మహిళా బిల్లుతో.. బీసీలకు నష్టం!

by Disha edit |
మహిళా బిల్లుతో.. బీసీలకు నష్టం!
X

కొత్త పార్లమెంట్ భవనంలో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడం ఒక చారిత్రాత్మకమైన విషయంగా చెప్పవచ్చు. చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 19 మంగళవారం నాడు లోక్‌సభలో ప్రవేశపెట్టింది. దీని ప్రకారం రాజ్యసభ, పార్లమెంట్, అసెంబ్లీలో మహిళలకు 33% కోటాను అమలు చేస్తారు. 33 శాతంలో ఎస్సీ, ఎస్టీల మహిళలకు వారి రిజర్వేషన్ల కోటా ఆధారంగా కేటాయిస్తారు. 15 ఏళ్ల పాటు అమల్లో వుంటే ఈ రిజర్వేషన్లను వెంటనే కాకుండా నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) తర్వాత అమల్లోకి తేవాలని నిర్ణయించడం గమనార్హం. 2026 లో డీలిమిటేషన్ చేపట్టాల్సి ఉంది. అది పూర్తయ్యి రిజర్వేషన్లు అమల్లోకి రావడానికి కొంత సమయం పట్టడం ఖాయం. అంటే 2024 ఎన్నికల నాటికి రిజర్వేషన్లు అమల్లోకి రావు. 2029లోనే పార్లమెంటులో కోటా అమలయ్యే అవకాశముంది. అయితే ఈ బిల్లు చాలాసార్లు సభల ముందుకు వచ్చినా, ప్రతిసారీ ఏకాభిప్రాయం కుదరక ఆమోదం పొందలేదు. దాదాపుగా 27 ఏళ్లుగా అది పెండింగ్‌లోనే వుండిపోయింది. ఈసారి మహిళా రిజర్వేషన్లకు పార్టీలన్ని మద్ధతుగా నిలుస్తుండటంతో బిల్లు పార్లమెంటులో సునాయాసంగా ఆమోదం పొందింది. కనీసం 50% రాష్ట్రాలు ఈ బిల్లును నోటిఫై చేయాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ బిల్లులో చాలా లొసుగులు వున్నాయి. ఈ బిల్లు గురించి భిన్నమైన అభిప్రాయాలు వున్నాయి.

మహిళలను మోసం చేసే బిల్లు

ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, కేజ్రీవాల్ ప్రభుత్వంలోని మంత్రి ఆతిషి, బిజేపికి మహిళల సంక్షేమంపై ఆసక్తి లేదని, ‘బిల్లులోని నిబంధనలు నిశితంగా చదివితే అది ‘మహిళలను మోసం చేసే బిల్లు’ అని తెలుస్తుందని ఆమె ఆరోపించారు. నిజానికి ఈ బిల్లులో దళిత బహుజన వివక్ష ఉంది. ముఖ్యంగా బీసీలను రాజ్యాంగాధికారంలోనికి రాకుండా కుట్ర దాగి వుంది. ఎప్పుడో 2029లో డీలిమిటేషన్ అయిన తర్వాత రిజర్వేషన్లు అమలు చేయబడతాయి అనడంలోనే రిజర్వేషన్లు జాప్యం చేయాలనే భావన ఉంది. బీజేపీ విశ్వహిందూ పరిషత్, ఆర్‌ఎస్‌ఎస్ రిజర్వేషన్లకే వ్యతిరేకం. మండల్ కమిషన్‌కి వ్యతిరేకంగా పోరాడిన వీళ్లు, దళితులకి ఇచ్చే రిజర్వేషన్లు ఎన్నోసార్లు వ్యతిరేకించిన వీళ్లు ఈ మహిళా బిల్లుని ప్రపోజ్ చేసారంటే ఎవరూ నమ్మరు. నిజానికి బీజేపీ ప్రభుత్వం దళిత బహుజన స్త్రీలకు వ్యతిరేకం అనేది చారిత్రక సత్యం. ఆర్‌ఎస్‌ఎస్, విశ్వహిందూ పరిషత్‌లకు స్త్రీలంటే ఎంతో భయం. అందుకే కులాంతర వివాహితుల్ని వధించడానికి కత్తులు నూరారు. ఎంతో మందిని వధించారు.

1988 నుండి భారత రాజకీయాల్లో స్త్రీల ప్రాతినిధ్యానికి పట్టిన గతిని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. 1988లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో లోక్‌సభలోని 537 సీట్లలో46 సీట్లు మాత్రమే స్త్రీలు గెలుచుకున్నారు. అదే సంవత్సరం జరిగిన రాజ్యసభ నామినేషన్‌లో 248 సీట్లకుగాను 28 సీట్లు మాత్రమే స్త్రీలకు కేటాయించారు. అదే సంవత్సరం మొత్తం ఎలక్షన్‌లో 241 మంది స్త్రీలు పోటీ చేయగా కేవలం 44 మంది స్త్రీ అభ్యర్థులు ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని విశ్లేషిస్తూ డా. మణి, పి.కేర్కర్ ఇలా అన్నారు. ఆయా పార్టీలు స్త్రీలకు సీట్లు తక్కువ ఇవ్వడమే కాక పంచాయితీ రాజకీయాల్లోకి స్త్రీలను అసలు రాకుండా అడ్డుకోవడం జరుగుతూనే వుంది. రాజకీయ ప్రాతినిధ్యం కూడా అగ్రవర్ణ, అగ్రకులాల స్త్రీలకే లభ్యం అయ్యింది. భారతదేశంలో ఇప్పుడు 5 శాతం కంటే తక్కువ స్త్రీలు పార్లమెంట్‌లో వున్నారు. దేశంలో స్త్రీలకు 7% కంటే సీట్లు మించలేదు. అయితే వారిలో ఎన్నికైన స్త్రీల అభ్యర్థుల సంఖ్య ఇంకా తక్కువగా వుంది.

