ఉద్యమాలను మరిచిన తెలంగాణ

by Disha edit |
ఉద్యమాలను మరిచిన తెలంగాణ
X

తెలంగాణ గడ్డ పోరాటాలకు అడ్డ అనేది జగమెరిగిన సత్యం. సమస్యల సాధనలోంచే తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకుంది. ఆత్మగౌరవ పోరాటం నుండే తెలంగాణ ఉద్యమం ఉద్భవించింది. తుపాకీ గుళ్లకు ఎదురొడ్డి నిలిచిన కొమరం భీం చరిత్ర మనది. నైజాం నవాబుల అరాచకాలను అణిచివేసిన, రాంజీ గోండు పోరాట వారసత్వం మనది. చివరకు ఆంధ్ర వలస పాలకులను పారద్రోలడానికి, తొలి, మలిదశ తెలంగాణ పోరాటాలను చేసి, తెలంగాణ సాధించిన నేలమనది. ఈ ఉద్యమం పోరాటాలలో వేలమంది నేలకొరిగారు. లక్షల మంది గొప్ప త్యాగదనులుగా చరిత్రలో నిలిచిపోయారు. ఎన్నో చారిత్రక ఆధారాలు, మరెన్నో చరిత్ర పుస్తకాలు ఇవి నిజమని చెప్పడానికి మన ముందున్న సాక్షాధారాలు.

నాడు ఉద్యమంలో ముందుండి..

తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించింది విద్యార్థులు దానికి కారణం మన ఉద్యోగాలు మనకే వస్తాయని కానీ రాష్ట్రం సిద్ధించాక ఆ ఆశయం నెరవేరిందా అంటే లేదు. ఉమ్మడి రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి ఎలా ఉండేదో ఇప్పుడూ అంతే! ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జరగదు. జరిగినా లీక్‌లు, రద్దు, కోర్టు కేసులు అంటూ నిరుద్యోగుల ఆకాంక్షలు దెబ్బతీస్తున్నారు. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న మాటలు నీటిమూటలయ్యాయి. యూనివర్సిటీలు నిరుద్యోగ కర్మాగారాలుగా మిగిలిపోయాయి. ఇది మన ప్రస్తుత తెలంగాణలో ప్రతి నిరుద్యోగి వ్యధ! భవిష్యత్తుపై భద్రత లేక, ఆత్మస్థైర్యాన్ని చంపుకొని, బతుకుతున్న బతుకులు ఎన్నో మరెన్నో! అయినా నిరుద్యోగులలో మునుపటి ఉద్యమాలు లేవు. ఒకప్పుడు ఉద్యోగ, ఉపాధి కేంద్రాలుగా విరాజిల్లిన యూనివర్సిటీలు నేడు నిరుద్యోగులతో నిండిపోయాయి. అప్పటి పోరాటాలు కానరావడం లేదు. అందుకే ఇప్పటికైనా రాష్ట్రంలోని నిరుద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు ఏకమై, ఉద్యోగ కల్పన కోసం ఉద్యమాలను చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.

అలాగే ఉద్యోగ, ఉపాధ్యాయులు సైతం తమ ఉద్యోగాన్ని పణంగా పెట్టి తెలంగాణ ఉద్యమం కోసం పోరాడారు. ఆ సమయంలో ఉపాధ్యాయుల సమస్యలు సర్వీసు రూల్స్‌కి ఇన్ని పేజీలెందుకు, మూడు పేజీలు సరిపోవా? అంటూ తెలంగాణ వస్తే అసలు సమస్యలే ఉండవు అంటూ స్వయంగా చెప్పిన ఇప్పటి సీఎం.. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల పట్ల చిన్నచూపు చూస్తున్నారు. ఉద్యోగులకు సమయానికి జీతాలు రాకున్నా, పీఆర్సీ, ఐఆర్, డీఏలు ప్రకటించకున్నా, ప్రమోషన్స్‌ను పట్టించుకోకున్నా, సీపీఎస్ రద్దుచేయకున్నా, ఒక్కడంటే ఒక్క లీడర్ కూడా మాట్లాడటం లేదు. ఉద్యోగులకి ఇంత అన్యాయం చేస్తున్నా, సమస్యలు పేరుకపోతున్నా నోరు మూసుకోని కూర్చుంటున్నారు తప్పా ప్రత్యేక్ష పోరాటానికి దిగకపోవడం బాధకరం. ఒకప్పుడు ప్రభుత్వాలను గడగడలాడించిన ఉద్యోగ సంఘాల నాయకులు ఇప్పుడు పదవుల కోసం పాలకుల చుట్టూ పాకులాడడం చాలా దురదృష్టకరం.

