ఇన్నోవేటర్ ప్రదర్శన దరఖాస్తు చివరి తేదీ పొడిగింపు

by  |

దిశ, మహబూబ్ నగర్: తెలంగాణ రాష్ట్రంలో ఇన్నోవేషన్ ప్రదర్శనకు దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 31 వరకు పొడగించినట్లు జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణలోని మొత్తం 33 జిల్లాలు ఒకేసారి ఆయా జిల్లాల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఆన్ లైన్ లో ఆవిష్కరణల ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందన్నారు. ఈ ప్రదర్శన జిల్లా స్థాయి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉంటుందన్నారు. ఈ ప్రదర్శనలో పాల్గొనడానికి అన్ని రంగాల, వర్గాల ఆవిష్కరణలు ప్రోత్సహించనున్నట్లు ఆయన తెలిపారు. గ్రామీణ ఆవిష్కరణ, విద్యార్థుల ఆవిష్కరణ, ప్రారంభ ఆవిష్కరణలు, సూక్ష్మ మరియు చిన్న తరహా పరిశ్రమలలో ఆవిష్కరణలు మొదలైనవి ప్రదర్శనకు అంగీకరించబడతాయని ఆయన వెల్లడించారు. ఇన్నోవేటర్లు తమ ఆవిష్కరణకి సంబంధించిన రెండు నుంచి మూడు నిమిషాల వీడియోను, ఆవిష్కరణ యొక్క నాలుగు ఫోటోలు, ఆవిష్కరణకు సంబంధించిన వివరణ, ఆవిష్కర్త పేరు, వయసు, వృత్తి, ఊరు, జిల్లా వివరాలు 9100678543 కి వాట్సాప్ చేయాలని కలెక్టర్ సూచించారు. దరఖాస్తులను స్వీకరించడానికి చివరి తేదీ 31 జులై 2020 వరకు ప్రభుత్వం పొడగించబడిందని, అందువల్ల జిల్లాలోని ఆవిష్కర్తలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన చెప్పారు. అందుకున్న దరఖాస్తుల నుండి మొదటి విశ్లేషణ తరువాత, ఆవిష్కర్తలు మరియు వారి ఆవిష్కరణలు ఎంపికచేయబడతాయని ఆయన వెల్లడించారు. ఆవిష్కరణల ఎంపిక పూర్తిగా రాష్ట్ర స్థాయిలోనే జరుగుతుందని కలెక్టర్ వెల్లడించారు.


Next Story