ఉన్నది ఉన్నట్టు:సామాన్యులకేదీ దారి?

by Viswanth |
ఉన్నది ఉన్నట్టు:సామాన్యులకేదీ దారి?
X

ప్రొటోకాల్ ఉల్లంఘన సీరియస్ వ్యవహారమనేది అధికారులకు తెలియందేమీ కాదు. అయినా పాలకుల ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోక తప్పడం లేదు. అలాంటి సీరియస్ అంశంలో గవర్నర్‌కే అవమానాలు, చేదు అనుభవాలు ఎదురై దిగమింగుకున్నారు. ఇక సామాన్యుల పరిస్థితిని అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు. స్వరాష్ట్రంలో అన్ని హక్కులతో పాటు స్వేచ్ఛ, ఆత్మగౌరవం లభిస్తుందని ప్రజలు భావించారు. కానీ, అడుగడుగునా ఆంక్షలేనని తెలుసుకున్నారు. ఆఖరుకు సమస్యను పాలకుల దృష్టికి తీసుకెళ్ళే మార్గమూ లేదని ఎనిమిదేళ్ల పాలనలో స్వీయానుభవం ద్వారా అవగతమైంది. సామాన్యుల వేదన అరణ్య రోదనే. గవర్నర్‌కే తిప్పలు తప్పనప్పుడు సామాన్య జనానికి ఏం ఒరుగుతుందో విడమర్చి చెప్పాల్సిన పని లేదు. అన్ని దారులూ మూసుకుపోయిన తర్వాత ప్రజలకు మిగిలిదే ఓటు ఆయుధమే.

మొన్నామధ్య ఢిల్లీ వెళ్ళిన గవర్నర్ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. తనకు తెలంగాణ సర్కారు నుంచి తగిన గౌరవ మర్యాదలు దక్కడం లేదని బాధ పడ్డారు. రాజ్యాంగపరంగా ప్రోటోకాల్‌కూ నోచుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. అవమానాలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. చివరకు ప్రధానికి, కేంద్ర హోం మంత్రికి మొరపెట్టుకున్నారు. ఆమె తన ఆవేదనను చెప్పుకోడానికి ఒక మోడీ, ఒక అమిత్ షా ఉన్నారు. కానీ, సామాన్య ప్రజానీకానికి ఎవరున్నారు? రాష్ట్ర ప్రథమ పౌరురాలికే ఇన్ని కష్టాలు వస్తే ఇక రాష్ట్రంలోని ప్రజల సంగతేంటి? వారు ఎవరికి చెప్పుకోవాలి? ఆర్చేవారు, తీర్చేవారు ఎవరు? చివరకు ఇది రామాయణంలో ఉడుత ఉదంతాన్ని గుర్తుకు తెస్తున్నది.

గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఢిల్లీలో చేసిన కామెంట్లు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితికి నిదర్శనం. అసెంబ్లీ సమావేశాలలో, వివిధ అధికారిక కార్యక్రమాలలో 'మై గవర్నమెంట్' అని ప్రస్తావిస్తూ ఉంటారు. అలాంటి 'మై గవర్నమెంట్'లోనే లొసుగులు ఉంటే చక్కదిద్దేది ఎవరు? కొన్ని విచక్షణాధికారాలు ఉన్నాయని స్వయంగా ఆమె చెప్పుకున్నారు. తాను తల్చుకుంటే ప్రభుత్వం కూలిపోయేదని కూడా వ్యాఖ్యానించారు. అలాంటి అధికారాలు ఉన్నా ప్రొటోకాల్ సమస్యను ఆమె రాష్ట్ర స్థాయిలోనే పరిష్కరించుకోలేకపోయారు. ఉల్లంఘనలు జరిగినట్లు తెలిసినా సిస్టమ్‌ను స్ట్రీమ్‌లైన్ చేయలేకపోయారు.

వారికి అవకాశం ఉంది కానీ

గాడిలో పెట్టాల్సిన వ్యక్తే నిస్సహాయురాలిగా మిగిలిపోయారు. లోపం జరుగుతున్నట్లు తెలిసినా సరిదిద్దలేకపోయారు. పెద్దలకు మొరపెట్టుకోవడమే ఆమెకు ఏకైక మార్గమైంది. ఆమెకు ఆ వెసులుబాటు ఉన్నది. ఎంపీలు, ఎమ్మెల్యేల గౌరవానికి, హక్కులకు భంగం కలిగితే పరిష్కరించడానికి పార్లమెంటులో అసెంబ్లీలో ప్రివిలేజ్ కమిటీ లాంటి వ్యవస్థలున్నాయి. ఆ మధ్య బండి సంజయ్‌ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు, అరెస్టు సందర్భంగా తీసుకున్న చర్యల అంశం పార్లమెంటు దాకా వెళ్లింది. వీఐపీలుగా వీరి వీరి స్థాయిలోని సమస్యలకు అలాంటి వ్యవస్థలు ఉన్నాయి. కానీ, మామూలు ప్రజానీకానికి దారులేవి? వీఐపీల ప్రోటోకాల్ సమస్య ఇలా ఉంటే సామాన్యులకు నిత్యం కష్టాలే. వాటికి పరిష్కారమూ దొరకదు.

