మళ్ళి మొదలైన యురేనియం అలజడి?ఆందోళనలో అడవి వాసులు

by Disha edit |
మళ్ళి మొదలైన యురేనియం అలజడి?ఆందోళనలో అడవి వాసులు
X


నల్లమల అడవులలో అరుదైన చెంచు జాతి వారున్నారు. కొన్ని వందల గిరిజన కుటుంబాలున్నాయి. యురేనియం వివిధ ఖనిజాల మిశ్రమంగా ఉంటుందని, దానిని వేరు చేసే ప్రక్రియలో ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా గిరిజనుల ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. వారిని వేరే ప్రాంతాలకు తరలించినా, తవ్వకాలతో కృష్ణా నది కలుషితమవుతుందని, దీంతో శ్రీశైలం, నాగార్జునసాగర్‌ డ్యాంల నీరు కూడా చెడిపోతుందని అంటున్నారు. దాని ప్రభావం హైదరాబాద్ ప్రజలపైనా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. యురేనియం నిక్షేపాల అన్వేషణను తెలంగాణ అటవీ శాఖ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది.

తెలంగాణ అడవులలో మళ్లీ యురేనియం అలజడి మొదలైంది. యురేనియం నిక్షేపాల కోసం నల్లమల అడవిలోనూ కృష్ణా నది పరీవాహకంలోనూ సర్వేల పేరుతో ఉచిత బోరు బావులు తవ్వుతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా యురేనియం అన్వేషణ కొనసాగిస్తున్నారు. నల్లమల అభయారణ్యం ప్రకృతి రమణీయతకు, అపురూప జంతుజాలానికి నెలవు. ఇక్కడి ప్రాచీన గిరిజన తెగలకు విస్తారంగా ఉన్న కొండలే ఆవాసాలు. ఇప్పుడు వారి భవిత ప్రశ్నార్థకమవుతున్నది.

కడప బేసిన్‌లోని ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలలో విస్తరించిన ఈ ప్రాంతం త్వరలోనే పెద్ద యంత్రాల మోతలతో, తవ్వకాలతో తన రూపు కోల్పోబోతోంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో యురేనియం నిక్షేపాల అన్వేషణకు కేంద్ర అటవీ సలహా మండలి కేంద్ర అణుశక్తి సంస్థకు అనుమతి ఇచ్చింది. దీంతో అక్కడి చరిత్ర కనుమరుగు కానున్నది. శైవ క్షేత్రాలు, చెంచులు, కోయ జాతులకు చేటు కలుగనున్నది. దేశంలోనే రెండో అతి పెద్దది అయిన అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అస్తిత్వం ప్రమాదంలో పడనున్నది. యురేనియం తవ్వకాలతో పరోక్షంగా 83 కి.మీ పరిధిలోని గ్రామాలపై కూడా ప్రభావం ఉంటుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.

దేశ ప్రయోజనాల కోసమంటూ

అమ్రాబాద్ అడవులలో 20 వేల టన్నుల యురేనియం ఉన్నట్లు ప్రాథమిక అంచనాతో 2008లో అణుశక్తి విభాగం అన్వేషణ మొదలు పెట్టింది. 2014లో యురేనియం నిల్వలు ఉన్నట్లు ఆధారాలు లభ్యం కావడంతో అమ్రాబాద్-ఉడిమిల్ల-నారాయణపూర్ అడవులలో డ్రిల్లింగ్ అనుమతుల కోసం ప్రతిపాదన పంపింది. దీనిలో లోపాలున్నాయన్నాయని అంటూనే, దేశ ప్రయోజనాల కోసం తప్పదని కేంద్రం వాదిస్తున్నది. ఇప్పటికే దీని కోసం నాలుగు వేలకు పైగా బోరుబావులు తవ్వారు. ఈ తవ్వకాలకు మూడేండ్ల క్రితమే బీజం పడింది.

పర్యావరణ వేత్తలు, ఆదివాసీలు, ప్రజాసంఘాల ఆందోళనలతో గుట్టు చప్పుడు కాకుండా సర్వే నిర్వహించారు. అప్పుడు ఎన్నికలు ఉండటంతో తవ్వకాలు ఆపించారు. యురేనియం తవ్వకాలు జరిగితే అటవీ ప్రాంతం తన రూపురేఖలు కోల్పోయి పెద్ద పారిశ్రామికవాడగా మారిపోతుంది. ఇక్కడ ఉన్న ప్రకృతి వైవిధ్యం, వృక్షజాతి, పెద్దపులులు, చిరుతలతోపాటు, ప్రసిద్ధి గాంచిన శైవ క్షేత్రాల ఉనికికి ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

వారికే కాదు అందరికీ ముప్పే

నల్లమల అడవులలో అరుదైన చెంచు జాతి వారున్నారు. కొన్ని వందల గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. యురేనియం వివిధ ఖనిజాల మిశ్రమంగా ఉంటుందని, దానిని వేరు చేసే ప్రక్రియలో ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా గిరిజనుల ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. వారిని వేరే ప్రాంతాలకు తరలించినా, తవ్వకాలతో కృష్ణా నది కలుషితమవుతుందని, దీంతో శ్రీశైలం, నాగార్జునసాగర్‌ డ్యాంల నీరు కూడా చెడిపోతుందని అంటున్నారు. దాని ప్రభావం హైదరాబాద్ ప్రజలపైనా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. యురేనియం నిక్షేపాల అన్వేషణను తెలంగాణ అటవీ శాఖ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది.

రక్షిత అటవీ ప్రాంతాలలో వందల ఫీట్ల లోతు డ్రిల్లింగ్‌ చేయడం వల్ల అటవీ సంపద నాశనమయ్యే ప్రమాదముందని 2016లోనే కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించింది. దేశంలో 2030 నాటికి అణుశక్తి 40 వేల మెగావాట్లకు పెంచి దేశంలోని ప్రతి పల్లెకూ వెలుగులు పంచాలని కేంద్రం అనుకుంటున్నది. కానీ, యురేనియం ద్వారా వచ్చే విద్యుత్, అణు రియాక్టర్ వలన వివిధ దేశాలు ఇప్పటికే సంక్షోభంలో కూరుకుపోయాయి. అందుకే అణుశక్తి కాకుండా ప్రత్యామ్నాయంగా విద్యుత్ ఉత్పత్తి కోసం గాలి, సౌర విద్యుత్ దిశగా ప్రయాణించాల్సిన అవసరం ఉన్నది.

జటావత్ హనుము

ఓయూ రీసెర్చ్ స్కాలర్

851983 6308


Next Story