ప్రపంచంలోనే సంపన్న సంస్థానం! నిజాంపై ఎందుకు తిరగబడినట్టు?

by Disha edit |
ప్రపంచంలోనే సంపన్న సంస్థానం! నిజాంపై ఎందుకు తిరగబడినట్టు?
X

17 సెప్టెంబర్ 1948 పరాయి పాలన నుంచి విముక్తి పొందిన దినం. భూస్వాముల దౌర్జన్యాలు, నిజాం రాజరిక దుర్మార్గ వ్యవస్థ, రజాకారుల అమానుషాలు, దౌర్జన్యాల నుంచి హైదరాబాద్ సంస్థానం విముక్తి పొందడానికి జరిగిన మహా సంగ్రామమది. ఉక్కుమనిషి సర్దార్ పటేల్ ముందు నిరంకుశ నిజాం తలవంచిన సుదినం. హైదరాబాద్ సంస్థానంలో మతోన్మాద నియంత పాలనకు కేంద్రం నిజామే. బహదూర్ యార్ జంగ్ నేతృత్వంలో మజ్లిసే ఇత్తెహాదుల్ ముస్లిమీన్ సంస్థ ఏర్పాటయ్యింది. తబ్లిక్ ఉద్యమం ప్రారంభించి వేల మంది హరిజనులను ఇస్లాంలోకి మార్చారు. ముస్లింలను దిగుమతి చేసుకొని సంఖ్యను పెంచే ఎత్తుగడ కూడా 1948 దాకా కొనసాగింది.1948 వరకు దిగుమతి అయిన ముస్లింలు ఎనిమిది లక్షలు అని స్వయంగా హోంమంత్రి సర్దార్ పటేల్ పార్లమెంట్‌లో చెప్పారు.

బహదూర్ యార్ జంగ్ తర్వాత అంచెలంచెలుగా ఎదిగిన ఖాసీం రజ్వీ ఎంఐఎంని తన గుప్పిట పెట్టుకొని ముస్లింలను రెచ్చగొట్టాడు. రజాకార్ సైన్యాన్ని తయారు చేసి అమానవీయ ఘటనలకు పాల్పడ్డాడు. సంస్థానంలో 27 రకాల పన్నులతో ప్రజలను దోపిడీకి గురి చేసిన ఘనత నిజాం రాజుదే. పేదల పొట్టలు కొట్టి సంపాదించిందే అంతా. వ్యక్తిగతంగా నిజాం పరమ పిసినారి. ఎంతటి ముఖ్యమైన అతిథి వచ్చినా, ఒక చాయ్, రెండు ఉస్మానియా బిస్కెట్లు మాత్రమే తెప్పించేవాడు. నిర్బంధ వెట్టి చాకిరీ విధానం అమలులో ఉండేది. సంస్థానం అంతటా అశాంతి, అభద్రత తప్ప ఇంకేం లేదు.

ఖాసిం రజ్వీ రాక్షస క్రీడ

ఖాసిం రజ్వీ ఆధ్వర్యంలో రజాకారులు బలవంతంగా పన్నులు వసూలు చేసేవారు. పన్నులు చెల్లించని వారిని చిత్రహింసలు పెట్టేవారు. అత్యాచారాలు మామూలు విషయమే. రజాకారుల దుర్మార్గాలను హైదరాబాద్ సంస్థానం 13 సెప్టెంబర్ 1948 వరకు భరించక తప్పలేదు. భారత ప్రభుత్వానికి సహకరిస్తే ప్రాణాలు తీస్తామని బెదిరించారు. ఆ సమయంలో సుమారు 30 వేల మంది స్థానికులు సికింద్రాబాదు మిలిటరీ కంటోన్మెంట్‌లో తలదాచుకున్నారు. ఏ రాజైనా తన రాజ్యాన్ని వల్లకాడుగా ఉంచుకోలేడు.ఏవో కొన్ని అందాలు అద్దుకుని, ఎంతో కొంత అభివృద్ధి జరిగినట్టుగా చూపించుకుంటాడు. నిజాం చేసింది కూడా అదే. నిజాం రాజు మంచోడే అయితే కొమురం భీం ఎందుకు తిరగబడ్డాడు?

