ప్రభుత్వ ఆదాయంలో పేదల వాటా ఎంత?

by Disha edit |
ప్రభుత్వ ఆదాయంలో  పేదల వాటా ఎంత?
X

ప్రభుత్వ ఆదాయం, చేస్తున్న అప్పుల్లో అధికభాగం ఉద్యోగులకు, మధ్యతరగతికే పోతోంది. కానీ వీరు మాత్రం పేదలకిచ్చే ఉచితాలు దండగ అంటుంటారు. పేదలకు ఉచితాలపై ఇంత రాద్ధాంతం చేయడం ఏం న్యాయం? ఉచిత విద్య ఉచిత వైద్యం, ఉండడానికి కాస్త నీడనివ్వడం కనీస ధర్మం కాగా, వీటిని ఉచితాలంటూ ఆరోపించడం తగదు.

కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన శ్వేత పత్రం ఒక వాస్తవాన్ని విప్పి చెప్పింది. రెండు శాతం ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు, సౌకర్యాల కోసం రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో 33 శాతం ఖర్చవుతుందని, అప్పులు చెల్లించడానికి 34 శాతం ఖర్చవుతుందని, మిగిలిన ఆదాయమే అభివృద్ధి సంక్షేమ పథకాలకు మిగులుతున్న సొమ్ము అని శ్వేతపత్రం వెల్లడించింది. దీని ప్రకారం.. నాలుగు కోట్ల ప్రజల వద్ద వసూలు చేసిన పన్ను ఆదాయంలో 33 శాతాన్ని కేవలం రెండు శాతంగా ఉన్న ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లిస్తున్నది! ఇది ఎవరి సంపద? సంపద సృష్టిలో వారి కంట్రిబ్యూషన్ ఎంతెంత? వ్యాపారాల్లో సంపద ధర పెంచి అమ్మితే లాభాలు వస్తాయి. అది సంపదను వ్యాపారులు తమ ఆదాయంగా మలుపు కోవడమే కద! అది సంపద సృష్టించడం కాదు కదా!

ట్యాక్స్ పేయర్స్‌గా వీరి బాధ!

సంపద సృష్టించకుండా సంపదను కైవసం చేసుకునే వారంతా పరాన్న భుక్కులు. ఆశ్రిత వర్గాలు. అలాంటి వారు కట్టిన పన్నులతో పేదల సంక్షేమ పథకాలు నడుస్తున్నాయనుకోవడం తప్పుడు ప్రచారం. ప్రభుత్వాలు తెచ్చిన రూ. 6.71 లక్షల కోట్ల అప్పులు ఎవరిపాలయ్యాయి? అందులో పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం వెచ్చించినదెంత? పేదలను అభివృద్ధి పరిస్తే ఇంత పేదరికం ఎందుకుంది? ఉన్న వూరు వదిలి వలసలు పోవడం ఎందుకు జరుగుతున్నది? అభివృద్ధి పేర, ప్రాజెక్టుల పేర సౌకర్యాల పేర చేస్తున్న వ్యయం ద్వారా పేదలు పొందుతున్న లబ్ధి ఎంత? గుంట భూమి లేనివారికి, ఇంట్లో కరెంటు లేనివారికి ఆయా రంగాల్లో చేసే వ్యయం వల్ల పేదలకు ఏం ప్రయోజనం కలుగుతోంది? వాటివల్ల లాభపడుతున్నదెవరు? రైళ్లు, విమానాలు, ఫ్లై ఓవర్లు వల్ల లాభపడుతున్నదెవరు?

తమ విషయంలో ప్రభుత్వాలు ఉదారంగా ఉండాలనీ, అన్ని సౌకర్యాలూ కల్పించాలనీ కోరుకునే మధ్య తరగతి ప్రజలు పేద వర్గాల పట్ల వారికి ప్రభుత్వం చేయూత పట్ల కొందరు అసహనం కోపం వ్యక్తం చేయడం అవసరమా? వీరినే మధ్యతరగతి మహా మేధావులని అంటున్నాను. వీరు చేసే విమర్శలకు ప్రాతిపదిక తాము టాక్స్ పేయర్సుగా కడుతున్న పన్ను పేదలకిచ్చే సొమ్ము అని! ఈ విషయం నిగ్గు తేల్చడం ఈ వ్యాసం పరిమితి. మధ్యతరగతి తమ ఆదాయం నుండి పన్ను చెల్లిస్తున్నామని అంటారు. ఈ మధ్య తరగతి ఆదాయం మూలంలోకి వెళ్లి చర్చిస్తే తప్ప వాస్తవం బోధపడదు.

