రైతు కంట కన్నీరు.. సమాజానికే శాపం

by Disha Web Desk 13 |
రైతు కంట కన్నీరు.. సమాజానికే శాపం
X

నా భార్య బంగారం బ్యాంకులో కుదువ పెట్టి కౌలు పైసలు కట్టిన, రెండు లక్షల రూపాయల అప్పు చేసి పెట్టుబడి పెట్టి ఆరు ఎకరాలలో వరి పంట వేస్తే పది నిమిషాలు అయితే కోయవలసిన చేనులో 25-04-2023 రోజున కురిసిన రాళ్ల వానతో ఒక్క వడ్ల గింజ కూడా లేకుండా పోయిందని ఉమ్మడి వరంగల్ జిల్లా, కొమురవెల్లి మండలం, అయినాపూర్ గ్రామానికి చెందిన రాచకొండ శ్రీకాంత్ వయసు 30 సంవత్సరాలు ఏడుస్తూ చెప్పిన మాటలు.

నా భార్య, నా కోడలు బంగారం సిద్దిపేటలోని మార్వాడి సేటు దగ్గర కుదవబెట్టి నాలుగు ఎకరాల టమాట, మూడు ఎకరాల వరి సాగు చేస్తే మొన్నటి రాళ్లవానకు పూర్తిగా పోయిందని ఉమ్మడి మెదక్ జిల్లా, మిరుదొడ్డి మండలం, కొండాపూర్ గ్రామానికి చెందిన రైతు చత్తిరి గుట్టయ్య ఏడుస్తూ తనకున్న మూడెకరాల భూమితో పాటు ఇంక నాలుగెకరాలు కౌలుకు తీసుకొని సుమారు మూడు లక్షల 50 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి వరి,టమాట పంటలు పెడితే పెద్ద పెద్ద రాళ్ల వాన పడి రెండు పంటలు పూర్తిగా నాశనం అయినాయి. వచ్చే వానకాలంకు విత్తనాలు కొందామంటే అప్పులు పుట్టే పరిస్థితి లేదని ఏడుస్తూ రైతు గుట్టయ్య, అన్నాడు.

కళ్లముందే పంట రాలిపోతే..

రాచకొండ శ్రీకాంత్ హైదరాబాదులో ఏడు సంవత్సరాలు ఆటో నడిపించుకుని కుటుంబాన్ని పోషించుకునేవాడు. కరోనా కారణంగా సొంత గ్రామం అయినాపూర్‌కు వచ్చి తపస్ పల్లి డ్యాం కింద ఆరు ఎకరాలు కౌలుకు తీసుకొని ఎకరాకు పదిహేను వేల రూపాయల చొప్పున కౌలు చెల్లించి గత మూడు సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటున్నాడు. దీనికి తోడుగా ఆ యువ రైతు ఐసీఐసీఐ బ్యాంకులో మూడు లక్షల రూపాయల లోన్ తీసుకొని ఆవులను కొని గత రెండు సంవత్సరాలుగా ప్రతిరోజు 50 లీటర్లు పాలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకున్నాడు. ఈ సంవత్సరం కూడా ఆరెకరాలలో వరి పంట వేస్తే రాళ్లవానకు 100% పంట నష్టపోయిండు.

దీనికి తోడు లేగ దూడలు చనిపోవడం మూలంగా ఆవులు కూడా పాలు ఇవ్వకపోవడంతో ప్రతి నెల బ్యాంకులో కట్టవలసిన కిస్తీలు కూడా సమస్యగా మారినాయని శ్రీకాంత్ ఏడుస్తూ చెప్పాడు. కనీసం ఆవులకు మేతకోసం వరిని కోపిస్తామంటే రాళ్ల వాన మూలంగా గడ్డి వాసన రావడంతో ఆవులు తినడం లేదని, పాత గడ్డి కూడా లేదని ఇప్పుడు ఆవులను సాదుకోవడంతోపాటు అప్పులు ఎలా కట్టాలో తెలీడం లేదని శ్రీకాంత్ బాధపడుతున్నాడు. ఇటు శ్రీకాంత్ అటు గుట్టయ్య రైతుల పరిస్థితి లాగానే రాష్ట్రంలో నష్టపోయిన రైతుల పరిస్థితి అందరిదీ ఇట్లానే ఉంది.

