కొలువుల్లో కోత- అభ్యర్థులకు వాత

by Disha edit |
కొలువుల్లో కోత- అభ్యర్థులకు వాత
X

త సంవత్సరం చివర నుంచి చాలా మల్టీనేషనల్ కంపెనీలు తమ సిబ్బందిలో కొంతమందిని తొలగించి సంస్థ ఉద్యోగులకు, నూతనంగా ఉద్యోగాలు ఆశిస్తున్న వారికి తీవ్ర వ్యథను మిగులుస్తున్నాయి. ఈ తొలగింపులో ప్రముఖ ఐటీ సంస్థలతో పాటు, మార్కెటింగ్ కంపెనీలు ఉన్నాయి. మీడియా కథనాల ప్రకారం కన్స్యూమర్ మార్కెటింగ్ రారాజు కంపెనీ అమెజాన్ తన ఉద్యోగుల్లో 18000 మందిని తొలగించింది. అలాగే సోషల్ మీడియాలో పేరొందిన గూగుల్ మాతృసంస్థ మెటా తన ఉద్యోగుల్లో 11000 మందిని తొలగించింది. ఇంకా ట్విట్టర్ 4000, స్నాప్‌చాట్ 1000 మందిని ఇప్పటికే తొలగించాయి. ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 10,000 మందిని తొలగించింది. ఇంకా విప్రో లాంటి పెద్ద కంపెనీలు, అలాగే చిన్న చితక ఐటీ సంస్థలు తమ సిబ్బందిలో కొందరిని తొలగించాయి. మొత్తంగా జనవరి 2023 లో దాదాపు 50,000 మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు.

నిర్దయగా ఉద్యోగుల తొలగింపు

భారతీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సంస్థ మాత్రం తమ ఉద్యోగులను ఎవరినీ తొలగించడం లేదని ప్రకటించింది. ఇంకా నూతన సిబ్బందిని రిక్రూట్ చేసుకుంటామని తెలిపింది. అయితే విచారకర విషయమేమిటంటే ఈ ఉద్యోగాల తొలగింపు నిర్దయగా జరుగుతోంది. ఉద్యోగులను గౌరవంగా పంపడం లేదు. కొందరిని సాయంత్రం ఇంటికి వెళ్ళే సమయంలో చెప్పడం, కొందరిని సెక్యూరిటీ సిబ్బంది ద్వారా తొలగింపు సమాచారం తెలియజేస్తున్నారు. దీంతో ఎవరి ఉద్యోగం ఉంటుందో ఎవరిది ఊడుతుందో తెలియని దుస్థితి ఏర్పడింది. కొన్ని సంస్థల్లో అయితే రెండు మూడు నెలల క్రితం తీసుకున్న వారిని కూడా తొలగిస్తున్నట్టు తెలిసింది. ఉద్యోగాల తొలగింపు ఎంఎన్‌సీలలో మామూలే కానీ ఇలాంటి దయనీయ వాతావరణం ఎప్పుడూ లేదని ఉద్యోగులు వాపోతున్నారు. ఉద్యోగుల సమాచారం ప్రకారం ప్రతి సంవత్సరం ఎంఎన్‌సీలు కొందరు పాతవారిని తొలగించి కొత్తవారిని తీసుకోవడం మామూలే! ఒకవైపు ఉద్యోగాల తొలగింపు పరిస్థితి ఇలా ఉండగా, భారతీయ టెక్ కంపెనీలు 2023 సంవత్సరంలో 3 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు తెలిపాయి. ఇందుకోసం 19 బిలియన్ డాలర్లు వెచ్చించనున్నట్లు టెక్ సంస్థలు తెలిపాయి. కాగా ఉద్యోగుల తొలగింపులో భాగంగా కొన్ని సంస్థలు జీతాలు తగ్గిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు వారి ఉద్యోగులకు అండర్ రేటింగ్స్ ఇచ్చి వారిని మానసిక హింసకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సర్వే ప్రకారం

కాగా ఈ సంవత్సరం భారతీయ కంపెనీలు 68 శాతం ఫ్రెష్ అభ్యర్థులకు పెద్దపీట వేస్తున్నట్టు ఒక సర్వే సంస్థ తెలిపింది. టీం లీడ్ ఎక్సెంట్ అను సర్వే సంస్థ తమ అవుట్ లుక్-2023 రిపోర్టు ప్రకారం కంపెనీలు అప్పుడే పట్టభద్రులైన వారికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపింది. క్లౌడ్ కంప్యూటింగ్, మార్కెటింగ్, ఐటీ నిపుణులు, డేటా అనలిస్టులు, బయో మెడికల్ ఇంజనీర్లు ఇలా అన్ని వర్గాల ఉద్యోగాలకు కంపెనీలు ఫ్రెష్ అభ్యర్థులను కోరుకుంటున్నాయి. కొత్త అభ్యర్థుల ద్వారా తమ మానవ వనరులను నిత్య నూతనంగా ఉంచవచ్చునని టీం లీజ్ సంస్థ అభిప్రాయం. టీం లీజ్ ఎక్సెంట్ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5000 కంపెనీలతో ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు ఉన్నాయి. ఈ సంస్థ కంపెనీలు ఉద్యోగాలపై ఎప్పటికప్పుడు అంచనాలు వేస్తుంది. అలాగే కొన్ని యూనివర్సిటీలలో కూడా సంబంధాలు కలిగి ఉండి ఉద్యోగార్థులకు నైపుణ్య శిక్షలను కూడా ఈ సంస్థ అందచేస్తున్నట్టు తెలిసింది.

కాగా ప్రతి సంవత్సరం కొందరు ఉద్యోగులను తీసివేయడం, కొత్తవారితో ఆ స్థానాలు నింపడం మామూలే కానీ ఇలా అమానవీయ పద్ధతితో వాళ్ళను తొలగించడం పట్ల పలు విమర్శలు వస్తున్నాయి. దీంతో ఆయా కంపెనీలంటే ప్రజలకు నమ్మకం పోయే పరిస్థితి వస్తుంది. ఇది కంపెనీలకు దెబ్బే అవుతుంది.

శ్రీనర్సన్

83280 96188

Next Story

Most Viewed