జమిలి ఎన్నికల డ్రామాలు ఎందుకు?

by Disha edit |
జమిలి ఎన్నికల డ్రామాలు ఎందుకు?
X

గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ,

నమస్కారం...

మరో తొమ్మిది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సిన సమయంలో అకస్మాత్తుగా మీరు ‘జమిలి ఎన్నికల’ గురించి హడావుడి చేయడం ఒక విధంగా ఆశ్చర్యం కలిగిస్తోంది. నిజంగా ఎన్నికల వ్యవస్థలో, మన ప్రజాస్వామ్య ప్రక్రియలో సంస్కరణల పట్ల నిజాయితీతో మీరు మాజీ రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేశారా? ఎన్నికల సమయంలో మీ ప్రభుత్వ వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మళ్లించడం కోసం మరో డ్రామా ఆడే ప్రయత్నాలు చేస్తున్నారా? ఇటువంటి సందేహాలు సహజంగానే దేశంలో అనేక మందికి కలుగుతున్నాయి.

ముందు.. ఆ రాష్ట్రాల్లో చేయండి!

పార్లమెంట్‌లో మూడింట రెండొంతుల మెజారిటీ లేకుండా, సగంకు పైగా రాష్ట్ర శాసనసభలలో సహితం అటువంటి ఆధిక్యత లేకుండా ‘జమిలి ఎన్నికల’ కోసం కీలకమైన రాజ్యాంగ సవరణలు తీసుకురావడం అంత సులభం కాదని తెలియక మీరు ఇటువంటి ప్రక్రియపై దేశ ప్రజల దృష్టి ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారని అనుకోము. దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో సుమారు 15 రాష్ట్రాల్లో బీజేపీ పార్టీయే అధికారంలో ఉంది. జమిలి ఎన్నికలు జరపాలనే ఆసక్తి మీకు ఉంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలను రద్దు చేసి 2024 ఏప్రిల్‌, మే లో జరిగే సాధారణ ఎన్నికలతో ఈ రాష్ట్రాలు కూడా ఎన్నికలు జరిపించవచ్చు. దీనివల్ల జమిలి ఎన్నికల కోసం చేసే సవరణలకు ఏ ఒక్క పార్టీ మద్దతు అవసరం లేకుండానే జమిలి ఎన్నికలు జరపొచ్చు. మీకు జమిలి ఎన్నికలపై చిత్తశుద్ధి ఉంటే ఈ పని చేయండి!

జమిలి ఎన్నికల పేరుతో ఐదేళ్ల వరకు తమ అధికారానికి అడ్డు, అదుపు లేకుండా నిరంకుశంగా అధికారం చెలాయించే విధంగా ప్రధానులు, ముఖ్యమంత్రులు వ్యవహరించే విధంగా చేయడమే మీ ఉద్దేశ్యమా? రాష్ట్రాలలో ప్రభుత్వాలను కూల్చివేసి, రాష్ట్రపతి పాలన కిందకు వచ్చే విధంగా చేసి, ఎన్నికలు లేకుండా కేంద్ర ప్రభుత్వం పెత్తనం చేసే విధంగా చేసుకోవడం మీ ఉద్దేశ్యమా? ఇటువంటి అనేక ప్రశ్నలు ఈ సందర్భంగా తలెత్తుతున్నాయి.

నిరంకుశ వ్యవస్థలు ఎందుకు?

జమిలి ఎన్నికల గురించి దేశంలో గత 50 ఏళ్లుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కేంద్రంలో, రాష్ట్రాలలో కాంగ్రెస్‌ మాత్రమే బలమైన రాజకీయ పక్షంగా ఉన్నంత కాలం, ఆ పార్టీని మరే పార్టీ సవాల్‌ చేసే పరిస్థితుల్లో లేనంత కాలం 1967 వరకు దేశంలో జమిలి ఎన్నికలు జరిగాయి. అయితే ఆ తర్వాత కాంగ్రెస్‌ ప్రాబల్యం క్రమంగా తగ్గుతూ ఉండటం, జాతీయ స్థాయిలోనే కాకుండా వివిధ రాష్ట్రాల్లో స్థానిక ప్రజల అభీష్టాల మేరకు పలు ప్రాంతీయ పార్టీలు బలీయమైన రాజకీయ శక్తిగా ఎదుగుతూ వస్తున్న కొద్దీ జమిలి ఎన్నికలు అసాధ్యం అవుతున్నాయి.

‘భిన్నత్వంలో ఐక్యత’ను మన బలంగా చెప్పుకొని గర్వపడుతూ ఉంటాము. భారత్‌లో ఉన్నన్ని భాషలు, ఆచార వ్యవహారాలు, మతపరమైన విశ్వాసాలు, ఆహారపు అలవాట్లు, వస్త్రధారణలో వైరుధ్యం... వంటివి ప్రపంచంలో మరెక్కడా లేవు. ఇటువంటి వైవిధ్యం కారణంగానే సుమారు రెండు వేల సంవత్సరాల పాటు విదేశీయుల పాలనలో మగ్గిన మన మూల సంస్కృతిని కాపాడుకుంటూ వచ్చాము.