నిజాం గొప్పోడే అయితే షోయబుల్లా ఖాన్ ఎందుకు అక్షరాయుధాలు సంధించాడు? ఎందుకు హత్యచేయబడ్డాడు? నిజాం ఘటికుడే అయితే చాకలి ఐలమ్మ ఎందుకు సవాల్ విసిరింది. 'మా నిజాము రాజు తరతరాల బూజు' అని ఎందుకు మహాకవి దాశరథి ఎద్దేవా చేశారు? నిజాం నవాబుకు గోల్కొండ ఖిల్లా కింద గోరి కడతామని ఎందుకు యాదగిరి పాటెత్తుకున్నాడు? నారాయణరావు పవార్ ఎందుకు నిజాం మీద బాంబు విసిరాడు?

తెలుగుపై నిషేధం

చివరి నిజాం తన పాలనలో తెలుగును నిషేధించాడు. తెలుగు పత్రికలు దొంగతనంగా చదువుకోవాల్సి వచ్చేది. హిందువుల పండుగలు బహిరంగంగా జరుపుకునే వీలుండేది కాదు. ఊరేగింపులపైనా, సభలపైనా నిషేధం ఉండేది. కవులు, రచయితలు, పాత్రికేయులు ఎన్నో కష్టాలు పడ్డారు. హిందువులకు ప్రభుత్వోద్యోగాలలో ప్రాధాన్యముండేది కాదు. మత మార్పిడుల కోసం 'తబ్లిగ్' పేరిట ఒక ప్రభుత్వ సంస్థ పని చేసేది. నియంతృత్వ పాలనను, మత మార్పిడులను ప్రశ్నించిన కాంగ్రెస్ కార్యకర్తలను, భాషోద్యమకారులను, పాత్రికేయులను, ఆర్య సమాజ్ వారిని నిర్దాక్షిణ్యంగా హత్య చేసేవారు. వట్టికోట అళ్వారు స్వామిని, దాశరథి కృష్ణమాచార్యను జైలు పెట్టింది ఆనాటి ప్రభుత్వమే కదా?

నిజాం ప్రజల మీద మూడు రకాల బలగాలను ఉపయోగించాడు.ఖాసిం రజ్వీ నాయకత్వంలో రజాకారుల దండు. నిజాం సైన్యం. పోలీసులు. అరాచకాలు భరించలేక ఎంతోమంది బెజవాడకు తరలిపోయ్యారు. చివరి నిజాం స్వతంత్ర రాజ్యంగా ఉండిపోవాలని గట్టి ప్రయత్నమే చేశాడు. భారత యూనియన్ ప్రభుత్వం అందుకు ససేమిరా అనడంతో పాకిస్తాన్‌లో భాగంగా ఉండడానికి ప్రయత్నించాడు. పటేల్ ఒప్పుకోలేదు. ఖాసిం రజ్వీ దౌత్యం ఫలించలేదు. 17 సెప్టెంబర్ 1948న భారత ప్రభుత్వం హైదరాబాద్ సంస్థానాన్ని యూనియన్‌లో విలీనం చేసుకుంది.

రాజ్‌ప్రముఖ్ హోదా

నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చలవతో నిజాంకు రాజ్‌ప్రముఖ్ హోదా దక్కింది. మిగతా ప్రముఖులంతా దయనీయ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. దివాన్ మీర్ లాయక్ అలీఖాన్ ముందే మేల్కొని పాకిస్తాన్ వెళ్లిపోయాడు. మేజర్ జనరల్ సయ్యద్ అహ్మద్ అల్ ఇద్రూస్ జీవితం చాలా కాలం జైలులో గడిచింది. ఖాసిం రజ్వీని ప్రభుత్వం పట్టుకొని జైలులో పెట్టింది. విడుదలైన తర్వాత పాకిస్తాన్ వెళ్ళిపోయాడు. కరాచీలో హీనాతి హీన పరిస్థితులలో చచ్చిపోయాడు.

స్వరాష్ట్రం సిద్ధించినా తెలంగాణలో స్వాతంత్ర్య సంబరాలు జరుగకపోవటం విడ్డూరం. 2022 సెప్టెంబర్ 17 నుండి తెలంగాణ స్వాతంత్ర్య అమృత్యోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. మేధావులు, చరిత్రకారులు, సామాజిక సంస్థలు, ధార్మిక సంస్థలు, ప్రజలంతా ఏకమై తెలంగాణ స్వాతంత్ర్య అమృతోత్సవాలని ఘనంగా నిర్వహిద్దాం.


సామల కిరణ్

99493 94688



Next Story

Most Viewed