సంపద సృష్టిస్తోందెవరు?

ఆదాయం, సంపద, సంపద సృష్టి, ఉత్పత్తి, అనేవి ప్రత్యేక అర్థాలు కలిగి వుంటాయి. సంపద సృష్టించకుండా, ఏ ఉత్పత్తి చేయకుండా వ్యవసాయం, పశు పోషణ, ఆహార సేకరణ, వేట వంటివాటితో అధిక ఆదాయం పొందేవారు చాలా మంది ఉంటారు. వీరిని పరాన్న భుక్కులు, డిపెండెంట్‌లు, అంటారు. సేవారంగంలో పనిచేసేవారిని కూడా డిపెండెంట్‌లనే అంటారు. ఈ దేశంలో సంపద సృష్టించకుండా, ఏ ఉత్పత్తి చేయకుండా అధిక ఆదాయం పొందడం, అధిక సంపద పోగు చేయడం, ఆధిపత్యంలో ఉండడం.. వీరే అసమానతలకు, దోపిడికి, ప్రజల పేదరికానికి దోపిడీకి మూలం.

మన దేశంలో మధ్య తరగతి ప్రజలు సమాజంలో సృష్టిస్తున్న సంపద ఎంత? సమాజం నుండి వీరు పొందుతున్న సంపద ఎంత? ఇదే మౌలికాంశం. ఈ మౌలికాంశం పరిశీలిద్దాం. రైతులు కూలీలు పంటలు పండిస్తారు, కార్మికులు సంపద సృష్టిస్తారు. అసలు సకల సంపదల సృష్టికర్తలు వ్యవసాయం చేసే రైతులు, కూలీలు, కార్మికులు. పారిశ్రామిక వేత్తలు సైతం కార్మికుల సహకారంతో సంపద సృష్టిస్తారు. మరి మధ్య తరగతి ప్రజలు సమాజంలో ఏ సంపద సృష్టిస్తున్నారు?

ఈ గణాంకాలు తీయాలి..

సమాజ సంపద సృష్టిలో మధ్యతరగతి కాంట్రిబ్యూషన్ ఏమిటి? స్థానం ఏమిటి? మధ్య తరగతి వారు సృష్టించే సంపదనే ప్రభుత్వం పేదలకు పంచి పెడుతున్నదా? పేదలకు ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు, ఉచితాలు మధ్య తరగతి చెల్లించే పన్నుల నుంచే పెడుతున్నారా? లేక చేస్తున్న అప్పులు నుంచి పెడుతున్నారా లేక పేదలు సృష్టిస్తున్న సంపద నుంచా లేక పేదలు చెల్లిస్తున్న సంపద నుంచా? పేదలు చెల్లిస్తున్న పన్నులు ఎక్కువా, వారికి ప్రభుత్వం అందిస్తున్నది ఎక్కువా? పేదలు చెల్లిస్తున్న పన్నుల్లో తిరిగి వారికోసం ఖర్చు చేస్తున్నదెంత? మధ్య తరగతి ప్రజలు సృష్టిస్తున్న సంపద నుంచి చెల్లిస్తున్న పన్ను ఎంత?అందులో తిరిగి పొందుతున్నదెంత ఈ గణాంకాలు తీయడం అవసరం.

ఈ గణాంకాలు తీయకుండా మధ్య తరగతి చెల్లిస్తున్న పన్నులతో పేదలకు ఉచితాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఎలా అంటారు? తెలంగాణ ప్రభుత్వం గత పదేళ్లలో రూ. 6 లక్షల 71 వేల కోట్లు అప్పు చేసింది. ఇందులో పేదలకెంత ఇచ్చారు? మధ్య తరగతికి ఎంత ఇచ్చారు? కేంద్రం లక్షల కోట్లు అప్పు చేసింది. దీన్లో పేదలకు పెట్టింది ఎంత?

కేంద్రం రాష్ట్రం కలిసి ప్రతి కుటుంబానికి గత పదేళ్లలో లక్షల అప్పు మాత్రం నెత్తిన రుద్దాయి. పేదల పిల్లలు ఈ అప్పు భారం మోయాల్సివస్తున్నది. ప్రయోజనాలు ఒకరికి అప్పులభారం మరొకరికి! ఉచిత విద్య ఉచిత వైద్యం, ఉండడానికి కాస్త నీడనివ్వడం కనీస ధర్మం.

- బి ఎస్ రాములు

బీసీ కమిషన్ తొలి చైర్మన్

83319 66987


Next Story

Most Viewed