స్వరాష్ట్రంలో లేని స్వేచ్ఛ!

ఉద్యమంలో నిరుద్యోగులు, ఉద్యోగ ఉపాధ్యాయులే కాకుండా సామాన్య ప్రజానీకం కూడా తెలంగాణ వస్తే మన నిధులు మనమే ఖర్చుపెట్టుకుంటామని, మన నీళ్ళు మనకే వస్తాయని తద్వారా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నమ్మి ఉద్యమంలో పాల్గోన్నారు. కానీ తెలంగాణ వచ్చాక ఏమైంది? మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ నేడు అప్పుల కుప్పగా మారిపోయింది. అధికారం కోసం ఉచితాల పేరుతో అమలు కాని వాగ్దానాలను ఇచ్చి వారి అన్యులకు, దగ్గర బంధువులకు, కోట్లకు కోట్లను కట్టబెట్టి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నా ప్రశ్నించడం లేదు. ఉచిత పథకాల పేరుతో మానవ వనరులను అచేతన స్థాయికి చేర్చి ఆర్థిక విచ్చితికి సామాజిక విధ్వంసానికి దారి తీసే పాలక నిర్ణయాలు తీసుకుంటున్నా నోరు మెదపలేక పోతున్నాం. నిజానికి మన తెలంగాణ మనకు భావ ప్రకటనను ఇస్తుందనుకున్నాం. మన తెలంగాణ మనకు ప్రజాస్వామిక స్వేచ్ఛను కల్పిస్తుందని అనుకున్నాం, కానీ ప్రస్తుత తెలంగాణలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా తప్పే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించినా తప్పే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచురించినా, ప్రచారం చేసినా తప్పే, ఇది తెలంగాణ ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తుంది.

మనం పోరాడి తెచ్చుకున్న మన తెలంగాణలో భావ ప్రకటన స్వేచ్ఛ లేదు. ప్రజాస్వామిక స్వేచ్ఛ లేదు. ఎన్నో నిర్బంధాలు, మరెన్నో ఆంక్షలు వీటిని మనం ప్రత్యక్షంగానూ పరోక్షంగాను చూస్తూనే ఉన్నాం, అనుభవిస్తూనే ఉన్నాం. నాడు రాష్ట్ర సాధనలో ప్రధాన భూమిక పోషించిన సామాజిక, ప్రజాస్వామిక ఉద్యమకారుల పట్ల అణిచివేత ధోరణి ప్రదర్శిస్తున్నారు. స్వేచ్ఛాపూరిత వాతావరణం కల్పించడం లేదు. ఈ రాష్ట్రాన్ని చూస్తే తెలంగాణ తెచ్చుకున్నది ఇందుకేనా? అనిపిస్తుంది. ఏది ఏమైనా నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం, తెలంగాణ అమరజీవి జయశంకర్ సార్ ఆశయాల కోసం, ప్రజాస్వామిక సామాజిక తెలంగాణ సాధన కోసం తెలంగాణ ఉద్యమకారులు విద్యావంతులైన మేధావులు మౌనం వీడి ఉద్యమాలకు జీవం పోసి మరో ప్రజాస్వామిక తెలంగాణ పోరాటానికి సిద్ధం కావలసిన అవసరం ఎంతైనా ఉంది.

నరిమెట్ల వంశీ,

జర్నలిజం విద్యార్థి, ఓయూ

82476 85407



Next Story

Most Viewed