పీఎం కేర్ ఫండ్ లెక్కలు చెప్పరా?

by Disha edit |
పీఎం కేర్ ఫండ్ లెక్కలు చెప్పరా?
X

దేశంలో నేషనల్ డిజాస్టర్ ఫండ్ లాంటివి ఎన్నో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే పని చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ 2020 మార్చ్ 28న ప్రధాని నరేంద్ర మోదీ ఛైర్మెన్‌గా ఏర్పాటు అయిన చారిటబుల్ ట్రస్ట్‌తో మాత్రం ప్రభుత్వానికి సంబంధం లేదు. పీఎం కేర్ ఫండ్ పేరిట విరివిగా విరాళాలు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో పెట్టి మరీ ప్రచారం చేయడం జరిగింది. దీనితో ట్రస్ట్ ఏర్పాటు అయిన మూడు రోజుల్లో మూడు వేల కోట్ల రూపాయలకు పైగా జమ అయ్యాయి. మూడు నెలల్లో ఈ విరాళాలు 10వేల కోట్ల రూపాయలు దాటాయి. బాలీవుడ్ హీరోలు.. నటులు.. క్రికెటర్లు సహా ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు భారీగా డబ్బులు ఇచ్చారు. ఈ పీఎం కేర్ నుంచి 50 వేల వెంటిలేటర్ల కొనుగోలుకు రూ, 3,100 కోట్ల రూపాయలు కేటాయించారని, ముందు, ఆ తర్వాత కాదు, కాదు, రూ.2,000 వేల కోట్లే అన్నారు. ఇక వలస కార్మికుల కోసం రూ.1000 కోట్లు ట్రస్ట్ నుంచి కేటాయించారు. దీని ఖర్చు ఇంకా ఎవరూ చెప్పలేదు. చెప్పేవారు లేరు.

దేశంలోని 101 పీఎస్‌యూ యూనిట్‌ల నుంచి పీఎం కేర్‌కు 2,400 కోట్ల రూపాయలు.. ఉద్యోగులు తమ వేతనాల నుంచి రూ.155 కోట్ల రూపాయలు పీఎం కేర్‌కు ఇచ్చారు. ఎల్ఐసి.. జనరల్ ఇన్సూరెన్స్.. నేషనల్ హౌసింగ్ తదితరాల నుంచి రూ. 144 కోట్లు..15 ప్రభుత్వ బ్యాంకుల నుంచి రూ. 350 కోట్లు.. ఆర్బీఐ స్టాఫ్ నుంచి ఏడున్నర కోట్ల రూపాయలు.. ఇతర బ్యాంక్‌ల సిబ్బంది నుంచి సుమారు 150 కోట్ల రూపాయలు.. ఇండియన్ రైల్వే నుంచి రూ. 150 కోట్లు.. డిఫెన్సె నుంచి సైనికులు రూ.500 కోట్లు పీఎం కేర్‌కు ఈ సందర్భంగా విరాళాలు ఇచ్చారు. కోర్టులో ఒకరు పీఎం కేర్ నిధులు లెక్కల మీద పిటిషన్ వేసిన సందర్భంలో అండర్ సెక్రటరీ అధికారి ఒకరు కోర్టుకు వచ్చి పీఎం కేర్ ఫండ్‌కు ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పారు. ఆడిటర్ ఉన్నారు. ఆడిటింగ్ జరుగుతోంది. అంతా పారదర్శకమని చెప్పేసారు.

లెక్కలు అడగొద్దా?

ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వం ఆ దేశ ప్రధాని చైర్మన్‌గా ట్రస్ట్ ఏర్పాటు చేస్తారు. అన్ని ప్రభుత్వ విభాగాలకు సర్క్యూలర్ జారీ అవుతుంది. రెవెన్యూ, ఎయిమ్స్.. తదితర సంస్థలు సర్క్యులర్‌‌పై వ్యతిరేకత వ్యక్తం చేశాయి. దీంతో బలవంతం ఏమీ లేదన్నారు.. ఇలా పీఎం కేర్ ఫండ్‌ను భారీగా పోగు చేశారు. ప్రభుత్వానికి దీనితో సంబంధం లేదని చెబుతున్నారు. దేశంనుంచే కాదు విదేశాల నుంచి కూడా భారత్ పీఎం కేర్ ఫండ్‌కు భారీగా విరాళాలు వచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అసలు ప్రభుత్వానికి ఈ విషయంలో జవాబుదారీ లేకుండా పోయింది. ఒక దేశం ప్రధాన మంత్రి ట్రస్ట్‌కు చైర్మన్‌గా ఉండటం ఏమిటి? ఇప్పుడు దానికీ, ప్రభుత్వానికి సంబంధం లేదని ఎలా చెబుతారు. పీఎం ఫోటో పెట్టడమే కాకుండా పీఎం ఈ ట్రస్టుకు చైర్మన్‌గా ఉన్నారు కాబట్టే పీఎస్‌యూలను, బ్యాంకులను కార్పోరేట్‌లకు దారాదత్తం చేస్తూ నిర్ణయాలు తీసుకోవడం, ఉద్యోగులను రోడ్లమీదకు తీసుకుని రావడానికి కేంద్రం కారణం అని తెలిసినా వీరంతా విరాళాలు ఇచ్చారు. కోవిడ్ నుంచి దేశాన్ని కాపాడటానికి ఇతోధికంగా సహకరించారు. ఎన్నో కష్టాల్లోనూ వేల కోట్ల రూపాయలు పోగు అయ్యాయి. అలాంటి నిధికి ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఎలా ఉంటుంది? ప్రభుత్వానికి సంబంధం లేదని ఎలా చెబుతారు? పీఎం నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఏదైనా సాధ్యమే.. వారు ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు.. తీసుకునే అధికారం మాకుంది. మమ్మల్ని ఎవరూ ప్రశ్నించవద్దు అనే విధంగా పరిస్థితి ఏర్పడింది.. పీఎం కేర్ ఫండ్..లెక్కలు ఫండ్ ఇచ్చిన వారు సైతం అడిగే హక్కు లేదు. తాము ఇచ్చిన విరాళం ఎక్కడ ఖర్చు చేశారు అని ప్రశ్నించే హక్కూ లేదు...హూ కేర్ ఇట్.. అది ప్రధాని కేర్ ఫండ్ మరీ..కాగ్‌కు కూడా దీనిపై ఆడిట్ చేసే ప్రశ్నించే హక్కు లేదు. అలా ఎన్నో వెసులుబాట్లు ఉపశమనాలు ఉన్నాయి. అలా చేసుకున్నారు.

జవాబుదారీతనం లేని విధానాలు..

నీవు ఉద్యోగివి అయితే ఏమి? ఖర్చు లెక్కల గురించి అడిగే హక్కు లేదు. ప్రజల పన్నులతో ప్రభుత్వం పని చేస్తుంది.. ప్రభుత్వంలో ఉన్న వారికి ప్రధాని సహా అందరికీ జీతభత్యాలు లభిస్తాయి. అలా అని అన్ని విషయాల్లో నిర్ణయాలు ప్రజలను అడిగి తీసుకుంటున్నమా.. ఇదీ అంతే అంటున్నారు, పాలకులు, ప్రభుత్వానికి పీఎం కేర్ ఫండ్ ట్రస్ట్‌తో సంబంధం లేనపుడు ఆఫీస్ అడ్రెస్.. పీఎం ఆఫీస్.. సౌత్ బ్లాక్.. ఢిల్లీ అని ఎందుకిచ్చినట్లో సమాధానం చెప్పాలి! మొత్తం వసూళ్లు సర్కార్.. పీఎం మోడీ పేరిట జరుగుతాయి.. ట్రస్ట్‌కు ప్రభుత్వానికి సంబంధం లేదని అంటే ఎట్లా.. దేశాన్ని నడిపించే వారు నడిపిస్తూనే, ట్రస్ట్ ఏర్పాటు చేసి కోవిడ్ లాంటి సంకట పరిస్థితులను ఎదుర్కోవడం కోసం ఫండ్ వసూలు చేసింది ఏ రూపంలో ఖర్చు చేసారని, అడిగితే సూటిగా సమాధానం చెప్పకుండా ఇంతగా దేశ ప్రజలకు, విరాళం ఇచ్చిన వారికి అనుమానం వచ్చే విధంగా మాట్లాడితే ఎలా? ఇంతవరకు రూ.13,000 కోట్ల దాకా రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్స్ కింద లెక్కలు చెప్పక్కరలేని ఫండ్స్ వచ్చాయి. ఎస్‌బీఐ వద్ద అమ్ముడు పోయిన బాండ్స్ ద్వారా ఈ లెక్కలు తెలిసాయి. 2017 నుంచి అన్ని రాజకీయ పార్టీలకు ఈ ఫండ్స్ వస్తున్నా 85 శాతం బీజేపీకే ప్రయోజనం చేకూరుతుంది. ఈ లెక్కల సంగతి కూడా సుప్రీంకోర్టు ముందుకొచ్చింది. దీనిపై సుప్రీంకోర్ట్ విచారణ జరుపుతున్నది! ఇవన్నీ ఏమాత్రం జవాబుదారీతనం లేని ప్రభుత్వ విధానాలు. ఇప్పుడు 2024 పార్లమెంట్ ఎన్నికలు సైతం దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీని ఇలాంటి అంశాలు చుట్టుముడుతున్నాయి!

ఎండి. మునీర్

సీనియర్ జర్నలిస్ట్

99518 65223

Next Story

Most Viewed