నువ్వు ఎందో నాకు తెలుసు.. కరీంనగర్‌ను బొందలగడ్డగా మారుస్తున్నావ్ : ఈటల

by  |
నువ్వు ఎందో నాకు తెలుసు.. కరీంనగర్‌ను బొందలగడ్డగా మారుస్తున్నావ్ : ఈటల
X

దిశ, హుజురాబాద్ : కరీంనగర్‌ను బొందలగడ్డలా మారుస్తున్నావు, నువ్వు ఎన్ని ట్యాక్స్‌లు ఎగ్గొట్టావో నాకు తెలీదా అంటూ మంత్రి గంగుల కమలాకర్ పై మాజీ మంత్రి ఈటల రాజేందర్ పరోక్షంగా విమర్శలు చేశారు. మంగళవారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిల్లులు రావంటూ ప్రజా ప్రతినిధులను బెదిరింపులకు గురి చేస్తున్నావంటూ మండిపడ్డారు. ఒక్క రోజైనా హుజురాబాద్ ప్రజల బాధను పంచుకున్నారా ? ఇక్కడి వారి గెలుపులో మీరు సాయం చేశారా? అంటూ ఈటల ప్రశ్నల వర్షం కురిపించారు.

మంత్రిగా సంస్కారం సభ్యత ఉండాలని, బిడ్డా గుర్తు పెట్టుకో ఎవడూ వెయ్యేళ్ళు బతకడంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారం శాశ్వతం కాదని, హుజురాబాద్ ప్రజలను వేధిస్తున్నావంటూ ఫైర్ అయ్యారు. టైమ్ వచ్చినప్పుడు అన్నీ బయట పడతాయని విమర్శించారు. నీ కథ ఎందో అంతా తెలుసునని.. గుర్తు పెట్టుకో, 2023 తరువాత నువ్వు ఉండవు, నీ అధికారం అంతకన్నా ఉండదని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. నువు ఇప్పుడు ఏం చేస్తున్నావో అదే నీకు పునరావృతం అవుతుంది. అదే గతి నీకు పడుతుందని హెచ్చరించారు. 2006లో కరీంనగర్‌లో ఎంపీగా పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ నాయకులు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఎంత మందిని కొన్నా తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్ని గెలిపించారని, ఇప్పుడు హుజురాబాద్‌లో కూడా అదే జరుగుతుందన్నారు.

ప్రజలు అమాయకులు కారని, సంస్కారంతో మర్యాదతో వ్యవహరిస్తున్నానని అన్నారు. సహనం కోల్పోతే మాడి మసి అయిపోతారని, హుజురాబాద్‌లో మా మిత్రుడికి ఇంచార్జి ఇచ్చినట్టు తెలిసిందన్నారు. కానీ మొన్నటి ఎంపీ ఎన్నికల్లో మిగతా సెగ్మెంట్లలో తక్కువ ఓట్లు వేస్తే హుజురాబాద్‌లో 54 వేల మెజారిటీ ఇచ్చి ఆదుకున్నానని ఈటల అన్నారు. హుజురాబాద్ ప్రజల ఆత్మ గౌరవాన్ని ఎవరూ కొనలేరని, ఇక్కడి ప్రజల మీద ఈగ వాలకుండా చూసుకుంటానన్నారు.



Next Story

Most Viewed