వరల్డ్ వాక్: కరువు ముంగిట్లో ప్రపంచం

by Disha edit |
వరల్డ్ వాక్: కరువు ముంగిట్లో ప్రపంచం
X

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు సమన్వయంతో పనిచేసుకుంటూ గత 15 సంవత్సరాలుగా మంచి ఫలితాలు రాబడుతున్నారు. ప్రస్తుత పరిస్థితులలో ప్రపంచ దేశాలు కరువు నియంత్రణ, వాతావరణ మార్పులకు దౌత్య సంబంధాలలో ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి. కరువు నియంత్రణ మెకానిజంలో అమెరికా ముందు వరుసలో ఉంది.‌ భవిష్యత్తులో కరువులు రాకుండా ఉండాలంటే ప్రపంచ దేశాలు పటిష్ట ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలి. ఆహార కొరత రాకుండా చూడాలి. ఆకలి కేకలు ఉండరాదు. అడవులు పెంచాలి. పర్యావరణాన్ని పరిరక్షించాలి. పర్యావరణ నిపుణులు, శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి. ప్రకృతి వనరులను సద్వినియోగం చేసుకోవాలి.‌ పచ్చదనంతో నిండుతనం నింపుకోవాలి.

నాదిగా ప్రపంచాన్ని పట్టి పీడుస్తున్న పెద్ద సమస్య కరువు.‌ కొన్ని కరువులకు కారణం ప్రకృతి అయితే, అభివృద్ధి నీడలో మానవ తప్పిదాల మూలంగా పలుప్రాంతాలలో కరువు కాటకాలు సంభవిస్తున్నాయి. ఇవి సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.‌ భవిష్యత్తుకు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ప్రపంచంలోని ఏ దేశం కూడా కరువు నుంచి బయట పడేందుకు అవకాశం లేకుండా పోతోంది. ప్రస్తుతం సదరన్ యూరప్ అంతా కరువు కాటకాలతో నలిగిపోతోంది.‌ గత 70 సంవత్సరాలుగా ఎన్నడూ చూడని కరువు ఇటలీని రాచి రంపాన పెడుతున్నది. పశ్చిమ యూరప్‌లో అమెరికా గత 1200 సంవత్సరాల కాలంలో చూడని వేడిని రెండు దశాబ్దాలుగా అనుభవిస్తున్నది, గత 13 సంవత్సరాలుగా చిలీతోపాటు మెక్సికోలోని మూడవ పెద్ద నగరం 'మెనిటరీ' తాగడానికి నీళ్లు లేక అల్లాడుతున్నవి. రేషన్ ద్వారా నీళ్లు తీసుకొనే స్థాయికి చేరుకున్నాయి.

ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో వేడి ఉన్నందున విద్యార్థులకు సెలవులు ప్రకటించారు. ఇక ఆఫ్రికా‌లోని ఇథియోపియా, కెన్యా, సోమాలియా వరుసగా నాలుగు సంవత్సరాలు నుంచి వర్షాలు లేక అల్లాడుతున్నాయి.‌ దీంతో అక్కడ ప్రజలు, జంతుజాలం, సమస్త ప్రాణులు అతలాకుతలం అవుతున్నాయి.‌ పోషకాహార లోపంతో పిల్లలు అనేక రోగాల బారిన పడి అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారు. దీంతో ప్రపంచ మానవాళి నయనాలు అశ్రుమయం కావడం ఎంత బాధాకరం?‌ మానవుల కంటే ధృడంగా నీరు తాగకుండా సుదీర్ఘకాలం జీవించే ఒంటెలు కూడా ఈ ప్రాంతంలో ప్రాణాలు కోల్పోతున్నాయి. కరువులతో ప్రపంచవ్యాప్తంగా పిల్లలు బక్కచిక్కిపోతున్నారు.‌ మరికొందరు మరణానికి చేరువ అవుతున్నారు.

వాతావరణమే కారణం

దీనికంతటికీ కారణం వడివడిగా, వేగంగా మారిపోతున్న వాతావరణ మార్పులే అని గమనించాలి. బడా పారిశ్రామిక సంస్థలు, పారిశ్రామికవేత్తలు, దేశాలు స్వలాభం కోసం ప్రకృతి వనరులను దోపిడి చేస్తున్నారు.‌ అక్రమ మైనింగ్ మనలాంటి దేశాలకు పెను సవాలుగా పరిణమిస్తున్నది.‌ అభివృద్ధి పేరుతో నిబంధనలు అతిక్రమించి పలు పరిశ్రమలు, నిర్మాణాలు చేపట్టడం, పలు రకాల కాలుష్యం వల్ల భూక్షీణత, వాతావరణం మార్పులు సంభవిస్తూ భవిష్యత్తు తరాల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. 2050 నాటికి ప్రపంచంలో ప్రతీ నలుగురిలో ముగ్గురు ఈ కరువుల బారిన పడతారని పలు నివేదికలు చెబుతున్నాయి. అయితే, ఏ దేశం కానీ, రాష్ట్రం కానీ రాబోయే రోజులలో ఫలానా ప్రాంతంలో కరువులు ఏర్పడతాయి అని చెప్పలేకపోతున్నాయి.‌

