పాలమూరు పచ్చగా అయ్యేదెప్పుడు!?

by Disha edit |
పాలమూరు పచ్చగా అయ్యేదెప్పుడు!?
X

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కేవలం భౌగోళిక గుర్తింపు కోసం కాదు. ఈ ప్రాంతానికే పరిమితమైన సొంత అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం, స్వేచ్ఛ ప్రజాస్వామ్య పాలన కోసం 60 ఏండ్లు సాగిన అంశం ఇది. కానీ నేడు వాటన్నింటికి కొంత భిన్నంగా స్వరాష్ట్రంలో పదేండ్ల పాలన సాగిందనడంలో అతిశయోక్తి లేదు. 60 ఏండ్ల ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాల్లో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించిన తెలంగాణకు 10 ఏండ్ల స్వరాష్ట్ర పాలనలోను అమలుకు నోచుకోని అంశాలెన్నో ఉన్నాయి.

ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం వరకు తెలంగాణ ఉద్యమ నినాదాలన్నీ తెలంగాణ ప్రాంతం ఏ అంశాల్లో, ఎందుకు, ఎట్లా, ఏ విధంగా మోసపోతుందో వివరించినవి నీళ్లు, నిధులు, నియామకాలు గణాంకాలు. కానీ స్వరాష్ట్రంలో అవి సంపూర్ణత సాధించుకున్నట్లుగా అంకితభావంతో కొట్లాడిన తెలంగాణ సమాజం, విద్యావంతులు, ఉద్యమకారులు భావించడం లేదు. ఆనాటి ప్రభుత్వం ఈ ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులను ఆంధ్ర పాలకులు పట్టించుకోకపోగా, మార్పులు చేర్పులు చేసి వారి ప్రాంతానికి అనుకూలంగా మార్చుకున్నారు దానికే ప్రత్యక్ష ఉదాహరణ నందికొండగా ఉండాల్సిన నాగార్జునసాగర్.

సాగునీటి రంగంలో..

సాగునీటి రంగంలో తెలంగాణకు కృష్ణా నది పరివాహక ప్రాంతం 68 శాతం ఉంది. సీమాంధ్రకు ఉన్నది కేవలం 32 శాతం. కానీ 1956 అంతరాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం, రివర్ బోర్డు చట్టం ద్వారా 1969లో దేశంలోనే మొదటిసారిగా ఏర్పడిన బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 811 టీఎంసీలనే, 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం తాత్కాలిక కేటాయింపులుగా పేర్కొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అన్యాయన్నే మరోసారి కొనసాగిస్తోంది. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా 68 శాతం కృష్ణా బేసిన్ ఉన్న తెలంగాణకు 299 టీఎంసీలు. 32శాతం కృష్ణా బేసిన్ ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీల కేటాయించింది. ఉద్యమ కాలంలో తీవ్రంగా వ్యతిరేకించిన ఉద్యమ నేత అధికారంలో ఉన్న పదేండ్లు దీనిపై మాట్లాడలేదు. కృష్ణానది జలాల తెలంగాణ హక్కుల సాధనలో, పాలమూరు జిల్లా వెనుకబాటుతనాన్ని, ఆ బిడ్డల వలస గోసను తెలంగాణ ఉద్యమానికి ముఖ చిత్రంగా, తెలంగాణ వెనుకబాటుకు ప్రతీకలుగా చూపించారు. అలాంటి పాలమూరు స్వరాష్ట్ర పాలనలోనూ పచ్చబడలేదు. పాలమూరు జిల్లాకు కృష్ణా, తుంగభద్ర, బీమా వంటి మూడు జీవనదులున్నా పాలమూరు నేటికి వెనుకబడిన జిల్లాగానే ఉంది. కానీ ఏ జీవ నది ఆధారం లేని, గోదావరికి 300 కి.మీ దూరంలో ఉన్న సిద్దిపేటకు మాత్రం కాళేశ్వరం ద్వారా 50 టీఎంసీలతో మల్లన్న సాగర్, 15 టీఎంసీలతో కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్ వంటి భారీ ప్రాజెక్టు నిర్మించారు. కానీ తలాపున కృష్ణమ్మ ఉన్న అచ్చంపేట, కల్వకుర్తి, దేవరకొండ వంటి ప్రాంతాల్లో మాత్రం సరైన సాగునీటి సౌలత్ లేదు. దానికి తోడు నదీజలాలను ప్రక్కనున్న ఆంధ్రప్రదేశ్ పోతిరెడ్డిపాడు అంచనాలకు మించి నిర్మిస్తున్న, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్న, అలాగే ఎస్‌ఆర్‌ఎస్పీ, మహారాష్ట్ర అక్రమంగా బాబ్లి ప్రాజెక్టులు నిర్మించి అక్రమంగా నీటిని తరలించుకుపోతున్నా గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం విస్మయానికి గురిచేసింది.

ఇప్పటికైనా

అలాగే కాంట్రాక్టులు సైతం ఆంధ్ర పాలకులు తన్నుకుపోతున్నారని ఆనాడు విమర్శించి స్వరాష్ట్రంలో కాంట్రాక్టులన్నీ ఆంధ్ర పెట్టుబడిదారులకు ఇవ్వడం నిజం కాదా? ఇక నిధుల విషయంలో నాడు మిగులు లాభంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం నేడు అప్పుల కుప్పగా మారింది. నేటికీ కొన్ని పథకాలకు, జీతభత్యాలకు నిధులు లేని పరిస్థితి. అందుకే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ చేసిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాల్సి వచ్చింది. నియామకాల విషయంలోనూ అంతే.. స్వరాష్ట్రంలో మన ఉద్యోగాలు అని నమ్మబలికి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చింది తక్కువే! ఇచ్చిన కొన్ని నోటిఫికేషన్లు సైతం కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ఇక పేపర్ లీకుల వంటి అంశాలతో నిరుద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.

బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా అంశాలలో ఓట్ల కోసం తెలంగాణ ఉద్యమాన్ని భావావేశాన్ని రగిలించడం వరకే పరిమితమైంది. కానీ ఉద్యమ లక్ష్యాలు నెరవేర్చలేకపోయింది. తెలంగాణ రాష్ట్రం ఒక కంఠం నినదిస్తే రాలేదు. దాదాపు ఆరు దశాబ్దాలు ముక్తకంఠ ఏకీకరణతో సాధ్యమయింది. అలా కాదని చెప్పడం అంటే అది ముమ్మాటికీ చరిత్ర వక్రీకరణే అవుతుంది. నూతనంగా ఏర్పడిన కొత్త రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం నేరవేర్చలేని స్వరాష్ట్ర ఆకాంక్షలను నేరవేర్చాలని కోరుతున్నాం.

కే. రమేష్ యాదవ్

వీజేఎస్ ఓయూ ప్రెసిడెంట్

78932 85131



Next Story

Most Viewed