తెలంగాణలో విద్యుత్ డిమాండ్ ఆల్ టైమ్ రికార్డు

by  |
తెలంగాణలో విద్యుత్ డిమాండ్ ఆల్ టైమ్ రికార్డు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో రోజురోజుకూ విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిపోతోంది. రాష్ట్ర ఏర్పాటు అనంతరం బుధవారం ఒక్కరోజే గరిష్ఠంగా 13,688 మెగావాట్ల విద్యుత్ డిమాండ్‌తో ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. ప్రజలకు ఎలాంటి అవాంతరాలు కలగకుండా నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేసింది. ఉమ్మడి రాష్ట్రాలుగా ఉన్న సమయంలో కూడా ఏర్పడనంత డిమాండ్ తెలంగాణలోనే గరిష్ఠంగా ఏర్పడటం విశేషం. గతేడాది ఫిబ్రవరిలో 13,168 మెగావాట్ల విద్యుత్ వినియోగం అత్యధిక రికార్డుగా ఉండగా ఈసారి అంతకుమించి డిమాండ్ నమోదైంది. కాగా ఉమ్మడి రాష్ట్రంలో 13,162 మెగావాట్ల అత్యధిక డిమాండ్‌ 2014 మార్చి 23న నమోదైంది.

తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరగకపోయినా విద్యుత్ డిమాండ్ కు తగినట్లు ఎప్పటికప్పుడు విద్యుత్ శాఖ చర్యలు తీసుకుంటోంది. ఉత్పత్తి సామర్థ్యం పెద్దగా లేకపోయినా ఛత్తీస్ ఘడ్, ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేసి విద్యుత్ సమస్యను అధిగమిస్తున్నారు. రాష్ట్రంలో టీఎస్ ఐపాస్ వల్ల పరిశ్రమలు విపరీతంగా పెరిగిపోవడం, లాక్ డౌన్ వల్ల వర్క్ ఫ్రం హోం చేయడానికి తోడు వేసవి వల్ల ఫ్రిజ్, ఏసీలు, టీవీల వాడకం ఎక్కువ కావడంతో విద్యుత్ వినియోగం మరింత ఎక్కువైంది.

రాష్ట్రంలో 15 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తామని ట్రాన్స్ కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు స్పష్టం చేశారు. వేసవి దృష్ట్యా విద్యుత్ వినియోగం భారీగా ఉండే అవకాశం ఉందని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కావాల్సినంత విద్యుత్ సరఫరా చేస్తామని ఆయన పేర్కొన్నారు.



Next Story

Most Viewed