ఏప్రిల్‌లో పెరిగిన ఎనిమిది కీలక రంగాల ఉత్పత్తి!

by  |
ఏప్రిల్‌లో పెరిగిన ఎనిమిది కీలక రంగాల ఉత్పత్తి!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్థిక వృద్ధిని సూచించే పారిశ్రామిక ఉత్పత్తిలోని ప్రాధాన్యత కలిగిన ఎనిమిది కీలక రంగాల్లో ఉత్పత్తి భారీగా పెరిగినట్టు సోమవారం వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు తెలిపాయి. తక్కువ బేస్ ఎఫెక్ట్, సహజవాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఉక్కు, సిమెంట్, విద్యుత్ ఉత్పత్తి పెరిగిన కారణంగా ఎనిమిది కీలక రంగాల ఉత్పత్తి ఏప్రిల్‌లో 56.1 శాతం వృద్ధి నమోదు చేసినట్టు గణాంకాలు వెల్లడించాయి. అయితే, మార్చితో పోలిస్తే 15.1 శాతం క్షీణించిందని, అదే సమయంలో అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఎనిమిది కీలక రంగాల ఉత్పత్తి 6.5 శాతం క్షీణించినట్టు మంత్రిత్వ శాఖ పేర్కొంది.

మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. సహజవాయువు 25 శాతం, రిఫైనరీ ఉత్పత్తులు 30.9 శాతం, ఉక్కు 400 శాతం, సిమెంట్ 548.8 శాతం, విద్యుత్ 38.7 శాతం పెరిగాయి. సమీక్షించిన నెలలో బొగ్గు, ఎరువుల విభాగాలు సానుకూల వృద్ధిని నమోదు చేశాయి. ఇక, ముడి చమురు 2.1 క్షీణించగా, గతేడాది ఇదే నెలలో ఇది 6.4 శాతం ప్రతికూలంగా నమోదైంది. కాగా, ఈ ఏడాది మార్చిలో ఎనిమిది కీలక రంగాల ఉత్పత్తి 11.4 శాతం నమోదైన సంగతి తెలిసిందే.


Next Story