కండ్ల ముందు కనిపిస్తున్న వడ్ల కొనుగోళ్లే ఇందుకు నిదర్శనం. స్థానిక సర్పంచ్ మొదలు ముఖ్యమంత్రి వరకు గ్రీవెన్స్ చెప్పుకోడానికి మార్గమే లేదు. ప్రజా ప్రతినిధులు అందుబాటులో ఉండరు. అధికారులు పట్టించుకోరు. సిఫారసులు, వీఐపీలకు ఇచ్చే ప్రాధాన్యతను ఆ అధికారులు ప్రజలకు ఇవ్వరు. మంత్రులూ దొరకరు. దొరికినా అర్జీలతోనే సరి. ప్రతిపక్షాలకు పట్టింపు ఉండదు. రాజకీయం కోసం సమస్యను నెత్తికెత్తుకుంటాయి. పరిష్కారం దొరకదు. ఎక్కడికి పోయినా ప్రజలకు మొండిచేయే.

సచివాలయం, ప్రగతిభవన్‌లో నో ఎంట్రీ

గతంలో ప్రజావాణి, ప్రజాదర్బార్ లాంటి వ్యవస్థలు ఉండేవి. ఇప్పుడు ప్రజలకు ఆ వేదికలేవీ లేవు. సర్కారుకు చెప్పుకుని పరిష్కరించుకోవాలని కోరుకుంటారు. చెప్పుకోడానికే మార్గమే లేదు. ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో క్యాంపు కార్యాలయాలను ఏర్పాటు చేసింది. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఆఫీసు సెటప్ చేసింది. ఒక క్లర్కు, కంప్యూటర్ లాంటి వ్యవస్థ ఏర్పాటైంది. ఆ మెకానిజం అలంకారప్రాయమే అయింది. సగం మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు దూరంగా హైదరాబాద్‌‌లోనో, జిల్లా కేంద్రాలలోనో ఉంటున్నారు. ప్రజల సమస్యలకు స్థానికంగా పరిష్కారం దొరకనప్పుడు పై స్థాయికి వెళ్ళాలనుకుంటారు. కలెక్టర్ ఆఫీసు, సచివాలయం అలాంటివే. కానీ అక్కడా ప్రజలకు ఎంట్రీ లేదు.

కారణాలు ఎన్నయినా ఉండొచ్చు. ఉన్నతాధికారులను కలవడం ప్రజలకు ఒక సాహసంగా మారింది. ప్రగతి భవన్ సంగతి చెప్పాల్సిన పనే లేదు. సప్త సముద్రాలను దాటొచ్చేమోగానీ ప్రగతి భవన్ గేటును టచ్ చేయలేం. మంత్రులకు, ఎమ్మెల్యేలకే ఎంట్రీ ఉండదు. సామాన్యులకు ఉంటుందని ఊహించలేం. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకోడానికి సీఎం సర్వేలపై ఆధారపడుతూ ఉంటారు. ఈ మధ్యన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌పై ఆధారపడుతున్నారు. నిత్యం ప్రజలతో సంబంధాల్లో ఉంటే ఇంటెలిజెన్స్, పీకే, ప్రైవేటు సర్వే సంస్థల అవసరం ఎందుకుంటుంది?

నిస్సహాయురాలితో పరిష్కారం సాధ్యమేనా?

ప్రభుత్వం పట్టించుకోనప్పుడు కనీసం గవర్నర్‌కైనా మొరపెట్టుకుందామని ఒకరో ఇద్దరో కోరుకుంటారు. ఈ మధ్య గ్రీవెన్స్ బాక్స్ సిస్టమ్ కొత్తగా వచ్చింది. అవగాహన ఉన్నవారు అక్కడికి వెళ్తున్నారు. గేటు దగ్గర ఉండే డబ్బాలో వారి సమస్యలను అర్జీల రూపంలో విన్నవించుకుంటున్నారు. కొన్ని పరిష్కారమవుతున్నాయి. ఇంకొన్ని ఏ స్టేజీలో ఉన్నాయో తెలియదు. అయితే ఇక్కడే ఓ డౌటు వచ్చిపడింది. గవర్నరే స్వయంగా ప్రోటోకాల్ సమస్యను ఎదుర్కొంటున్నారు. దాన్ని పరిష్కరించుకోలేక ఢిల్లీ బాట పట్టారు. అధికారం, హోదా ఉండి కూడా ఏమీ చేయలేకపోయారు. ప్రధానినో, కేంద్ర హోం మంత్రినో ఆశ్రయించాల్సి వచ్చింది. ఇక తమ సమస్యలు ఏం పరిష్కారమవుతాయన్నదే వారి అనుమానం.

