ఇప్పుడు కరోనా కేరాఫ్.. యూరప్

by  |
ఇప్పుడు కరోనా కేరాఫ్.. యూరప్
X

దిశ, వెబ్‌డెస్క్ : చైనా అంటే ఇప్పటికీ ప్రపంచమంతా ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని చూస్తున్నది. అందుకు కారణం ఆ దేశంలోని హుబెయి ప్రావిన్స్‌లో కరోనావైరస్(కోవిడ్ 19) మహమ్మారి వెలుగుచూడటమే. ప్రపంచవ్యాప్తంగా లక్ష మందికిపైగా సోకిన ఈ వైరస్ దాదాపు ఐదు వేల మందిని పొట్టనబెట్టుకుని గజగజ వణికిస్తున్నది. ఈ మహమ్మారి ఇప్పుడు ఐరోపాను ముచ్చెమటలు పట్టిస్తున్నది. వైరస్ వెలుగుచూసిన చైనాలో కంటే నేడు యూరప్‌లోనే రోజుకు అధికంగా ఈ వైరస్ కేసులు నమోదవుతున్నాయి. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఈ మహమ్మారికి కేరాఫ్.. యూరప్ అన్నది.

డబ్ల్యూహెచ్‌వో ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ సోకినవారి సంఖ్య సుమారు 1.32 లక్షలకు చేరింది. ఈ వైరస్ బారిన పడి దాదాపు ఐదువేల మంది మరణించారు. కాగా, 68వేల మంది ఈ వైరస్ బారి నుంచి బయటపడినట్టు కరోనావైరస్‌ను ట్రాక్ చేస్తున్న జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ తెలిపింది. ఈ వైరస్ ఇప్పుడు యూరప్ దేశాలను కుదిపేస్తున్నది. అన్ని యూరప్ దేశాల కంటే ఇటలీలో వేగంగా వ్యాపిస్తున్నది. అక్కడ సుమారు 17,660 మందికి ఈ వైరస్ సోకింది. కేవలం ఒక్క రోజులో(శుక్రవారం)నే సుమారు 250 మంది ఈ వైరస్ వల్ల చనిపోయారు. దీంతో వైరస్‌ కారణంగా మృతిచెందినవారి సంఖ్య 1,266కు చేరింది. ఇటలీ తర్వాత స్పెయిన్‌లో ఈ వైరస్ మరణాలు అధికమవుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే మృతుల సంఖ్య (120)రెట్టింపయింది. ఫ్రాన్స్‌లో 2,876 మందికి వైరస్ సోకగా.. 79 మంది చనిపోయారు. జర్మనీలో 3,062 పాజిటివ్ కేసులు తేలగా.. ఐదుగురు మరణించారు. యూకేలో 798 మందికి వైరస్ సోకింది. 11 మంది వైరస్ బారినపడి ప్రాణాలొదిలారు. చైనాలో ఈ వైరస్ కేసులు అధికంగా వుహాన్ సిటీలోనే నమోదయ్యాయి, నమోదవుతున్నాయి. కానీ, యూరప్ మాత్రం అలా కాదు. అందుకే ఈ దేశాలలో వైరస్ వ్యాప్తిపై ఆందోళనలు వెలువుడుతున్నాయి.

Tags: coronavirus, WHO, epicentre, europe, pandemic



Next Story

Most Viewed