24 ఫ్రేమ్స్:ఓటీటీ సినిమాను మింగుతుందా?

by Disha edit |
24 ఫ్రేమ్స్:ఓటీటీ సినిమాను మింగుతుందా?
X

ఈ ఓటీటీలతో సినిమా చరిత్ర ముగిసినట్టేనా? అంటే, అది ఆలోచించాల్సిన అంశమే. ఓటీటీలలో సినిమాలు లేదా మరేదైనా విజువల్ కంటెంట్ చూస్తున్నప్పుడు సినిమా హాలు అనుభవం లభిస్తుందా? ఓటీటీ చూస్తున్నప్పుడు సెల్‌ఫోన్ మోగొచ్చు, కాలింగ్ బెల్ మోగి ఇంటికెవరయినా రావచ్చు, ఆవిడ టీనో, కాఫీనో ఇవ్వొచ్చు లేదా చిన్న పిల్లలు డిస్టర్బ్ చేయొచ్చు. ఆ స్థితిలో సినిమా చూసిన కంపాక్ట్ అనుభూతి ఎట్లా వస్తుంది? ఇంకోవైపు ఆలోచిస్తే ఇవ్వాళ ఒక ఫ్యామిలీ సినిమాకు వెళ్లాలంటే ఎంత శ్రమ? ఎంత ఖర్చు? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా నెలకొక సినిమాను మించి భరించే స్థితి లేదు. ఈ స్థితిలో ఓటీటీనే బెటరేమో! మరి, సినిమాహాల్స్, స్టూడియోలు, సినిమావాళ్లు ఏమైపోతారు?

ది స్ట్రీమింగ్ కాలం, ఒటీటీల యుగం. అంతా 'ఓవర్ ద టాప్'. దేనికీ పరిమితి లేదు. అడ్డూ ఆపూ లేదు. 'దునియా ముఠ్టీమే' అంతా వినోదమే. అంతా టయిం పాస్. ఇవ్వాళ జనమంతా తాము తినే ఆహారం కంటే వినోదానికే ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. దానికే అధిక సమయం హెచ్చిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇన్నేళ్లుగా వినోదాన్ని పంచిన 'సినిమా'ను ఈ ఓటీటీలు మింగేస్తాయా? దృశ్య శ్రవణ మాధ్యమంగా ఊరేగిన సినిమాకిక అవసాన దశ వచ్చినట్టేనా? గత కొంత కాలంగా ఈ ప్రశ్న వేధిస్తున్నది. 'కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు వెళ్లి పోవాల్సిందే' అంటారు కదా! తప్పదా?

ఆనాడే ఎదురైన ప్రశ్న

సాంకేతిక పరిణామ క్రమంలో ఈ ప్రశ్న ఇంతకు ముందు కూడా వచ్చింది. టీవీలు వచ్చి 40 అడుగుల అంటెన్నాలను దాటి, కేబుల్ టీవీ, డీటీహెచ్ మన డ్రాయింగ్ రూములనూ. బెడ్ రూములనూ అలంకరించినప్పుడు కూడా 'ఇక సినిమా పని అయిపొయింది. ఇంటిలోనే సినిమా అందుబాటులోకి వచ్చినంక ఇక సినిమా హాలుకి ఎవడు పోతాడు' అనుకున్నారు. టీవీల ఫలితంగా ఒక చిన్న కుదుపునకు గురైనా సినిమా రంగం నిలదొక్కుకుంది. పుంజుకుంది. కొత్త పుంతలు తొక్కింది. ఎందుకంటే టీవీ నియంత్రిత మాధ్యమం. కేబుల్ ఆపరేటరో. డీటీహెచ్‌వారో ప్రసారం చేసే సినిమాలు లేదా ఆడియో విజువల్ కంటెంట్‌ను, వారిచ్చిన సమయానికే, వారు ప్రసారం చేసిన సమయానికే చూడాల్సి వచ్చేది.

అదీ సెట్‌అప్ బాక్సు, టీవీల ముందు కూర్చొని మాత్రమే. దూరదర్శన్ తొలి రోజులలోనైతే చిత్రహార్, చిత్రలహరి సహా సినిమాలకు కూడా నియంత్రిత సమయాలుండేవి. దాంతో వినోద రంగంలో సినిమా ఉనికికి ఎలాంటి ఆటంకం రాలేదు. ఇక మరోసారి సినిమాల ఒరిజినల్ లేదా పైరేటెడ్ డీవీడీలు మార్కెట్‌లో విరివిగా లభించిన కాలం. నేనూ, హైదరాబాద్ ఫిలిం క్లబ్ ప్రకాశ్‌రెడ్డిగారూ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌కు వెళ్లినప్పుడల్లా ఎన్ని సినిమాలు చూసేవాళ్లమో, అంతకు మించి డీవీడీలు కొనేవాళ్లం. క్లాసిక్స్ నుంచి మొదలు కరెంట్ సినిమాల దాకా. ఇప్పుడవన్నీ డబ్బాలలో షెల్ఫులలో మూలుగుతున్నాయి. నా సహచరి ఇందిర ఇంటినిండా ఇవన్నీ ఎందుకు? మీ సినిమాలన్నీ ఇంటర్నెట్‌లో, ఒటీటీలలో దొరుకుతున్నాయి కదా? అంటే ఆ డీవీడీలన్నీ దిగాలుగా చూస్తున్నట్టు అనిపిస్తుంది. అట్లా డీవీడీలు అందుబాటులోకి వచ్చినా సినిమా మనుగడకు దెబ్బ తగలలేదు.