ఇటువంటి వైవిధ్యానికి మట్టుపెట్టే విధంగా మీరు ‘ఒకే దేశం ఒకే పన్ను’, ‘ఒకే దేశం ఒకే రేషన్‌’ వంటి నినాదాలతో పాటు ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ అంటూ నిరంకుశ వ్యవస్థలలో మాదిరిగా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. జమిలి ఎన్నికల విషయం అట్లా ఉంచితే, అంతకన్నా అత్యవసరమైన, మన ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేస్తున్న పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని బలోపేతం చేయడం గురించి మీరు అసలు పట్టించుకోవడం లేదు.

ఫిరాయింపు చట్టాన్ని సవరించండి!

మన రాజకీయ వ్యవస్థలో సంస్కరణల పట్ల మీకు ఏమాత్రం ఆసక్తి, చిత్తశుద్ధి ఉంటే ముందుగా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని బలోపేతం చేయండి. ఇప్పటికే ఈ చట్టాన్ని రెండుసార్లు సవరించారు. మరోసారి సవరణ తీసుకురావడం ద్వారా ఫిరాయింపులు మన ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం కావించకుండా కాపాడమని సవినయంగా కోరుతున్నాను. పార్టీ ఫిరాయింపులపై లోక్‌సభ, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు, రాజ్యసభ, శాసన మండలిల చైర్మన్‌లకు తగు నిర్ణయం తీసుకొనేందుకు కాలవ్యవధి నిర్ణయించకపోవడంతో ఈ చట్టం నిరుపయోగంగా మారుతోంది. దానితో ఈ విషయమై కోర్టులను ఆశ్రయించడం కూడా సాధ్యం కావడం లేదు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్‌ థాక్రేను తొలగించే ప్రయత్నాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు అప్పటికే ఆయన పదవికి రాజీనామా చేయడంతో తిరిగి ఆయనను ముఖ్యమంత్రిగా చేయలేక పోతున్నామని నిస్సహాయత వ్యక్తం చేయడం గమనార్హం.

పార్టీలు ఫిరాయించిన వారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంత్రి పదవులను కూడా చేపడుతున్న ఉదంతాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నాము. ఎమ్మెల్యేల పదవీకాలం ముగిసే వరకు స్పీకర్లు తమ నిర్ణయం ప్రకటించకుండా మన ప్రజాస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేస్తున్నారు. అందుకనే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉల్లంఘనలకు సంబంధించిన నోటీసులపై సభాపతులు రెండు లేదా మూడు వారాలలో తప్పనిసరిగా నిర్ణయం ప్రకటించే విధంగా చట్ట సవరణను తీసుకురావాలని కోరుతున్నాను. సభాపతులు నిర్ణీత వ్యవధిలో నిర్ణయం ప్రకటించని పక్షంలో అప్పుడు కోర్టులను ఆశ్రయించే వీలు ఏర్పడుతుంది.

తరచూ ఎన్నికలు ఆర్థిక భారమా?

తరచూ ఎన్నికలు జరుపుతుండడంతో ఆర్థిక భారం అవుతుందని, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేక పోతున్నామని మీరు చెబుతున్నారు. అయితే, వాస్తవానికి మీ వాదనలు పసలేనివని నేను భావిస్తున్నాను. భారత్‌ నేడు ప్రపంచంలోనే ఐదవ పెద్ద ఆర్థిక వ్యవస్థ. త్వరలో మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందబోతున్నాము. ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్‌ సుమారు రూ 45 లక్షల కోట్ల వరకు ఉంది. ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థకు ఎన్నికల నిర్వహణను భారంగా పేర్కొనడం ప్రజాస్వామ్యం పట్ల మీ నిజాయితీని అనుమానించాల్సి వస్తుంది. పైగా, ఎన్నికల నిర్వహణ సమయంలో పలు విధాలుగా నగదు పంపిణీలోకి వచ్చి అనేక మందికి ఉపాధి కలుగుతుందని మరచిపోకండి. గోప్యంగా దాచిన నల్ల డబ్బు కూడా పంపిణీలోకి వస్తుంది.

ఇక, ఎన్నికల సమయంలో అమలులో ఉండే ‘ఎన్నికల కోడ్‌’ ఏ విధంగా కూడా సాధారణ పరిపాలనకు, ప్రభుత్వ కార్యక్రమాలకు ఆటంకం కాబోదు. కేవలం అధికారంలో ఉన్న పార్టీ ఓటర్లను ప్రలోభ పరిచే కార్యక్రమాలు చేపట్టేందుకు ఇబ్బంది ఏర్పడుతుంది. అందువల్లనే ఎన్నికలు తరచూ జరుపుతూ ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడుతున్నాయనే మీ వాదన ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని గమనించాలి. గత తొమ్మిదేళ్లుగా మీ ప్రభుత్వ పనితీరు చూపి ప్రజలను ఓట్లు అడిగే ధైర్యం కోల్పోవడంతో మీరు ఇటువంటి డ్రామాలకు పాల్పడుతున్నారనే అభిప్రాయం కలుగుతుంది. మీరు మన రాజకీయ వ్యవస్థను పటిష్ట పరచాలి అనుకుంటే ముందుగా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని సవరించాలని కోరుతున్నాను.

- గోనె ప్రకాశరావు

[email protected]



Next Story