విద్యారంగాన్ని విస్మరించిన రాష్ట్ర బడ్జెట్

by Disha edit |
విద్యారంగాన్ని విస్మరించిన  రాష్ట్ర బడ్జెట్
X

ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2,90,336 కోట్లు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కేటాయింపులు పెరిగాయి. పన్నుల భారం పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో విద్యారంగానికి 19,093 కోట్లు కేటాయిస్తూ ఆర్థిక మంత్రి విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తూ కేటాయింపులు చేశామని చెప్పారు. కానీ వాస్తవానికి అవి స్వల్పంగా పెరిగాయి. పాఠశాల విద్య మొదలుకొని ఉన్నత, సాంకేతిక విద్యకు కేటాయింపులు పెరిగినా అవి వాటి అవసరాలు తీర్చగలిగే స్థాయిలో లేవు. ఉపకార వేతనాలకు, బోధన, ఫీజులకు ఈ ఏడాది బడ్జెట్లో కేటాయించిన నిధులు పాత బకాయిలకే సరిపోవు. ఈ ఆర్థిక సంవత్సరానికి నిధులు కేటాయించలేదు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది 3వేల కోట్లు అదనంగా కేటాయించామని చెప్పుకుంటున్న ప్రభుత్వం మన ఊరు-మన బడి పథకానికి నిధులు కేటాయించలేదు. పాత అంకెల్లో మరోసారి చెప్పారు తప్ప కొత్త కేటాయింపులు లేవు.

ఇప్పటికి అనేక పాఠశాలల్లో సరైన మౌలిక సౌకర్యాలు లేవు. పుస్తకాల ముద్రణ, వస్తువుల కొనుగోలులో గుత్తేదారులు దోచుకుంటున్నా పట్టించుకునే స్థితిలో ప్రభుత్వం లేదు. అలాగే ఉన్నత విద్యారంగంలోనూ ఈ కేటాయింపులు సరిపోవు. ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలో బోధకుల సమస్య తీవ్రంగా ఉంది. కొన్ని కళాశాలలకు భవనాల సమస్య తీవ్రంగా ఉంది. మన ఊరు మన బడి అంటూ ఊరూర ప్రారంభోత్సవాలు జరుపుతున్న ప్రజాప్రతినిధులు రెండో దశకు మాత్రం నిధులు కేటాయించకపోవడం గమనార్హం. కొఠారి కమిషన్ సిఫార్సుల ప్రకారం రాష్ట్ర బడ్జెట్లో 30 శాతం అంటే 87వేల కోట్లు కేటాయించాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవేవీ పట్టించుకోకుండా కేవలం ఆరున్నర శాతం నిధులు కేటాయించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సంవత్సరంలో విద్యారంగానికి 10 వేల కోట్లు కేటాయించింది. ఆ లెక్కన కేటాయింపులు పెంచుకుంటూ పోతే ఈ ఆర్థిక సంవత్సరానికి 31 వేల కోట్లు కేటాయించాలి. కానీ కేటాయించింది కేవలం 19 వేల కోట్లు మాత్రమే. ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీ తలపిస్తుంది తప్పా విద్యారంగానికి ఎక్కువ నిధులు కేటాయించిందేమిలేదు. కనీసం కేటాయించిన నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి కృషి చేయాలి.

బి.భాస్కర్

PDSU రాష్ట్ర ఉపాధ్యక్షుడు

6305894960

Next Story

Most Viewed