ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌పై ఉత్కంఠ

by  |
ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌పై ఉత్కంఠ
X

దిశ, భద్రాచలం: ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు ఇచ్చిన తీర్పు బ్యాలెట్ బాక్సుల్లో భద్రంగా ఉంది. బుధవారం కౌంటింగ్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో గెలుపు ఓటమిలపై రాజకీయ నాయకుల్లో హైటెన్షన్ నెలకొంది. ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నాయకులు పోలింగ్ సరళిపై ఆరా తీస్తున్నారు. మనకి ఎన్ని ఓట్లు పడ్డాయి. ప్రత్యర్థులు ఎన్ని ఓట్లు వేయించుకున్నారనే లెక్కల్లో ప్రధాన పార్టీలు తలమునకలైనాయి.‌ మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇచ్చారు. రెండవ ఓటు ఎవరికి వేశారనే విషయమై రకరకాలుగా కూపీ లాగుతున్నారు. గెలిస్తే సంబురాలు చేసుకోవడానికి సన్నద్ధమైనారు.‌ ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం త్వరలో జరగబోయే ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలపై ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఆ క్రమంలోనే ఓట్లేసిన ఓటర్ల కంటె సామాన్య ప్రజలు, రాజకీయ అభిమానులు ఎమ్మెల్సీ ఫలితాలపై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొన్ని గంటల్లో ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఎక్కడ చూసినా ఎమ్మెల్సీ ఫలితాల చర్చే వినిపిస్తోంది

నోట్లు గట్టెక్కిస్తాయా..?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయావకాశాలపై జోరుగా చర్చ జరుగుతోంది. సాధారణ ఓటర్ల మాదిరిగానే పట్టభద్రులు ప్రలోభాలకి లొంగారా లేక సొంత నిర్ణయానికి కట్టుబడి ఓట్లు వేశారా అనేది అంతుచిక్కడం లేదు. ఓటుకి వెయ్యి వంతున నోట్లు పంచిన అధికార పార్టీ నాయకులు ఈసారి సునాయాశంగా గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే డబ్బులు పంచినా పట్టభద్రులు అమ్ముడు పోలేదని, ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఫలితం రాబోతున్నదనే అంచనాల్లో విపక్షాలు ఉన్నాయి. తాము గెలవకపోయినా అధికార పార్టీ ఓడితేచాలు అని వారు ఆశిస్తున్నారు. ప్రభుత్వ అనుకూల ఓటు చెక్కు చెదరకుండా గంపగుత్తగా పార్టీకి పడిందని టీఆర్ఎస్ నాయకులు లెక్కలు వేస్తున్నారు. ఎక్కువ సంఖ్యలో ఉన్న కాంట్రాక్టు లెక్చరర్లు, చివరి క్షణాల్లో పిఆర్‌సి విషయమై సీఎం కెసిఆర్ ఇచ్చిన స్పష్టమైన హామీ మేరకు ఉద్యోగ, ఉపాధ్యాయుల మెజారిటీ ఓట్లు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా పడ్డాయని, వీటికితోడు రకరకాల ప్రయత్నాల ద్వారా రాబట్టు’కొన్న’ ఓట్లతో విజయం ఖాయమని గులాబీ పార్టీ నాయకులు ధీమాగా ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడం కూడా తమ గెలుపుకి సూచన అని చెబుతున్నారు.

సైలెంట్ ఓటింగ్ ఎవరికి లాభం..‌?

ఎవరికి వారు మేము గెలుస్తామనే లెక్కలు వేసుకొంటున్నారు. సైలెంట్ ఓటింగ్ ఎవరికి మేలు చేస్తుందనేది ప్రశ్నార్థకంగా ఉంది. పట్టభద్రుల ఓటింగ్ సరళి అంతు చిక్కకుండా ఉంది. ఒకరికే ఓటు వేసి వదిలేశారా లేక ఇతర ప్రాధాన్యత ఓట్లు వేశారా, ఒకవేళ ఎక్కువ మందికి ఓటేస్తే ఎవరికి ఏ ప్రాధాన్యత స్థానం కల్పించారనేది రాజకీయ నాయకులు గెస్ చేయలేక తలలు పట్టుకుంటున్నారు. ప్రాధాన్యతలు మారితే ఫలితం తారుమారు అవుతుందని ఆందోళన చెందుతున్నారు. ఓటరు దగ్గరకు వచ్చి ఓటు వేయమని పోటీలో ఉన్న అభ్యర్థుల తరపున ఎవరు వచ్చి అడగకపోయినా పట్టభద్రులు బరిలో నిలిచిన అభ్యర్థుల సమర్థత గురించి ఆలోసించి తమ ఓటింగ్‌లో వారికి ప్రాధాన్యత కల్పించినట్లుగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని కొందరు పట్టభద్రులు బాహాటంగా చెప్పడం గమనార్హం. ఇలాంటి వ్యాఖ్యలు గెలుపుని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అధికార పార్టీ నాయకుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. నోట్లు ఇచ్చినా ఇతరులకు ఓట్లు వేయకుండా కట్టడి చేయలేకపోయామా అని నాయకులు మథనపడుతున్నారు. ఈ తరహా సైలెంట్ ఓటింగ్ కొంప ముంచుతుందాయని ఆరా తీస్తున్నారు.



Next Story

Most Viewed