తలపై తుపాకీ పెట్టి… రూ.50 లక్షలు డిమాండ్

by  |
తలపై తుపాకీ పెట్టి… రూ.50 లక్షలు డిమాండ్
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: మావోయిస్టుల పేరు చెప్పి సింగ‌రేణి ఉద్యోగి వ‌ద్ద నుంచి భారీగా డబ్బు వ‌సూలు చేయ‌డానికి య‌త్నించిన న‌కిలీ మావోయిస్టు ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘ‌ట‌న ఖ‌మ్మం జిల్లా స‌త్తుప‌ల్లి పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో ఆదివారం జ‌రిగింది. సత్తుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగరేణి మహాలక్ష్మి క్యాంప్‌లో హెచ్ఆర్‌ మేనేజర్‌గా ప‌నిచేస్తున్న జితేంద‌ర్ ఇంటికి కొద్దిరోజుల క్రితం కొంతమంది చేరుకుని మావోయిస్టులుగా చెప్పుకున్నారు. మావోయిస్టు క‌మిటీకి ఫండ్ కావాల‌ని రూ.50ల‌క్ష‌లు ఇవ్వాల్సిందేన‌ని డిమాండ్ చేశారు. అయితే అంత మొత్తం ఇవ్వ‌లేనని జితేంద‌ర్ చెప్ప‌డంతో త‌ల‌పై తుపాకి పెట్టి అడిగినంత ఇవ్వాల‌ని లేదంటే చంపేస్తామ‌ని బెదిరింపుల‌కు దిగారు. ఇంత ఆక‌స్మాత్తుగా అడిగితే ఇవ్వలేన‌ని త‌న‌కు కొంచెం టైం కావాల‌ని చెప్పి అత్య‌వ‌స‌రంగా రూ.5ల‌క్ష‌లు స‌ర్దుబాటు చేసి అంద‌జేశాడు. మిగ‌తా మొత్తం కొద్దిరోజుల్లోనే తయారు చేస్తాన‌ని చెప్ప‌డంతో మావోల న‌కిలీ ముఠా స‌భ్యులు వెళ్లిపోయారు. అయితే ఇటీవ‌ల డ‌బ్బుకోసం మ‌ళ్లీ ట‌చ్‌లోకి రావ‌డంతో జితేంద‌ర్ అస‌లు విష‌యం పోలీసుల‌కు తెలిపాడు. దీంతో అమౌంట్ అంద‌జేస్తామ‌ని చెప్ప‌డంతో ఆదివారం స‌త్తుప‌ల్లికి చేరుకున్న న‌కిలీ మావోయిస్టుల‌ ముఠాను సత్తుపల్లి పట్టణ పోలీసులు, టాస్క్ఫోర్స్ సిబ్బంది వ‌ల‌ప‌న్ని ప‌ట్టుకున్నారు. నిందితులు విజయలక్ష్మీ, మనోజ్‌, హరీశ్‌ల‌ను అరెస్ట్ చేశారు. మ‌రో వ్య‌క్తి ప‌రారీలో ఉన్నాడు. నిందితులంతా హైదరాబాదు, మెదక్ జిల్లాలకు చెందిన వారీగా పోలీసులు ప్రాథ‌మికంగా గుర్తించారు. నిందితుల వ‌ద్ద నుంచి 2 పిస్టళ్లు, 2 కార్లు, రూ.2.80లక్షల నగదును ల‌భించిన‌ట్టు పోలీసులు తెలిపారు. ఈ ముఠాను అరెస్ట్ చేసిన వారిలో సత్తుపల్లి ఏసీపీ వెంకటేష్, టాస్క్ ఫోర్స్ ఏసీపీ వెంకటరావు, సత్తుపల్లి ఇన్‌స్పెక్ట‌ర్ రమాకాంత్చ‌, ఎస్సై నరేష్, క్రైమ్ సిబ్బంది యన్. లక్ష్మణ్, టి. గోపాలకృష్ణ, కే.రామకృష్ణ పాల్గొన్నారు.



Next Story

Most Viewed