కులగణనతోనే.. సామాజిక న్యాయం సాధ్యం!

by Disha edit |
కులగణనతోనే.. సామాజిక న్యాయం సాధ్యం!
X

ఇప్పుడు దేశంలో ప్రధాన చర్చల్లో కులగణన ఒక ప్రధానాంశంగా నిలిచింది. ఈ మధ్యకాలంలో దేశంలో కులగణన చేయాలని మెజారిటీ ప్రజలు కోరుకుంటే కొందరు కుహనా మేధావులు మాత్రం దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.వాదనకు నిలబడని రాతలు రాస్తూ చర్చల్లో నిల్చుంటున్నారు.

సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి తాను ఓబీసీ సామాజిక వర్గానికి చెందినవాడినని వేదికలమీద ప్రకటించారు. కానీ ఇప్పుడు అదే ఓబీసీల ప్రధాన డిమాండ్ అయిన కులగణన అంశం వచ్చేవరకు ఇది దేశాన్ని కులపరంగా విభజనకు దారితీస్తుందని వాపోతున్నారు.

సామాజిక శ్రమ విభజనే!

మనిషి ఎంత విజ్ఞానవంతుడైనా కులం తోకలు ఇంకా తొలగిపోత లేవు. కులం ఓ సామాజిక గుర్తింపుగా ఉంది. అగ్రవర్ణాలకు కులం సామాజిక విలువగా ఉంటే, కింది వర్గాలకు అదే కులం సామాజిక వివక్షగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. కులం భారతీయ సమాజంలో ఉత్పత్తి ప్రక్రియకు సంబంధించిన సామాజిక శ్రమ విభజన. ఇప్పటి సమాజంలో రాజకీయ పార్టీలు, పెద్ద కంపెనీలు, మీడియా రంగం, ఇతర సేవారంగం, ఏదైన ఉదాహరణకు తీసుకొండి అన్నీ రంగాలలో ఆధిపత్యం ఆధిపత్యపు కులాలదే ఉంటది. ప్రతిభ అందరి సొత్తు అయినప్పుడు ఈ వెలివేతల మాటేమిటన్నది అంతుచిక్కని ప్రశ్న.

తెలంగాణ శాసనసభ ఓ చారిత్రక ఘట్టానికి అడుగులు వేసింది. జనాభా దామాషా ప్రకారం తమ వాటా తమకు కల్పించాలంటూ బీసీ సమాజం దశాబ్దాలుగా చేస్తున్న పోరాటం మేరకు సమగ్ర కుల గణన చేపట్టాలని ఇతర రాష్ట్రాలతో పాటు మన తెలంగాణ కూడా నడుం కట్టింది. రాష్ట్రంలో ప్రజలందరి వాస్తవ స్థితిగతులు వారి వివరాలను శాస్త్రీయంగా సేకరించేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ అవకాశాల ప్రణాళికల రూపకల్పనకు ఈ కులగణన చేపట్టనున్నారు. సామాజిక వివక్షతల నడుమ సమానమైన అభివృద్ధి చెందక ఇంకా బీదరికంలో కొట్టుమిట్టాడుతున్న వర్గాలకు సామాజిక న్యాయం ఆర్థిక ప్రగతి అందిస్తూ ఆయా వర్గాల మధ్య సంకుచితమైన విభేదాలను నిర్మూలన చేసి దేశ ఐక్యతకు తోడ్పడుతుంది ఈ కులగణన.

సామాజిక అనిశ్చితి తొలగిపోతుందని..

కులగణన అంటే కేవలం జనాభాను లెక్కించడం ఒక్కటే కాదు. ఆయా కులాల సంఖ్య, మతం, ఏఏ కులాల్లో ఎంతమంది చదువుకుంటున్నారు, ఏ ఉద్యోగాలు చేస్తున్నారు, ఏ రకమైన ఆర్థిక ప్రగతి సాధించారు, ప్రధాన ఆదాయ వనరులుగా దేనిమీద ఎక్కువగా ఆధారపడ్డారు, ఎటువంటి రాజకీయ సామాజిక స్థితులలో ఉన్నారు వంటి ప్రధానమైన అంశాలను ఈ కులగణన లెక్కించి ఏ వర్గాలకు ఇకపై ఏ అవకాశాలు కల్పించాలో ఒక అవగాహన ఏర్పడుతుంది.

1980లో మండల్ కమిషన్ నివేదిక ప్రకారం ఓబీసీల జనాభా 52% ఉందని అంచనా వేసింది.ఇవాళ 63%గా తేలింది. బీహార్ రాష్ట్రంలో కులగణన వెల్లడించిన వివరాల ప్రకారం అగ్రకులాలు 15.52% ఉంటే ఉద్యోగులు 6.41% ఉన్నారు. అదే ఓబీసీలైతే 27% ఉన్న జనాభాలో కేవలం 6.21% ఉద్యోగులు ఉన్నారు. ఇటువంటి వ్యత్యాసాలు పూడ్చాలని దీనిద్వారా ఒక సామాజిక అనిశ్చితి తొలగిపోతుందనే భావిస్తూ బీసీల మేధావులు కులగణనపై పోరాటం చేస్తున్నారు. కులగణన మీద కొందరు మేధావులు ఎంతో అక్కసు మూటగట్టుకున్నప్పటికీ వాస్తవానికి కులగణన సమాచారం, కుల వ్యవస్థను బలహీనపరిచే ఒక ఆయుధంగా ఉపయోగపడుతుంది. కులగణన ద్వారా సామాజిక న్యాయ పరమైన మార్పు జరుగుతుందే తప్ప మరే చెడూ జరగదు.

-అవనిశ్రీ.

99854 19424



Next Story