మారుతున్న పరిస్థితులు

కానీ, ఇవ్వాలటి పరిస్థితి వేరు. 'ఓవర్ ద టాప్' (ఓటీటీ) సాంకేతికత విస్తారమయింది. దానికి కేబుల్ లేదా డీటీహెచ్ అవసరం లేదు పబ్లిక్ ఇంటర్నెట్ ద్వారా పనిచేస్తాయి. టీవీ చూడడానికి టీవీ సెట్ ముందు కూర్చోవాల్సిన అవసరం లేదు. సినిమా చూడడానికి టాకీసుకు వెళ్లాల్సిన పనిలేదు. ఓటీటీ Multi gadjet accessibility వున్న సాంకేతికత. అంటే అనేక సాంకేతిక పరికారలతో ఎప్పుడయినా, ఎక్కడయినా విజువల్ కంటెంట్‌ని చూడవచ్చు. ఇంటర్నెట్ జోడించిన స్మార్ట్ టీవీ, స్మార్ట్ ఫోన్, లాప్‌టాప్, టాబ్ ఇలా అనేకం ఉపయోగించవచ్చు. అది పెద్ద సౌలభ్యం.

ఓటీటీలలో సినిమాలే కాకుండా ఒరిజినల్స్, వెబ్ సిరీస్, స్పోర్ట్స్, క్రైం, పిల్లల కోసం ప్రత్యేకం, ఇలా ఒకటేమిటి ఎన్నో ఉంటాయి. ఓటీటీ ప్లాట్‌ఫారాలు పుట్టగొడుగుల వలె వస్తున్నాయి. వీక్షకుల చాయిస్ పెరిగింది. ఓటీటీలు కోవిడ్ కాలం నుంచి విస్తృతంగా ఉపయోగంలోకి వచ్చాయి. లాక్‌డౌన్ కారణంగా బయటకు వెళ్లలేని స్థితి. ఫలితంగా ఒటీటీలకు అలవాటు పడిపోయారు. దాంతో దానికి చెప్పలేనంత మార్కెట్ పెరిగింది. ఓటీటీకి అత్యంత పాపులారిటీ తెచ్చి పర్యాయ పదంగా నిలిచింది NETFLIX అనే చెప్పాలి. తర్వాత AMAZON, DISNEY, SONY HOTSTAR ఇట్లా ఎన్నో అందుబాటులోకి వచ్చాయి. మన దేశంలో మొట్టమొదట రిలయెన్స్ సంస్థ 2008 లోనే BIGFIX పేర ప్రారంభించింది. తర్వాత 2010లో Digivive ఓటీటీ మొబైల్ ఆప్ nexGTv ని మొదలు పెట్టింది. అట్లా ఆరంభమైన ప్రస్థానం వేలాది కోట్ల పెట్టుబడులు, లాభాలతో సాగుతున్నది.

మారేది ఇది మాత్రమే!

అయితే, ఈ ఓటీటీలతో సినిమా చరిత్ర ముగిసినట్టేనా? అంటే, అది ఆలోచించాల్సిన అంశమే. ఓటీటీలలో సినిమాలు లేదా మరేదైనా విజువల్ కంటెంట్ చూస్తున్నప్పుడు సినిమా హాలు అనుభవం లభిస్తుందా? ఓటీటీ చూస్తున్నప్పుడు సెల్‌ఫోన్ మోగొచ్చు, కాలింగ్ బెల్ మోగి ఇంటికెవరయినా రావచ్చు, ఆవిడ టీనో, కాఫీనో ఇవ్వొచ్చు లేదా చిన్న పిల్లలు డిస్టర్బ్ చేయొచ్చు. ఆ స్థితిలో సినిమా చూసిన కంపాక్ట్ అనుభూతి ఎట్లా వస్తుంది? ఇంకోవైపు ఆలోచిస్తే ఇవ్వాళ ఒక ఫ్యామిలీ సినిమాకు వెళ్లాలంటే ఎంత శ్రమ? ఎంత ఖర్చు? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా నెలకొక సినిమాను మించి భరించే స్థితి లేదు.

ఈ స్థితిలో ఓటీటీనే బెటరేమో! మరి, సినిమాహాల్స్, స్టూడియోలు, సినిమావాళ్లు ఏమైపోతారు? నా అభిప్రాయంలో ఏమీ అవరు. సినిమాల ORIENTATION మారుతుంది. ఇప్పటికంటే పెద్ద బడ్జెట్ పెద్ద వినోదం, పెద్ద ప్రచారంతో ముందుకు వస్తారు. అంటే, మరింత అర్థం లేని సినిమాలకు అవకాశాలు పెరుగుతాయి. పంచె డాన్స్, ఫైట్ డ్రామాలు పెరుగుతాయి. వాటి కాన్వాస్ పెరుగుతుంది. అంతే. ఇక ఓటీటీలలో కొత్తవాళ్లకు, కొంత అర్థవంతమయిన సినిమాలు వచ్చే అవకాశం వుంది. ఫ్యామిలీతో కలిసి చూసే అవకాశం వుంది. అంటే, టీవీలు వచ్చినప్పుడూ సినిమా బతికింది, ఓటీటీల కాలంలోనూ బతుకుతుంది ఏవో కొన్ని మార్పులతో. ఆ మార్పులు మంచికా చెడ్డకా వేచి చూడాలి.

వారాల ఆనంద్

9440 501281


Next Story

Most Viewed