మత్తులో యువతరం చిత్తు..

by Disha Web Desk 20 |
మత్తులో యువతరం చిత్తు..
X

మన దేశ భవిష్యత్‌ బాగుండాలంటే ఎక్కువగా ఉన్న మన యువ జనాభా కూడ ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. ఐతే ప్రస్తుత పరిస్థితుల్లో మన దేశ యువత మద్యం, మత్తుతో పాటు ధూమపానం, గంజాయి, ఇతర హానికర పదార్థాలను సేవించడం వల్ల వాళ్ల ఆరోగ్యాలు చిన్న తనంలోనే చిత్తవుతున్నాయి. 15-24 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న యువతపై మద్యం, మత్తు పదార్థాలు, దూమపానం తదితర వ్యసనాల ప్రభావం గూర్చి ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. డబ్ల్యూహెచ్‌వో అంచనాల ప్రకారం… 15-19 మధ్య వయస్సు ఉన్న యువతలో... ప్రతి నలుగురిలో ఒకరు మద్యం అల్కాహాల్‌ సేవిస్తున్నారు. 15-19 ఏళ్ల మధ్య వయస్కుల్లో డ్రగ్స్‌ తీసుకునేవారిలో ఎక్కువగా గంజాయిని సేవిస్తున్నారు. ఇక 15-16 వయస్కులో ప్రతి 20మందిలో ఒకరు అంటే 5శాతం మేర గంజాయి సేవిస్తున్నారు. 13-15ఏళ్ల వయసు వారిలో 10 మందిలో ఒకరు ధూమపానం చేస్తున్నారు. అనేక ఆరోగ్య సమస్యల బారిన పడి… 14-19 మధ్య అమ్మాయిల్లో ప్రతి వెయ్యిమందిలో 41మంది గర్భం దాలుస్తున్నారు. ఆ వయసులో గర్భం దాల్చడంతో అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దేశంలో సుమారు 100 మిలియన్ల మంది మాదకద్రవ్యాలకు బానిసలు కాగా, గత ఎనిమిదేళ్లలో భారతదేశంలో మాదకద్రవ్యాల వినియోగం 70 శాతం పెరిగింది. సాంప్రదాయిక అంచనా ప్రకారం, ఐక్యరాజ్యసమితి భారతదేశంలో మాదకద్రవ్యాల దుర్వినియోగానికి గురైన వారిలో 13 శాతం మంది 20 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నారని కనుగొంది.

తెలుగు రాష్ట్రాల్లో ఘోర పరిస్థితి...

రెండు తెలుగు రాష్ట్రాలోని యవత మత్తులో చిత్తయి తమ జీవితాలను తామే నాశనం చేసుకుంటున్నాయి. ఎక్కువ శాతం విద్యార్థులే దీని పట్ల విపరీతంగా ఆకర్షితులై తమ కుటుంబాలకు కూడ తీరని ఆవేదనను, దుఖాన్ని కగిలిస్తున్నారు. మత్తు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి, వాటిని పొందడానికి ఎంతకైనా బరితెగిస్తున్నారు. డ్రగ్స్‌ కొనడానికి డబ్బులు లేకపోవడంతో చోరీల బాట పడుతున్నారు. ఇందులో విద్యార్థినులు సైతం బలవుతున్నసంఘటనలు కోకోల్లోలు. ఆ మధ్య మత్తుకు అలవాటైన ఓ యువకుడు డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లినే కడతేర్చిన సంఘటన, ఓ విద్యార్థిని మత్తులో తన నగ్న చిత్రాలను అమ్మేందుకు సైతం సిద్ధపడిన సంఘటనలు ఎన్నో.. సభ్యసమాజానికి తలవంపులు తెచ్చే విధంగా ఉన్నాయి.

దేశ జనాభాలో 15% పైగా మత్తులో...

2018లో ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)కి చెందిన నేషనల్ డ్రగ్ డిపెండెన్స్ ట్రీట్‌మెంట్ సెంటర్ (NDDTC) నిర్వహించిన సర్వే ప్రకారం..ఆల్కహాల్ అనేది భారతీయులు (ఈ సర్వేలో చేర్చబడిన పదార్ధాలలో) ఉపయోగించే అత్యంత సాధారణ సైకోయాక్టివ్ పదార్థం. జాతీయంగా దేశ జనాభాలో దాదాపు 14.6 శాతం మంది (10 మరియు 75 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు) ఆల్కహాల్ ఉపయోగిస్తున్నారు. ఆనాటి జనాభా ప్రకారం దాదాపు 16 కోట్ల మంది మద్యం సేవిస్తున్నారని సర్వే పేర్కొంది. నేడు దీనికి రెట్టింపుగానే ఉందని లిక్కర్ అమ్మకాలు కొనుగోళ్లు చెపుతున్నాయి..మహిళలతో (1.6 శాతం) పోల్చితే పురుషుల్లో (27.3 శాతం) మద్యం వినియోగం గణనీయంగా ఎక్కువగా ఉందని, మద్యపానం చేసేవారిలో దేశీ మద్యం లేదా 'దేశీ షరాబ్' (సుమారు 30 శాతం) మరియు స్పిరిట్స్ లేదా ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (సుమారు 30 శాతం) ఎక్కువగా వినియోగిస్తున్నారు. అని సర్వే పేర్కొంది. భారత సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ప్రకారం 31 మిలియన్ల గంజాయి వినియోగదారులు, 24 మిలియన్ల ఓపియాయిడ్లు, 7.7 మిలియన్ల వ్యక్తులు ఇన్-హెలర్లు ఉపయోగిస్తున్నట్లు తెలిపింది..

