మూగబోయిన మైకులు.. బద్వేలులో ముగిసిన కీలక ఘట్టం

by  |
మూగబోయిన మైకులు.. బద్వేలులో ముగిసిన కీలక ఘట్టం
X

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం ఉపఎన్నికకు సంబంధించి కీలక ఘట్టం ముగిసింది. బుధవారం రాత్రి 7 గంటలకు ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈసారి సైలెన్స్ సమయాన్ని 48గంటల నుంచి 72గంటలకు పెంచడంతో 24గంటల ముందే మైకులు మూగబోయాయి. దీంతో అధికార వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహించాయి. ప్రచారానికి బుధవారం చివరి రోజు కావడంతో అన్ని పార్టీలు సుడిగాలి పర్యటనలు చేశాయి. ఉప ఎన్నికల్లో గెలిపించాలని వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు బద్వేలు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

చివరి రోజు సుడిగాలి పర్యటనలు

ఎన్నికల ప్రచారం బుధవారంతో ముగియనున్న నేపథ్యంలో అన్ని పార్టీల అభ్యర్థులు, కార్యకర్తలు సుడిగాలి పర్యటనలు చేశారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం నియోజకవర్గవ్యాప్తంగా పర్యటించారు. అటు బీజేపీ సైతం చివరి రోజు సుడిగాలి పర్యటనలు చేసింది. అలాగే కాంగ్రెస్ పార్టీ సైతం భారీ ర్యాలీ చేపట్టింది. తమ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కమలమ్మను గెలిపించాలని కోరారు. చివరి రోజు ఎన్నికల ప్రచారంలో కూడా ఎక్కడా నేతలు తగ్గలేదు. విమర్శలతో విరుచుకుపడ్డారు.

బద్వేలు బరిలో 15మంది

బద్వేలు వైసీపీ ఎమ్మెల్యే డా.వెంకట సుబ్బయ్య ఆకస్మిక మరణంతో ఈ ఉప ఎన్నిక జరగనుంది. బద్వేలు బరిలో మొత్తం 15 మంది అభ్యర్థులు ఉన్నారు. వైసీపీ తరపున డాక్టర్‌ దాసరి సుధ, కాంగ్రెస్‌ తరపున మాజీ ఎమ్మెల్యే కమలమ్మ, బీజేపీ తరపున పనతల సురేష్‌ పోటీలో ఉన్నారు. వీరితోపాటు మరో 12మంది వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మెుత్తం 15 మంది బరిలో ఉన్నప్పటికీ త్రిముఖ పోరు ఉండనుంది. అయితే టీడీపీ, జనసేన పార్టీలు ఈ ఎన్నికకు దూరంగా ఉన్నాయి. అయితే జనసేన పార్టీ కార్యకర్తలు మాత్రం బీజేపీకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రధాన పార్టీల తరపున ఇప్పటికే పలువురు అగ్రనేతలు ప్రచారంలో పాల్గొన్న సంగతి తెలిసిందే.

ఈనెల 30న పోలింగ్

ఈ ఉపఎన్నికకు సంబంధించి ఈనెల 30న పోలింగ్ జరగనుంది. ఉదయం 7గంటల నుంచి రాత్రి 7గంటల వరకు పోలింగ్ జరగనుంది. నవంబర్‌ 2న ఫలితాలు వెలువడనున్నాయి. నియోజకవర్గంలో మొత్తం 2,16,139 ఓటర్లు ఉండగా అందులో మహిళలు – 1,07,340, పురుషులు పురుషులు – 1,08,799 ఉన్నారు. 272 కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది. అయితే 30 సమస్యాత్మక కేంద్రాలను పోలీసులు గుర్తించారు. ఇకపోతే 50శాతం కేంద్రాల్లో సీసీ కెమెరాలు, లైవ్‌ స్ట్రీమింగ్ ఉండేలా అధికారులు ఏర్పాటు చేశారు.



Next Story

Most Viewed