స్త్రీల కోటా సీట్లూ భర్తీ కావు

భారతదేశంలో 26.4 కోట్ల స్త్రీల జనాభాలో 21.4 కోట్ల మంది గ్రామీణ ప్రాంతాల్లోనే జీవిస్తున్నారు. అయితే గ్రామ పంచాయితీ, పంచాయితీ సమితి, జిల్లా పరిషత్ స్థాయిలో 2% సీట్లు మాత్రమే రిజర్వ్ చేయబడింది. పంచాయితీ రాజ్ మీద అశోక్ మెహతా కమిటీ నివేదిక ప్రకారం స్త్రీలకు కేటాయించిన సీట్లలో ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాల్లో భర్తీ గాకుండానే మిగిలిపోతున్నాయని తెలుపబడింది. స్త్రీల రిజర్వేషన్‌కు సంబంధించిన విషయాలే ఇలా వుంటే ఇక స్త్రీలు ఓపెన్ కాంపిటిషన్‌లో సీట్లు గెలవడం కష్టంగా వుంది. గ్రామ పంచాయితీల్లో పురుషుల ప్రాతినిధ్యం ఎక్కువ ఉండడం వలన ఎన్నికైన స్త్రీలు కూడా నామమాత్రంగానే తమ ప్రాతినిధ్య విలువలను వ్యక్తీకరించగలుగుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో గ్రామాల్లో కమ్మ, రెడ్డి స్త్రీలే ఎక్కువ ఎన్నికవుతుంటారు. అయితే వారి భర్తలే నిజానికి పెత్తనం చేస్తుంటారు. మొత్తం రాజకీయ పెత్తనం అగ్రకులాల పురుషులదైనపుడు దళితులకు, స్త్రీలకు ఇస్తున్న రాజకీయ రిజర్వేషన్లు నామమాత్రం అవుతున్నాయి. దళిత స్త్రీలకు దాదాపు రాజకీయాధికారంలో భాగస్వామ్యం లేదు. అగ్రకులాల వేధింపులకు నిరంతరం గురవుతున్న దళిత స్త్రీ రాజకీయంగా ఓటు వేయడం ద్వారా అగ్రకుల రాజ్యాధికారానికి ఉపయోగపడుతోంది. కానీ తాను ఆధిపత్యంలోకి రాలేకపోతుంది.

చరిత్రను తిరగరాసేది మహిళలే

భారత ఉపఖండంలో ప్రజాస్వామ్య బద్ధంగా జరుగుతున్న ఎన్నికలు కూడా ఒక పెద్ద ఫార్సుగా తయారయ్యాయి. దళితులు, స్త్రీలు రాజకీయ భాగస్వామ్యాన్ని పొందకపోవడంతో సమంగా నష్టపోతున్నారు. ఈ విషయాన్ని చెబుతూ డాక్టర్ మణి, పి.కమేర్‌కర్ ఇలా అన్నారు. దళితులను నిర్లక్ష్యం చేసినట్లే, స్త్రీలను ఒక అల్ప సంఖ్యాక వర్గంగా లెక్కించి, రాజకీయాల్లో స్త్రీలను కూడా నిర్లక్ష్యం చేశారు. స్త్రీలు పార్లమెట్‌లోకి వెళ్తే సమాజ భవితవ్యమే మారిపోతుంది. ఎందుకంటే వీరు కుటుంబాన్ని తీర్చిదిద్దినట్లే సమాజాన్ని తీర్చిదిద్దగలరు. మీరు స్త్రీలను, బీసీలను, దళితులను నిర్లక్ష్యం చేసినంతకాలం ఆ పార్లమెంటుకు అర్థం లేదు. అది అగ్రవర్ణాల పార్లమెంట్, కార్పోరేట్ శక్తులకు తొత్తైన పార్లమెంట్, అవినీతిపరుల, దోపిడిశక్తుల పార్లమెంట్, బ్యాంకులకు డబ్బులు ఎగగొట్టే పార్లమెంట్, డబ్బులు ఎగవేసి ఇతర దేశాలకు వెళ్ళే పార్లమెంట్. కానీ నిజాయితీపరులు, నీతిపరులు, వ్యక్తిత్వ శిల్పులు, శ్రామిక శక్తులు, ఉత్పత్తి శక్తులు, దళిత బహుజన స్త్రీ నారీ మణులు, ఈ పార్లమెంట్‌ను అలంకరించే రోజు రావాలి. మహిళా రిజర్వేషన్ బిల్లు కచ్చితంగా బహుజన దళిత స్త్రీ వ్యతిరేక బిల్లు. జనాభా నిష్పత్తిని బట్టి అందరికీ సమాన అవకాశాలు వచ్చినప్పుడే భారతదేశంలో నూతన విప్లవం వస్తుందని, రాజ్యాంగం ప్రతిఫలిస్తుందని అంబేద్కర్ చెప్పాడు. భవంతులు మారితే కాదు బుద్ధులు మారాలి అని అంబేద్కర్ చెప్పాడు. అంబేద్కర్ చెప్పినట్లు స్త్రీకి ఆర్థిక, సాంఘిక, విద్య, తాత్విక, రాజకీయ రంగాలలో కులమత భేదాలు లేకుండా సమాన స్థాయి వచ్చినప్పుడే రాజ్యాంగం ప్రతిఫలిస్తుంది. అంబేద్కర్ రాజ్యాంగమే భారతదేశ పునర్నిర్మాణానికి దిక్సూచి.

డా. కత్తి పద్మారావు

98497 41695



Next Story

Most Viewed