ఆర్టీసీ జేఏసీ ఆవిర్భావం.. ఇక సమరమే..

by  |
Establishment of RTC JAC
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఆర్టీసీలో జేఏసీ పురుడుపోసుకుంది. 2019లో సమ్మె తర్వాత ఉనికిలో లేకుండా పోయిన యూనియన్లు… ఇప్పుడు సమస్యలపై కొట్లాడేందుకు మళ్లీ ఒక్కతాటిపైకి వచ్చాయి. తెలంగాణ మజ్దూర్​యూనియన్ మినహా… 10 కార్మిక సంఘాలతో ఆర్టీసీ జేఏసీ ఆవిర్భవించింది. టీజేఎంయూ కార్యాలయంలో మీడియా సమావేశంలో జేఏసీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.

జేఏసీ చైర్మన్‌గా ఆర్టీసీ ఎంప్లాయిస్​యూనియన్​ప్రధాన కార్యదర్శి కె.రాజిరెడ్డిని ఎన్నుకున్నారు. కన్వీనర్‌గా వీఎస్​రావు, వైస్ చైర్మన్‌గా హన్మంత్​ముదిరాజ్‌ను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో ఈయూ, టీజేఎంయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్, ఎన్ఎంయూ, కేఎస్(బీఎంఎస్), ఎస్‌డబ్ల్యూయూ(ఐఎన్​టీయూసీ), బీకేయూ, బీడబ్ల్యూయూ, కేపీ(ఐఎన్​టీయూసీ), ఎస్​టీఎంయూ కార్మిక సంఘాలు పాల్గొన్నాయి.

ప్రస్తుతం ఆర్టీసీలో ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారం కోసం కార్మిక సంఘాలు ఆదివారం తార్నాకలోని బహుజన వర్కర్స్​ యూనియన్​ కార్యాలయంలో సమావేశం నిర్వహించాయని, ఈ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ జేఏసీగా ఏర్పాటైనట్లు జేఏసీ చైర్మన్ రాజిరెడ్డి ప్రకటించారు. సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో రాజిరెడ్డి, వైస్​ చైర్మన్​హన్మంత్​ముదిరాజ్​ మాట్లాడారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం జేఏసీ ఏర్పాటైందన్నారు.

రాష్ట్రంలో ప్రతి ఉద్యోగికి వేతనాలు పెరిగాయని, కానీ ఆర్టీసీ కార్మికులకు మాత్రం పాత వేతనాలను కూడా సరైన సమయంలో ఇవ్వడం లేదన్నారు. మూడేండ్ల కిందటే అసెంబ్లీలో సీఎం కేసీఆర్​హామీ ఇచ్చారని, కానీ ఇంత వరకూ నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త బస్సులను కొనుగోలు చేయడం లేదని, సీసీఎస్‌లో నిధులు లేకుండా చేశారని ఆరోపించారు. వేతన సవరణ చేయాలని ప్రకటనకే పరిమితం చేశారని, ఉద్యోగ భద్రత ఇప్పటికీ లేదని మండిపడ్డారు. ఆర్టీసీలో రిటైర్మెంట్​కార్మికులకు బెనిఫిట్స్​కూడా ఇవ్వడం లేదని, రిటైర్డ్​ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, సీసీఎస్​ను మూసివేసేందుకు ప్లాన్​ చేస్తున్నారన్నారు.

ఆర్టీసీలోని 11 యూనియన్లలో కేవలం టీఎంయూ మాత్రమే జేఏసీలో లేదని, మిగిలిన 10 యూనియన్లతో జేఏసీగా ఏర్పాటైనట్లు తెలిపారు. ఆర్టీసీ రోజు రోజుకూ క్షీణిస్తోందని, దీనిపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదన్నారు. త్వరలోనే మరో సమావేశం నిర్వహించి, ఉద్యమ కార్యాచరణ నిర్ణయిస్తామని, ముందుగా ప్రభుత్వానికి మెమోరాండం ఇచ్చి ఆందోళన కార్యక్రమాలు చేపట్టుతామని ప్రకటించారు. ఆర్టీసీపై ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని, టీఎంయూ బయటకు వచ్చి పోరాటానికి సిద్ధం కావాలన్నారు.

సీఎం కేసీఆర్ ఆర్టీసీలో యూనియన్లు లేవని చెప్పుతున్నారని, యూనియన్లు రద్దు చేసే అర్హత ముఖ్యమంత్రికి లేదని వారు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జేఏసీ కో కన్వీనర్లు అబ్రహాం, రమేష్​ కుమార్​, యాదయ్య, సురేష్​, బి.యాదయ్య, పి.హరికిషన్​తో పాటు పలువురు పాల్గొన్నారు.


Next Story