మారిన రాజకీయ పరిస్థితులు... జగన్ భయమేంటి?

by Disha edit |
మారిన రాజకీయ పరిస్థితులు... జగన్ భయమేంటి?
X

నియంతపై గెలుపు కీలక మలుపు కాబోతోంది. మార్పు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారన్నది అర్థమైంది. ఆరుగురు గెలిచిన ఆనందం ఆవిరై పోయింది. ఒకరు గెలిచిన శిబిరంలో సంబరాలు అంబరాన్నంటాయి. పైగా ఒకరినొకరు అనుమానిస్తూ, అవమానిస్తూ నిందలు మోపుకుంటున్నారు. ఇది వైసీపీ పార్టీలో ప్రస్తుత పరిస్థితి. తిరుగుబాటు మొదలైంది. జగన్ నాయకత్వాన్ని సొంత పార్టీ ఎమ్మెల్యేలే భరించలేకపోతున్నారు. ఎమ్మెల్యేలకు క్యాంపులు నిర్వహించారు, నిఘా పెట్టారు, మాక్ పోలింగ్ అంటూ ప్రతిరోజు క్లాసులు పెట్టారు. పాత హామీలన్నీ నెరవేరుస్తామని కొత్తగా గట్టి హామీలిచ్చారు. పాలకపక్షానికి ఉన్న అవకాశాలన్నింటిని ఈ ఎన్నికల్లో వాడారు. కానీ ఏదీ ఓటమిని ఆపలేకపోయింది. మొత్తం 21 శాసనమండలి స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కేవలం నాలుగు స్థానాల్లోనే తెలుగుదేశం నెగ్గింది. 17 స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంది.

తెలుగుదేశం గెలిచింది నాలుగు శాసనమండలి స్థానాలైనా రాష్ట్ర రాజకీయాలను బాగా ప్రభావితం చేశాయి. ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం పెరిగింది. అధికార పార్టీకి, ప్రభుత్వ అధికారులకు, ముఖ్యంగా పోలీసువారికి ఇదొక హెచ్చరిక. ప్రజల తీర్పును గౌరవించకుండా కుంటిసాకులు వెతుక్కుంటున్నారు. పట్టభద్రులు ఇచ్చే తీర్పు ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తుంది, ఓటర్లు చదువుకున్నవారు, వాళ్ళిచ్చే తీర్పు ప్రతిపక్షాలకు కనువిప్పు కలుగుతుందని వైసీపీ నేతలు మొదట్లో చెప్పారు. ఇప్పుడు మాట మార్చి పట్టభద్రులు పథకాలకు లబ్ధిదారులు కాదు.. మా ఓట్లు వేరే ఉన్నాయి అని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. మరి శాసనసభ్యులు కూడా మీ ఓటర్లు కాదా ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే పులివెందులలోనూ అధికార పార్టీకి ఎదురుగాలి వీచింది.

కొనుగోళ్లపై మీరా చెప్పేది?

ఏడు స్థానాల్లో గెలుపొందడానికి అవసరమైన సంఖ్యా బలం లేకపోయినా అత్యాశకు పోయి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో చతికిలపడ్డారు. తమ సభ్యులు కాని నలుగురు తెలుగుదేశం, ఒక జనసేన సభ్యునితో కలిపి బలం సరిపోతుందని, అన్ని స్థానాలు సులభంగా గెలవచ్చని అనుకున్నారు. కానీ విధి వక్రించింది. తమ సభ్యులను ప్రలోభాలకు గురిచేసింది, కోట్లు పెట్టి కొన్నామని అంటున్నారు. మీరు చేసే అభియోగాలు ఇటువైపు నుంచి ఫిరాయించిన శాసనసభ్యులకు కూడా వర్తించాలి కదా! మూడేళ్ల క్రితమే మీరు చేసిన కొనుగోళ్లు మర్చిపోయారా? అభద్రతా భావంతో, అసంతృప్తితో ఆత్మ ప్రబోధానుసారం ఎమ్మెల్యేలు వ్యవహరించారు.

