లమెంట్ మార్చ్’
X

న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీ సరిహద్దుల్లో ట్రాక్టర్ ర్యాలీ తలపెట్టిన రైతు సంఘాల నాయకులు ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా వచ్చే నెల 1న ‘పార్లమెంట్ మార్చ్’ నిర్వహించాలని నిర్ణయించారు. అదే రోజున కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనుండటం గమనార్హం. క్రాంతికారి కిసాన్ యూనియన్ నేత దర్శన్ పాల్ మాట్లాడుతూ… కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని, అప్పటి వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని పునరుద్ఘాటించారు.

ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలోని ఢిల్లీలోని వేర్వేరు చోట్ల నుంచి కాలినడకన పార్లమెంట్‌కు మార్చ్ నిర్వహిస్తామని తెలిపారు. మంగళవారం నిర్వహించే ట్రాక్టర్ ర్యాలీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రైతుల బలం ఏమిటో తెలుస్తుందని, వ్యవసాయ చట్టాల వ్యతిరేక ఉద్యమం కేవలం పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాలేదని దేశం మొత్తం కొనసాగుతుందని స్పష్టం అవుతుందని పేర్కొన్నారు. ఇప్పటివరకు ప్రతీ ఒక్క నిరసన కార్యక్రమం కూడా శాంతియుతంగా జరిగిందని, భవిష్యత్తులో కూడా అలాగే కొనసాగుతుందని తెలిపారు. ట్రాక్టర్ ర్యాలీ కోసం వచ్చిన రైతులు ఎవరూ ఇప్పుడప్పుడే వెనక్కి వెళ్లరని, వాళ్లు కూడా తమ ర్యాలీలో పాల్గొంటారని చెప్పారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళనలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.


Next Story