నిరీక్షణ.. విరాట్ కోహ్లీ ఇప్పుడైనా ఆ పని చేస్తాడా..?

by  |
నిరీక్షణ.. విరాట్ కోహ్లీ ఇప్పుడైనా ఆ పని చేస్తాడా..?
X

దిశ, స్పోర్ట్స్: ఐసీసీ నిర్వహిస్తున్న అరంగేట్రం వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మరి కొద్ది గంటల్లో ఇంగ్లాండ్‌లోని సౌతాంప్టన్ వేదికగా ప్రారంభం కానున్నది. ఇండియా, న్యూజీలాండ్ జట్లు ఇప్పటికే ఫైనల్ ఆడనున్న 15 మంది క్రికెటర్లను ప్రకటించాయి. ఇరు జట్ల నుంచి నలుగురుని పక్కన పెట్టి రేపు టాస్ సమయానికి తుది జట్టును ప్రకటిస్తారు. భారత జట్టు కూర్పు ఎలా ఉన్నా అందరి కళ్లు మాత్రం కెప్టెన్ విరాట్ కోహ్లీ పైనే ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు. పరుగుల యంత్రంగా పేరు పడిన కోహ్లీ బ్యాటు నుంచి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు వస్తున్నా.. అభిమానులు ఆశిస్తున్న భారీ స్కోర్లు మాత్రం రావడం లేదు. ఏడాదిన్నరకు పైగా కోహ్లీ ఖాతాలో ఒక్క సెంచరీ కూడా లేదంటే నమ్మడం కష్టమే. అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ అత్యధిక సెంచరీల రికార్డు అధిగమించే క్రికెటర్ కోహ్లీనే అని క్రికెట్ దిగ్గజాలు కూడా వ్యాఖ్యానిస్తున్న సందర్భంలో.. గత 17 నెలలుగా కోహ్లీ కనీసం ఒక్క సెంచరీ కూడా చేయకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. మరోవైపు భారత జట్టుకు కెప్టెన్‌గా ఒక్క ఐసీసీ ట్రోఫీను కూడా అందించలేకపోవడం కూడా కోహ్లీ కెరీర్‌లో పెద్ద లోటుగా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న డబ్ల్యూటీసీ మ్యాచ్‌లో అందరి చూపూ కోహ్లీ పైనే ఉన్నది.

సెంచరీ కొట్టాల్సిందే..

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో చాలా కాలం పాటు టెస్టు టాపర్‌గా ఉన్న విరాట్ కోహ్లీ ఇటీవల క్రమంగా ర్యాంకును కోల్పోతున్నాడు. అడపా దడపా అర్ద సెంచరీలు చేస్తూ జట్టు విజయాల్లో భాగస్వామ్యమవుతున్నా.. సెంచరీ లేని లోటు మాత్రం అలాగే మిగిలిపోయింది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో విరాట్ మ్యాచ్ విన్నింగ్స్ స్కోర్లు అందించాడు. అయితే 2019 నవంబర్‌లో ఈడెన్ గార్డెన్‌లో చేసిన సెంచరీనే చివరిది. ఆ తర్వాత 5 టెస్టులు, 15 వన్డేలు ఆడిన కోహ్లీ ఒక్కసారి కూడా మూడంకెల సంఖ్యను అందుకోలేక పోయాడు. ఇక న్యూజీలాండ్ మీద చివరి సారి 2016లో సెంచరీ నమోదు చేశాడు. మధ్యలో కరోనా కారణంగా పలు సిరీస్‌లు రద్దవడం వల్ల ఎక్కువ మ్యాచ్‌లు కూడా ఆడకపోవడం కోహ్లీకి కలసి రాలేదు.

అయితే సౌతాంప్టన్ పిచ్ కోహ్లీకి అనుకూలంగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. బౌన్సీ పిచ్ మీద కోహ్లీ చాలా చక్కగా బ్యాటింగ్ చేసిన అనుభవం ఉంది. ఒక వేళ టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తే మాత్రం టాపార్డర్‌లో కోహ్లీదే కీలక పాత్ర అవుతుంది. కోహ్లీ కెప్టెన్‌గా ఇప్పటి వరకు 41 సెంచరీలు చేసి రికీ పాంటింగ్‌తో సమానంగా ఉన్నాడు. ఒక్క సెంచరీ చేస్తే కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్‌గా కోహ్లీ చరిత్ర సృష్టిస్తాడు. అందుకే డబ్ల్యూటీసీ ఫైనల్‌లోనే కోహ్లీ సెంచరీ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఐసీసీ ట్రోఫీ కల తీరేనా?

టీమ్ ఇండియా కెప్టెన్‌గా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవని చెత్త రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉన్నది. కోహ్లీ గురువుగా భావించే ఎంఎస్ ధోనీ టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్, ఐసీసీ ఛాంపియన్స్‌ట్రోఫీతో పాటు టెస్టుల్లో నెంబర్ వన్ జట్టుగా నిలిపిన ఘనతను సొంతం చేసుకున్నాడు. అయితే కోహ్లీ నాలుగేళ్లకు పైగా టీమ్ ఇండియా కెప్టెన్‌గా ఉన్నా.. ఇంత వరకు ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేదు. ఒక సారి టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో ఓడిపోగా.. 2019లో న్యూజీలాండ్‌పై సెమీస్‌లో ఓడిపోయింది. తాజాగా ఐసీసీ అరంగేట్రం డబ్ల్యూటీసీ ట్రోఫీని అందుకునే అవకాశం కోహ్లీకి వచ్చింది. ఇన్నాళ్ల కలను తీర్చుకోవడానికి టీమ్ ఇండియా కెప్టెన్‌కు ఇదే మంచి సదవకాశమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు న్యూజీలాండ్ క్రికెట్ జట్టు కూడా ఇంత వరకు ఒక్కసారి కూడా ఐసీసీ ట్రోఫీని గెలవలేదు. 2015, 2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌ వరకు వెళ్లినా రెండు సార్లూ ఓడిపోయింది. ఇక ఈ అరంగేట్రం టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఇండియాతో పాటు అర్హత సాధించిన న్యూజీలాండ్ కూడా ఐసీసీ ట్రోఫీపై కన్నేసింది. కోహ్లీ లాగే కివీస్ కూడా ఐసీసీ ట్రోఫీ కలను తీర్చుకోవడానికి డబ్ల్యూటీసీ ఫైనల్ బరిలోకి దిగుతున్నది. మరి ఇద్దరిలో ఎవరి కల నెరవేరుతుందో వేచి చూడాల్సిందే.

Next Story

Most Viewed