వరుస పంట నష్టాలు.. రైతుకు ఏది భరోసా?

by Disha edit |
వరుస పంట నష్టాలు.. రైతుకు ఏది భరోసా?
X

రిగిన పంట నష్టానికి పరిహారం పొందడం రైతు హక్కు. ఆత్మగౌరవం చంపుకుని పరిహారం కోసం ప్రాధేయపడే దుస్థితి రైతుకు కల్పించవద్దు. పంట నష్టం జరిగిన ప్రతిసారీ నష్టపరిహారానికీ ఎవ్వరి దయాదాక్షిణ్యాల పైన ఆధారపడకుండా, ఒక పద్ధతి ప్రకారం జరిగిన నష్టానికి తప్పనిసరిగా సరిపోను పరిహారం చెల్లించే విధి విధానాలు రూపొందించి రైతుకు పూర్తి భరోసా కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి.. తెలంగాణలో రైతులకు ఉచితంగా, న్యా యమైన విద్యుత్తు 24 X 7, రైతుబంధు అందిస్తూ, పండించిన పంటను ప్రకటించిన ఎంఎస్‌పీ ప్రకారం కొంటూ, రైతును వ్యవసాయం చేయుమని ప్రోత్సహిస్తూ, రైతుకు అన్ని విధాలా అండగా ఉంటున్నట్లు ప్రభుత్వం చెప్పుకుంటోంది. కానీ పంట నష్టం జరిగినప్పుడు జరిగిన నష్టానికి సరిపోను నష్టపరిహారం చెల్లించే పద్ధతి అమలు చేయకపోవడంతో ఇన్ని సంవత్సరాలుగా అకాలవర్షాలు, వడగండ్ల వానలు, ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతిన్న రైతులు కోలుకోలేని విధంగా నష్టపోతున్నారు.

అభద్రతా భావనలో రైతులు

పెట్టుబడులు పెట్టి భార్యాబిడ్డలతో కష్టించి పంటచేతికి వచ్చే సమయంలో కానీ, పండిన పంట అమ్ముకొనేముందు అకాల వడగండ్ల వర్షాలతో పంటనష్టం జరిగినప్పుడు రైతులు కోలుకోలేని విధంగా నష్టపోతుంటారు. రైతు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించినప్పుడే రైతు ఆర్థికంగా నిలదొక్కుకొని సమాజంలో గౌరవంగా బతికే అవకాశం ఉంటుంది. రబీ సాగులో, అకాలవర్షాలతో, వడగండ్ల వానలతో పంటలకు భారీ నష్టం జరగడం సర్వసాధారణం. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలులో లేనందున జరిగిన నష్టానికి పరిహారం మొత్తం కానీ, పాక్షికంగా కానీ ప్రభుత్వం చెల్లిస్తుందో లేదో అనీ, చెల్లించినట్లయితే ఎప్పటిలోగా నష్టపరిహారం ఎంత మొత్తం వస్తుందో తెలియని అభద్రతా భావనతో రాష్ట్ర రైతులు ఎదురుచూపులు చూడాల్సి రావడం బాధాకరం.

కరీంనగర్ జిల్లాలో 30 నిమిషాల వ్యవధిలో వరి పంట మొత్తం గింజ వాలి సర్వ నాశనమైందని విలపించిన రైతుల బాధ చూసి రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ఆవేదన వెలిబుచ్చిన తీరు, ఆయన బలవంతంగా ఆపుకొంటున్న కన్నీరు, బాధపడొద్దని, నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు తాను, గౌరవ ముఖ్యమంత్రి ఉన్నాము అని రైతులను ఓదార్చిన తీరు, రైతుల ఏడుపులు చూసి ప్రతి ఒక్కరు ఇలాంటి దుస్థితి రైతులకు మాత్రమే ఎందుకు కలుగుతుంది, ఇలాంటి పరిస్థితుల్లో జరిగిన నష్టం నుంచి రైతును పూర్తిస్థాయిలో ఆదుకొనే చర్యలు ఎందుకు చేపట్టడం లేదు? అని ప్రశ్నించుకొంటున్నారు.

రైతును ఆదుకోని నష్టపరిహారమా?

మంత్రిగారు నోటిమాటగా భరోసా ఇచ్చినప్పటికీ, ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకొంటారో తెలియక, సహాయం అందించాలి అనుకుంటే, నిర్ణయం ఎప్పటిలోగా ప్రకటిస్తారో తెలియక, ఎంతమొత్తం సహాయం ప్రకటిస్తారో తెలీక, ఈ విపత్తు నుంచి బయటపడగలమా లేదా అని అభద్రతా భావంతో జీవించే దుస్థితి నుంచి రైతును గట్టెక్కించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. పంట మొత్తం దెబ్బతిన్న నేపథ్యంలో వరి, మొక్కజొన్న పంటల పైన రైతులకు ఎకరా ఒక్కంటికి రూ. 30 వేల నుంచి రూ. 40 వేల నష్టం... మిర్చి లాంటి పంటలపై ఎకరా ఒక్కింటికి రూ.1.50 లక్షనుంచి రూ. 2.50 లక్షల నష్టం వస్తుంది. ప్రభుత్వం ఎన్నడూ లేనివిధంగా, నష్టపరిహారం కింద ఎకరా ఒక్కంటికి రూ. 10 వేలు నష్టపరిహారం ప్రకటించినప్పటికీ రైతును పూర్తిస్థాయిలో ఆదుకోలేవు.

ఏ కారణం చేతైనా పంట నష్టం జరిగినప్పుడు ప్రభుత్వం, అధికార పార్టీ నాయకుల దయాదాక్షిణ్యాలపైన ఆధారపడకుండా రైతును ఆదుకోవడానికి మన ముందు ఉన్న ఏకైక మార్గం రైతుకు స్నేహపూర్వకంగా ఉండే విధంగా పంటల భీమా పథకం అమలు చేయడం మాత్రమే. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రైతుకు ఉపయోగకరంగా లేదని భావించినప్పుడు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం రైతును పంటలనష్టం నుంచి పూర్తిగా ఆదుకునే విధంగా పంటల బీమా పథకం అమలు చేసే అవకాశం ఉన్నది.

రాష్ట్రప్రభుత్వం వెంటనే జరిగిన, జరుగుతున్న పంట నష్టానికి తగురీతిలో పరిహారం ప్రకటించి, వచ్చే వర్షాకాలం నుంచి విధిగా పంటల బీమా పథకం అమలు చేసి పంట నష్టం జరిగినప్పుడు దానికి సమానంగా నష్టపరిహారం రైతుకు అందించి, పరిహారం కోసం ఎవ్వరి దయాదాక్షిణ్యాలపైన ఆధారపడవలసిన దుస్థితి రైతులకు రాకుండా, పంటల భీమా పథకం అమలు చేసి రైతుల ఆత్మగౌరవం నిలబెట్ట వలసినదిగా తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నది.

పాకాల శ్రీహరిరావు

అధ్యక్షులు, తెలంగాణ రైతు రక్షణ సమితి

93475 80252

Next Story

Most Viewed