‘సన్నాల’కు ‘సున్నం’ కొట్టారు

by  |
‘సన్నాల’కు ‘సున్నం’ కొట్టారు
X

దిశ, తెలంగాణ బ్యూరో: సర్కారుకు సన్నాల సెగ బాగానే తగిలింది. సీఎం కేసీఆర్​ చెప్పినవన్నీ ఉత్తిమాటలేనని తేలిపోయింది. ఎలాంటి ప్రణాళిక లేకుండా నియంత్రిత సాగును రైతులపై రుద్దారని స్పష్టమైంది. వానాకాలంలో సన్నాల సాగు హైప్​ తీసుకువచ్చిన ప్రభుత్వం యాసంగికి వచ్చేసరికే మాట మార్చింది. వరిసాగు, అందులోనూ సన్నాలు వద్దంటూ రైతులకు అవగాహన కల్పిస్తోంది. బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయకుండానే వ్యవసాయ శాఖతో గ్రామాలలో ప్రచారం చేయిస్తోంది. సన్నాల పేరెత్తితేనే అగ్గిమండుతున్న రైతులు ప్రభుత్వ ఉచిత సలహాలను స్వీకరించడం లేదు. ‘‘సన్నాలను సాగు చేయమన్నవు…అమ్ముకునే సమయంలో అదనపు ధర ఇప్పిస్తానన్నావు​. ఆ సంగతే మరిచిపోయావ్. ​ఇప్పుడు సన్నాలను కొనేవాడే లేడు. నిండా మునిగాం’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యతిరేకతను గుర్తించిన ప్రభుత్వం వరికి ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతోంది.

‘నియంత్రిత’ లేనట్టే?

ముందస్తు ఆలోచన లేకుండా మొదలుపెట్టిన నియంత్రిత సాగు విధానం తప్పని రూఢీ అయింది. ప్రభుత్వం తెచ్చే వ్యవసాయ విధానాలనే తప్పు పట్టేంత స్థాయిలో బోల్తా పడింది. ఆ తప్పును కప్పిపుచ్చుకునేందుకు నానా తంటాలు పడాల్సి వస్తోంది. తెలంగాణ సోనా, షుగర్​ ఫ్రీ రైస్​ అంటూ చేసిన ప్రచారం పనికిరాకుండా పోయింది. అసలు సన్నాలను కొనేవారు లేరు. గతంలో కంటే చాలా తక్కువ ధర వస్తోంది. మిల్లర్లు అయితే వాటిని ముట్టుకోవడం లేదు. వడ్లు చేతికి వచ్చి నెలన్నర గడుస్తున్నా కల్లాల్లోనే ఉన్నాయి. మద్దతు ధర దొడ్డు వాటితో సమానంగా వస్తోంది. దొడ్డు రకాలను సాగు చేస్తే ఎంతో కొంత లాభాలు ఉంటాయి. సన్నాలతో పెట్టుబడి నుంచి చేతికి వచ్చే వరకూ అన్నీ సమస్యలే. వాటిని అధిగమించినా కొనుగోళ్లు లేవు.

ఆయిల్ పాం అంటూ..

వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్​ పాం అంటూ ప్రగతిభవన్​ నుంచి సీఎం కేసీఆర్​ పేరుతో ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఇది కూడా విమర్శలకు తావిస్తోంది. ఆయిల్​ పాం సాగు ఇబ్బందులతో కూడుకున్నదే. క్రయవిక్రయాల సమస్యలూ ఉంటాయి. ఒకవిధంగా సాగు మంచిదే అయినా, ప్రాసెసింగ్​ ఫ్లాంట్ల ఏర్పాటు సాధ్యం కాదు. శాస్త్రవేత్తలు నిర్ధారించిన భూములలోనే ఆయిల్​ పాం సాగు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు మట్టి నమూనాలే రాలేదు. శాస్త్రవేత్తలు ఎక్కడా నిర్ధారించలేదు. దేశంలో నూనెలకు కొరత ఉంటుందని, దిగుమతులు చేసుకుంటున్నామని, ఆయిల్ ​పాంకు సంక్షేభం రాదని చెబుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా లక్షల ఎకరాలలో సాగు కష్టమైన పని. ఇక ఒక్కసారి గెలలను కట్​ చేసి పెడితే., మూడు గంటల్లోనే ప్రాసెసింగ్​ యూనిట్లకు చేరాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితులలో ప్రాసెసింగ్​ యూనిట్లు లేవు. ఉన్నవి హైదరాబాద్​ చుట్టుపక్కల్లోనే ఉన్నాయి. దీంతో గెలలు కట్​చేసి వెంటనే ప్లాంట్లకు చేర్చాలంటే కొంత కష్టమైన పనే. ముందుగా జిల్లా కేంద్రాల్లో ఈ యూనిట్లను ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు.

ఇప్పుడెలా?

సన్నాల సాగుకు ప్రణాళికలు వేసిన అధికారులపై సీఎం కేసీఆర్​ గుర్రుగా ఉన్నారు. మద్దతు ధర రూపాయి కూడా పెంచేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. స్థానికంగా వందో, రెండొందలో పెంచే పరిస్థితీ కనిపించడం లేదు. దీంతో ఇప్పుడు రైతులను ఈ విధానం నుంచి మార్పించాలనే దారులను వెతుకుతున్నారు. గ్రామాలలో వ్యవసాయ శాఖ నుంచి వినూత్న ప్రచారం మొదలైంది. వాస్తవంగా ఈ ప్రచారం ప్రభుత్వమే చేయిస్తోందనే వాదన ఉంది. మన పత్తికి మంచి డిమాండ్​ ఉందని, ఆయిల్ పాం వేస్తే 30 ఏండ్లు ఢోకా ఉండందంటూ రైతులకు చెబుతోంది. ఇప్పటికే సన్నాల సాగును నమ్మిన రైతులు వ్యవసాయ శాఖ సూచనలను తీసిపారేస్తున్నారు.



Next Story