మత్తుకు బానిసైన వారి లక్షణాలు...

పిల్లలు మత్తు పదార్థాల వ్యసనాల బారిన పడకుండా తల్లిదండ్రులు నిరంతరం నిఘా ఉంచాలని, వారిలో ప్రవర్తన, అలోచనలు. మాట తీరులో మార్పులు కన్పిస్తే వెంటనే దగ్గరలో ఉన్న మానసిక వైద్య నిపుణులను సంప్రదించడం చాలా శ్రేయస్కరం..

స్వంత కుటుంబ సభ్యులతో సమయం గడిపేందుకు, గతంలో లాగ ఏ మాత్రం ఇష్టపడకపోవడం, సమయం, సందర్భం లేకుండా అతికోసం, బూతు మాటలు మాట్లాడం, పరిశుభ్రత పాటించకపోవడం చేస్తుంటారు.

చదువులో వెనుకబటుతనం, స్కూల్ లేదా కాలేజీకి ఎగ్గొట్టడం, తనకు ఎంతో ఇష్టమైన అలవాట్లపై కూడ ఇష్టాన్ని కోల్పోవడం.

కొన్ని సందర్భాలలో మత్తు పదార్థాల కోసం ఏదైనా చేయడానికి ఇంట్లో డబ్బులు, విలువైన ఆభరణాలను దొంగిలించడం, బయట ఘోరాలు, నేరాలకు పాల్పడటం కూడ చేస్తుంటారు.

కళ్లు ఎర్రబడటం, ఆకలి లేకపోవటం, బరువు తగ్గిపోవడం. బలహీపడటం. నిద్ర సమస్యలు.

ఒంటరిగా గడిపేందుకు ఎక్కువగా ఇష్టపడటం చేస్తుంటారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే మానసిక వైద్య నిపుణులను సంప్రదించాలి.

తల్లిదండ్రులు ఇలా ఆదర్శంగా ఉండాలి

24 ఏళ్ల లోపు యువత అధికంగా మద్యం, ఇతర వ్యసనాల బారిన పడుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు కూడ తమకున్న చెడు అలవాట్లను మార్చుకొని పిల్లలకు ఆదర్శంగా ఉండాలి. కుటుంబంలో వ్యసనాలకు బానిసై ఉంటే ఆ ప్రభావం ఇంట్లో ఉండే పిల్లలపై కచ్ఛితంగా చూపుతుంది. ఆలాంటి పరిస్థితులో వారి మనస్సు నిగ్రహంగా ఉండలేక వ్యసనాలకు అలవాటు పడతారు. రోజూ కుటుంబంలో గొడవలు, ఘర్షణలు చోటుచేసుకోవడంతో వాటినుంచి బయటపడేందుకు కొత్త మార్గాలను అనుసరించే క్రమంలో మత్తుకు బానిసయ్యే ప్రమాదం ఉంది. ఇతర పిల్లలతో పోల్చుతూ సూటిపోటీ మాటలతో పిల్లలను వేధించడం మంచిది కాదు. ఆ మాటలు పిల్లల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి.. కావున తమ పిల్లల నడవడిక, వ్యవహారతీరును గమనిస్తూ, స్నేహితుడిలా మెదలుతూ వాళ్ళు చెడు దారిలోకి జారి పోకుండా చూసుకోవడం ఎంతో అవసరం, నేటి ప్రభుత్వాలకు కాసులపై ఉన్న శ్రద్ధ మనుషులు ఆరోగ్యాలపై లేకపోవడం చాలా బాధాకరం. గంజాయి, హెరాయిన్, కొకైన్, ఓపీఎం వంటి మత్తు పదార్థాలు ఎక్కడబడితే అక్కడ సులువుగా దొరుకుతుండటంతో పట్టణ యువతే కాదు గ్రామీణ యువత కూడ భారీగా అటువైపు పరుగులు పెడుతోంది, మద్యం, మత్తుకు గురవుతున్న యువ భారతాన్ని ప్రారంభ దశలోనే గుర్తించి, వారినీ కట్టడి చేయకపోతే ఈ ప్రభుత్వాలను భావితరాలు ఏ మాత్రం క్షమించనే క్షమించవు సుమా !


డాక్టర్. బి. కేశవులు నేత. ఎండి.

సీనియర్ మానసిక వైద్య నిపుణులు.

ఛైర్మన్ తెలంగాణ మేధావుల సంఘం.

85010 61659



Next Story

Most Viewed