స్వంత సమస్య పరిష్కారానికే దిక్కు లేనప్పుడు ఇక తమ బాధలకు మోక్షం దొరుకుతుందా? అనేది ప్రజల సందేహం. ఆమెకే దారి తెలియక నిస్సహాయురాలిగా మిగిలిపోయారు. ఇప్పుడు ఆమె ఆర్డర్ వేస్తే ప్రభుత్వం పట్టించుకుంటుందా? ప్రగతిభవన్, రాజ్‌‌భవన్ మధ్య యుద్ధమే జరుగుతున్నది. సీఎం, గవర్నర్‌ ఒకరి నీడను మరొకరు తట్టుకోలేకపోతున్నారు. దాదాపు ఏడాది కాలంగా తూర్పు-పడమర గా ఉంటున్నారు. రాష్ట్రపతికి స్వాగతం పలికే లాంటి ఒకటి రెండు సందర్భాల్లో తారసపడినా ఆ ఇద్దరి మధ్య మాటలూ ఉండవు. ఇద్దరు వ్యక్తుల మధ్య భిన్నాభిప్రాయాలు రెండు వ్యవస్థల మధ్య కొట్లాటగా మారింది. దీనికే పరిష్కారం దొరకనప్పుడు ఇక ప్రజల కష్టాలకు దారి ఎక్కడిది?

నిరసనలకూ అవకాశం లేదు

కడుపు కాలిన జనం రోడ్డెక్కుదామనుకుంటే తెలంగాణలో దానికీ అవకాశం లేదు. ప్రభుత్వం ఈ మధ్య తెచ్చిన జీఓ 317 పై ఉద్యోగులు, ఉపాధ్యాయులు భగ్గుమన్నారు. ప్రగతి భవన్, అసెంబ్లీ దగ్గర ధర్నాలు చేయాలనుకున్నారు. ఒకటి రెండు సార్లు సాహసం కూడా చేశారు. చివరకు పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వ పెద్దలతో చర్చించి పరిష్కరించుకునే మార్గమూ లేదు. సీఎస్ అపాయింట్‌మెంట్ కోసం సీనియర్ ఐఏఎస్‌లే రోజుల తరబడి వెయిట్ చేయాల్సి వస్తున్నది. ఇక ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులకు సాధ్యమే కాదు. అందుకే చివరకు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.

ధర్నాలకు అవకాశమే లేని పాలన అందిస్తానని కేసీఆర్ గొప్పగా ప్రకటించారు. ధర్నా చౌక్ అవసరమే లేదంటూ ఎత్తివేశారు. కానీ స్వరాష్ట్రంలోనూ ధర్నాలు తప్పలేదు. కోర్టుకు వెళ్లి మరీ ధర్నా చౌక్‌ను సాధించుకున్నారు. ఇప్పుడు అసెంబ్లీ, ప్రగతి భవన్‌ ధర్నాలకు వేదికలవుతున్నాయి. ప్రగతిభవన్‌లో అర్జీలకు అవకాశం లేకపోవడంతో విద్యార్థులు, నిరుద్యోగులు, యువత దాన్ని ధర్నా చౌక్‌గా మార్చుకున్నాయి. ఇక ప్రతిపక్షాలు ఆందోళనలకు పిలుపునిస్తే పోలీసులు పర్మిషన్ ఇవ్వరు. హౌజ్ అరెస్టులు నిత్యకృత్యం. ప్రజాస్వామిక హక్కులపై, ప్రశ్నించే గొంతుపై నిర్బంధం అమలవుతున్నదంటూ మేధావులూ మొత్తుకుంటున్నారు.

వారికి తెలియక కాదు

ప్రొటోకాల్ ఉల్లంఘన సీరియస్ వ్యవహారమనేది అధికారులకు తెలియందేమీ కాదు. అయినా పాలకుల ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోక తప్పడం లేదు. అలాంటి సీరియస్ అంశంలో గవర్నర్‌కే అవమానాలు, చేదు అనుభవాలు ఎదురై దిగమింగుకున్నారు. ఇక సామాన్యుల పరిస్థితిని అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు. స్వరాష్ట్రంలో అన్ని హక్కులతో పాటు స్వేచ్ఛ, ఆత్మగౌరవం లభిస్తుందని ప్రజలు భావించారు. కానీ, అడుగడుగునా ఆంక్షలేనని తెలుసుకున్నారు. ఆఖరుకు సమస్యను పాలకుల దృష్టికి తీసుకెళ్ళే మార్గమూ లేదని ఎనిమిదేళ్ల పాలనలో స్వీయానుభవం ద్వారా అవగతమైంది. సామాన్యుల వేదన అరణ్య రోదనే. గవర్నర్‌కే తిప్పలు తప్పనప్పుడు సామాన్య జనానికి ఏం ఒరుగుతుందో విడమర్చి చెప్పాల్సిన పని లేదు. అన్ని దారులూ మూసుకుపోయిన తర్వాత ప్రజలకు మిగిలిదే ఓటు ఆయుధమే.

ఎన్. విశ్వనాథ్

99714 82403



Next Story

Most Viewed