నా వల్లే కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాడు.. ఈటల సంచలన వ్యాఖ్యలు

by  |
Etala Rajender
X

దిశ, కమలాపూర్: హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తనను ఓడించడానికి టీర్ఎస్ పార్టీ రెండువేల కోట్లు ఖర్చు చేయడానికైనా సిద్ధంగా ఉందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం ఏడోరోజు పాదయాద్రలో భాగంగా వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్‌ మండలంలోని గుండెడు, కొత్తపల్లి, కన్నూరు మీదుగా పాదయాత్ర సాగింది. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ… కేసీఆర్‌కు ముఖ్యమంత్రి కుర్చీ మరియు ప్రగతి భవనంపైన ఉన్న యావ, ప్రేమ తెలంగాణ ప్రజల మీద లేదని విమర్శించారు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల ఓటుకు తన ఎమ్మెల్యే పదవి పుట్టిందని, ఆ పదవితోనే కేసీఆర్‌కు ముఖ్యమంత్రి పదవి వచ్చిందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ బీ-ఫారమ్ తీసుకొని కేసీఆర్ గుర్తుతో గెలిచానని అంటున్నారని, మరి కేసీఆర్ కూతురు కవిత, మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఎందుకు గెలవలేదని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి పదవి కోసం తాను ఏనాడూ ఆశ పడలేదని అన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని రేపు ఒక్క హుజురాబాదే కాదని ప్రజలు ఇచ్చే శక్తితో యావత్ తెలంగాణ మొత్తం బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఉప ఎన్నిక కోసం రెండు వేల కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని అక్కడ భూములు అమ్మి ఇక్కడ ఖర్చు చేస్తారని, వారు ఇచ్చే పైసలు తీసుకొని మన ఇష్టం వచ్చినట్లు ఓటు వేయాలని సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రవేశ పెడుతున్న కొత్త పథకాలన్నీ ఈటల రాజేందర్ రాజీనామా వల్లనే అని తెలిపారు. యావత్ తెలంగాణ హుజురాబాద్ వైపు చూస్తోందని, హుజురాబాద్ గడ్డ ఏంటో, పౌరుషం ఏంటో కేసీఆర్‌కు తేల్చి చెప్పాలన్నారు. హుజురాబాద్ ప్రజలు పార్టీలతో జెండాలతో సంబంధం లేకుండా ఓట్లు వేస్తామని చెబుతున్నారని, రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.



Next Story

Most Viewed