పోలీసుల దిగ్బంధంలో యూనివర్సిటీలు

by Disha edit |
పోలీసుల దిగ్బంధంలో యూనివర్సిటీలు
X

రాష్ట్రంలో ఉద్యమాలు మొదలయ్యేదే యూనివర్సిటీలలో. రాష్ట్రంలో ఉన్నటువంటి 11 యూనివర్సిటీలు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించాయి. అటువంటి యూనివర్సిటీలు నేడు పోలీసుల దిగ్బంధంలో ఉన్నాయి. ఉద్యమ సమయంలో యూనివర్సిటీలలో ఏదైనా సంఘటన జరిగితే పోలీసులు యూనివర్సిటీలలో అడుగుపెట్టడానికి వీసీ అనుమతి తీసుకుని లోపలికి వచ్చేవారు. కానీ నేడు అదే యూనివర్సిటీ గేట్ల దగ్గర పోలీసులను దాటుకొని విద్యార్థులు వెళ్లాల్సి వస్తుంది. ఇటీవల టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ అంశంలో న్యాయం కోసం విద్యార్థుల పక్షాన నిలబడుతున్న విద్యార్థి సంఘాలను, నిరుద్యోగులను, ప్రజాసంఘాలను పోలీసు బలగాలు ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలో నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి సంఘాలపై కేసులు పెట్టారు. అలాగే ఎన్‌సీసీ గేట్ నుంచి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ వరకు ప్రతీ డిపార్ట్‌మెంట్ దగ్గర పదుల సంఖ్యలో పోలీసులు పహారా కాస్తున్నారు. అలాగే కాకతీయ యూనివర్సిటీలో జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టగా పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటినుండి కేయూ ఫస్ట్ గేట్ నుండి రెండవ గేటు వరకు వందల మంది పోలీసులు పహారా కాస్తున్నారు. యూనివర్సిటీలో పదిమంది గ్రూపుగా ఉన్నా, పోలీసులు అనుమానిస్తూ ప్రశ్నిస్తున్నారు. నిరుద్యోగుల కోసం ప్రజాస్వామ్యంగా ఏ ధర్నా చేపట్టకుండా ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. దీని కోసమా మనం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నదని మేధావులు, విద్యార్థి సంఘాలు, ప్రొఫెసర్లు ప్రశ్నిస్తున్నారు.

చదువుల కోసం వేదిక కావలసిన విశ్వవిద్యాలయాలు నేడు పోలీసుల దిగ్బంధంలో ఉంటున్నాయి. ఏ ప్రతిపక్ష నేత, విద్యార్థి సంఘం నేత యూనివర్సిటీ లోపలికి రావాలన్నా పోలీసులు కట్టడి చేస్తున్నారు. సభలు, సమావేశాలు జరగనివ్వట్లేదు. టీఎస్‌పీఎస్సీ అంశం మీద విద్యార్థి సంఘాలు సిట్ కాకుండా సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐ విచారణ చేయాలని కోరుకుంటున్నారు. అప్పుడే అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది. రాష్ట్రంలో మేధావులను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. టీఎస్‌పీఎస్సీ అంశంపై విద్యార్థులకు, నిరుద్యోగులకు న్యాయం జరగకపోతే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో లాగా మరో పోరాటానికి అన్ని యూనివర్సిటీల ఆధ్వర్యంలో మిలియన్ మార్చ్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.

పేర్వాల నరేష్

91331 36977



Next Story

Most Viewed