రహస్య బ్యాలెట్ ద్వారా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ఎలా బహిర్గతమైంది కోడ్‌ను ఇవ్వడం ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించడం కాదా ఎన్నికల నిబంధన ప్రకారం ఓటు ఎవరికి వేశారనేది ఓటరుకు మాత్రమే తెలియాలి. ఇతరులు తెలుసుకోవడం అనైతికం, అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం. వైసీపీ పార్టీ సభ్యులను సస్పెండ్ చేయడం ఆ పార్టీ అంతర్గత వ్యవహారం. క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డ వారిని గుర్తించిన విధానం ఎన్నికల ప్రక్రియను అపహాస్యం పాలుచేయడమే అవుతుంది. పార్టీ మారాలనుకుంటే పదవులకు రాజీనామా చేసి రావాలని చెప్పిన మీరు.. టీడీపీ, జనసేనకి చెందిన నలుగురు శాసనసభ్యులను ఎలా చేర్చుకున్నారు? ఇదేనా విలువలు, విశ్వసనీయతా!

బానిస బతుకుల ధిక్కార స్వరాలు

పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల ద్వారా ప్రజల్లో వైసీపీపై నమ్మకం లేదనేది తేలిపోయింది. సొంత పార్టీ శాసనసభ్యుల విశ్వాసం కూడా జగన్ కోల్పోయారు. ఎమ్మెల్యేలకు స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు లేవు. అవినీతిని కేంద్రీకృతం చేసి ముఖ్యమంత్రి అన్ని వనరులు దోచుకుంటున్నారు. సంక్షేమం ముసుగులో అభివృద్ధిని గాలికి వదిలేశారు. బానిస బతుకు బతకలేక కనీస గౌరవ, మర్యాదలు దక్కకపోవడంతో ధిక్కార స్వరాలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి దర్శనం కూడా కరువైంది. దీంతో ప్రజలతో, ప్రజా ప్రతినిధులతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. అన్నింటికి సకల శాఖ మంత్రి సజ్జలను కలవడం మినహా మరో దారి లేకుండా పోయింది. స్థానిక సంస్థల ప్రతినిధులు సైతం అసంతృప్తిగా ఉన్నారు. వారిపైనా వాలంటీర్ల పెత్తనమే. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం మచ్చుకైనా కనిపించడం లేదు. జగన్ రెడ్డి నియంతృత్వ విధానాలు రాచరిక వ్యవస్థను గుర్తుచేస్తున్నాయి.

రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోవడంతో జగన్ రెడ్డిలో ఓటమి భయం మొదలైంది. ప్రతిపక్షాలు పొత్తులు పెట్టుకుంటాయో, విడివిడిగా పోటీచేస్తాయో ఆయా రాజకీయ పార్టీల అంతర్గత వ్యవహారం. పొత్తుల గురించి మాట్లాడే హక్కు మీకెక్కడిది సింహం సింగిల్‌గా వస్తుందని మీ మంత్రులు, మీరు ప్రతిరోజు ప్రకటనలు చేస్తున్నారు. మీ ఉన్మాద చర్యలే ప్రతిపక్షాలను ఏకం చేస్తున్నాయి. ఎక్కడ ప్రతిపక్షాలు ఏకమవుతాయో, తన అధికారం ఎక్కడ పోతుందనే ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. 175 చోట్ల ఒంటరిగా పోటీ చేసి గెలిచే ధైర్యం ఉందా అని సవాల్ చేస్తున్న మీకు.. సభ ప్రారంభం కాగానే జనం గోడలు దూకి పారిపోతుండటం కనిపించడం లేదా? మీ అబద్ధాల కోటలు కూలిపోయే రోజులు దగ్గరపడ్డాయి. ఎన్నికల గాలివాన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఆ తుఫానులో మీరు కొట్టుకుపోవడం ఖాయం. తోడేలు రూపంలో ఉన్న జగన్ రెడ్డిని ఆలస్యంగానైనా విద్యావంతులు గుర్తించారు.

మంచి చేద్దామంటే అడ్డుపడిందెవరు?