భూక్షీణత కూడా ఎక్కువగా జరుగుతోందని పర్యావరణ శాస్త్రవేత్తలు తాజాగా నివేదికలు విడుదల చేశారు. భవిష్యత్తులో కరువు ఏర్పడకుండా ఉండాలంటే ప్రభుత్వాలు, దేశాలు, రాష్ట్రాలు, ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పర్యావరణం మీద పూర్తి అవగాహనను పెంచుకోవాలి. అడవులను పెంపొందించాలి. వీలైన ప్రతి చోటా మొక్కలు నాటాలి. ఆక్రమణలకు, అక్రమ తవ్వకాలకు చెల్లుచీటీ ఇవ్వాలి. అప్పుడు మాత్రమే కరువులను కట్టడి చేయగలం.‌ కరువులు పక్రృతి సిద్ధమైనవే అయినా, మనం వాటిని పక్రృతి విపత్తులుగా మార్చరాదు. ఇది మన బాధ్యత.‌ గత సంవత్సరం 'కాప్-26' సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అన్ని దేశాలు అమలు చేయాలి. ఈ ఏడాది గ్రీస్‌లో జరిగే 'కాప్- 27' సమావేశంలో అన్ని దేశాలు వాతావరణ, కాలుష్య నియంత్రణపై మరెన్నో మంచి నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుందాం.

ప్రపంచవ్యాప్తంగా ఇలా

ఐక్యరాజ్యసమితి 'ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సంస్థ-యూఎన్ కన్వెషన్ టు కంబేట్ డిసర్టిఫికేషన్' నివేదిక ప్రకారం, జనాభా ఎక్కువగా ఉన్న దేశాలు కూడా కరువు నివారణకు పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి. బ్రెజిల్, ఇథియోపియా, ఇండియా, ట్యునిషియా వంటి దేశాలు వాటర్ షెడ్ పథకాలను అమలు చేస్తున్నాయి. వాటర్ మేనేజ్‌మెంట్ ద్వారా కరువులు తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నాయి.‌ వీటిని ప్రతీ దేశంలో అమలు చేయాలి. నీటి కొరత ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలను నీటి వసతి ఉన్న ప్రాంతాలకు తరలించాలి.‌ కరువులకు రాజకీయ పరిధి ఉండదు.‌ అంతర్జాతీయ సహకారాన్ని అంది పుచ్చుకుని ముందుకు సాగాలి. లేకపోతే, ఈ కరువులు కరోనా, మంకీ ఫాక్స్ వలె విస్తరించి ప్రాణాలు పోవడానికి కారణమవుతాయని గ్రహించాలి.‌ నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు పెరగడానికి, ఆహార ధాన్యాల కొరతకు, అడవులు తగలుబడుటకు, జంతుజాలం కనుమరుగు అవడానికి, ఇసుక తుఫానులు చుట్టు ముట్టడానికి, ప్రజలు తమ స్వస్థలాలను విడిచి వేరే ప్రాంతానికి పోవుటకు, శరణార్థులుగా మారిపోవడానికి, సమాజంలో అశాంతి వంటి రుగ్మతలకు కూడా ఈ కరువులు కారణమవుతాయి.

కట్టడి చేయకుంటే ముప్పు‌

ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ద్వారా కరువులను కట్టడి చేయవచ్చు.‌ ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలు తగు జాగ్రత్తలు తీసుకున్నాయి.‌ 50 సంవత్సరాల క్రితమే ఆఫ్రికాలో కరువులు తగ్గించడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. అక్కడ రాజకీయ నాయకులు, ప్రభుత్వాధినేతలు కలిసి శాస్త్రీయ పద్ధతిలో చర్యలు చేపట్టారు.‌ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధారంగా నడుచుకుంటున్నారు.‌ మన దేశంలో 'నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్' తో కరువు నియంత్రణ పధకాలు అమలు చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు సమన్వయంతో పనిచేసుకుంటూ గత 15 సంవత్సరాలుగా మంచి ఫలితాలు రాబడుతున్నారు.

ప్రస్తుత పరిస్థితులలో ప్రపంచ దేశాలు కరువు నియంత్రణ, వాతావరణ మార్పులకు దౌత్య సంబంధాలలో ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి. కరువు నియంత్రణ మెకానిజంలో అమెరికా ముందు వరుసలో ఉంది.‌ భవిష్యత్తులో కరువులు రాకుండా ఉండాలంటే ప్రపంచ దేశాలు పటిష్ట ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలి. ఆహార కొరత రాకుండా చూడాలి. ఆకలి కేకలు ఉండరాదు. అడవులు పెంచాలి. పర్యావరణాన్ని పరిరక్షించాలి. పర్యావరణ నిపుణులు, శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి. ప్రకృతి వనరులను సద్వినియోగం చేసుకోవాలి.‌ పచ్చదనంతో నిండుతనం నింపుకోవాలి.

ఐ. ప్రసాదరావు

63056 82733


Next Story