ప్రభుత్వ పనితీరును, మంచి చెడుల గురించి చెప్పాల్సింది ప్రజలు. నిత్యం మంచి చేయడానికి ప్రయత్నిస్తుంటే మీకు అడ్డుపడిందెవరు? పోలవరం పూర్తిచేస్తామంటే, రాజధాని నిర్మిస్తామంటే ఎవరు అడ్డుపడ్డారు? సీపీఎస్ రద్దు, ఏటా జాబ్ కేలండర్ విడుదలకు ఎవరు అడ్డుపడ్డారు? దశలవారీ మద్యపాన నిషేధానికి ఎవరు అడ్డుపడ్డారు? మంచి చేయడమంటే మీ దృష్టిలో ప్రశ్నించే వారిని హింసించడం, రాజకీయ ప్రత్యర్థులను అంతమొందించడమేనా? కుటుంబ, రాజకీయ, మానవతా విలువల గురించి మీరు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. చెల్లిని, తల్లిని తరిమికొట్టి బాబాయిని అంతమొందించిన మీరా విలువల గురించి మాట్లాడేది? మీ విలువలు, విశ్వసనీయత గురించి పట్టభద్రులు తేల్చిచెప్పారు. జగన్ రాష్ట్రంలో ఒంటరివాడయ్యారు.

మిమ్మల్ని మీరు హీరోగా అభివర్ణించుకుంటున్నారు, మీ వికృత చేష్టలు చూసి ప్రజలు మిమ్మల్ని విలన్ అనుకుంటున్నారు. అరగంట ప్రయాణానికి లక్షలు ఖర్చుపెట్టి హెలికాఫ్టర్‌లో రావడం అవసరమా? ఆకాశంలో ప్రయాణిస్తూ రోడ్డు మార్గాన్ని ఎందుకు మూసేసినట్లు? దారిపొడవునా పరదాలు కట్టి, బారికేడ్లు పెట్టి, చెట్లు నరికి స్కూళ్లు, షాపులు మూసి ముఖ్యమంత్రి సభలు జరుపుతున్నారు. 98.5 శాతం హామీలు నెరవేర్చారన్నారు. పూర్తికాని 1.5 శాతం హామీలు ఏవో సెలవిస్తే బావుంటుంది. ఒకసారి శంకుస్థాపన చేసినవాటికి పదేపదే శంకుస్థాపన చేస్తూ, ఒకసారి ప్రారంభించిన వాటినే మళ్లీ ప్రారంభిస్తున్నారు.

మాటల్లో కాదు.. చేతల్లో చూపాలి

నేరగాళ్లకు దేవుడు మొట్టికాయలు వేస్తారని శాపనార్థాలు పెడుతున్నారు. దేశంలోనే అతిపెద్ద ఆర్థిక నేరస్తుడిగా 16 నెలలు జైలు జీవితం గడిపిన మీరా చెప్పేది? నేరాలకు, ఘోరాలకు ప్రతినిధిగా ఉన్న మీరు ఈ విధంగా మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ రాష్ట్ర ప్రజల భద్రతను ప్రమాదంలోకి నెట్టి, నిందితులను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. మరో ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శాసనమండలి ఎన్నికల ఫలితాలు పాలకపక్షానికి మింగుడుపడటం లేదు. ప్రజల్లో, పార్టీ శ్రేణుల్లో ఉన్న అసంతృప్తిని తొలగించకపోతే ఓటమి ఖాయం. మాటల్లో కాదు.. చేతల్లో ముఖ్యమంత్రి నేలపై నడవాలి. ఓటమి పరాభవంతో మరిన్ని తప్పులు చేయకుండా ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిది. వైనాట్ 175.. 30 ఏళ్లు అధికారంలో ఉంటానంటూ అహంకారపూరితమైన వ్యర్థ ప్రేలాపనలు మానుకోవాలి. నేను దైవాంశ సంభూతుడిని, నాకు దేవుడిచ్చిన అధికారం అనే ఊహల్లో నుంచి బయటకు రావాలి. మీ అహంకార, ప్రతీకార వైఖరిని విడనాడి మీ చెర నుంచి రాజ్యాంగానికి విముక్తి కలిగించాలి. ప్రజల్లో వచ్చిన మార్పును గమనించి, పాలనలో వైఫల్యాలను గుర్తించి సుపరిపాలన అందించాలి.

మన్నవ సుబ్బారావు

గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్

99497 77727

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ ౭౯౯౫౮౬౬౬౭౨

ఇవి కూడా చదవండి:

తెలుగుదేశం ఏర్పాటు... నవ చరిత్రకు మలుపు..

పక్కా ప్లానింగ్‌తోనే..రాహుల్‌ని ఇరికించారా!?


Next Story