రైతుకు మిగిలేది ఏడుపేనా..?

స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటితున్నా దేశ రైతుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంది. నూటికి 62 శాతం మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తున్న దేశంలో ఇప్పటివరకు కేంద్రంలో మరియు రాష్ట్రాల్లోనూ ఒక వ్యవసాయ విధానం లేకపోవడం మన పాలకులకు వ్యవసాయ రంగం మీద ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రాంతంలో ప్రకృతి వైపరీత్యల మూలంగా సుమారు 36% పంటలు నష్టపోతున్నాము. ఇట్లా నష్టపోతున్న సంగతి మనకు మన ప్రభుత్వాలకు తెలిసిందే! అయినా ఇప్పటికీ ప్రకృతి వైపరీత్యాల మూలంగా నష్టపోయిన పంటలకు ప్రభుత్వాలు సమగ్రమైన విచారణ జరిపి సరైన సమయంలో పంట నష్టానికి పరిహారం చెల్లింపు చేయకపోవడంతో దీనితో వ్యవసాయానికి రావలసిన యువత ఒక స్థిరమైన ఆదాయం వస్తుందని నమ్మకం లేక ఒకవేళ వ్యవసాయం వైపు వచ్చిన యువతకు ఏదో ఒక రూపంలో పంట నష్టపోవడం, పండిన పంటలకు సరైన ధరల లేకపోవడంతో అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న సంగతి ప్రతిరోజు జరుగుతూనే ఉంది.


ప్రతిరోజు సుమారు 2000 మంది వ్యవసాయ రంగాన్ని వదిలిపెట్టి ఇతర వృత్తుల్లోకి వెళ్లిపోతున్నారు. వ్యవసాయాన్ని పట్టుకొని ఏడుస్తున్న రైతాంగానికి వ్యవసాయంలో లాభాలు వచ్చి కాదు వేరే ప్రత్యామ్నాయ మార్గం లేక మరియు కన్న తల్లిదండ్రులను, ఉన్న ఊరును వదిలిపెట్టలేక సుమారు 40 శాతం మంది వ్యవసాయం ఇష్టం లేకున్నా వ్యవసాయ రంగంలోనే కొనసాగుతున్నారు.

ముఖ్యంగా మన రాష్ట్రంలో 5 ఎకరాల లోపు ఉన్న రైతులు 96%. మన రాష్ట్రంలో మార్చి, ఏప్రిల్ మాసంలో ఏదో ఒక మూలన గాలి దుమారం, రాళ్ల వానలతో పంటలు నష్టపోతున్న రైతాంగాన్ని చూస్తూనే ఉన్నాం, ఉంటాం! ఇట్లా నష్టపోతున్న రైతాంగాన్ని ఆదుకోవడానికి ఒక సమగ్రమైన విధానం లేకపోవడంతో గత కొన్ని రోజులుగా కురుస్తున్న రాళ్ల వానలతో మన రాష్ట్ర రైతాంగం చాలా జిల్లాలలో పూర్తిగా నష్టపోయిన సంగతి తెలిసిందే! దేశంలో అన్ని రకాల వస్తువులకు బీమా సౌకర్యం ఉంది. కానీ ఆరుగాలం కష్టపడి రాత్రనక పగలనక పిల్లల నుండి పండు ముసలి వరకు ఎండా, వానలకు ఓర్చి పండించిన ఆ పంటలకు బీమా సౌకర్యం లేక నష్టపోతున్నారు.

కావలసింది భిక్ష కాదు.. గౌరవం..

పంట నష్టపోవడంతో పాటు రైతు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించినప్పుడే రైతు ఆర్థికంగా నిలదొక్కుకొని సమాజంలో రైతు గౌరవంగా బ్రతికే అవకాశం ఉంటుంది. పంట నష్టం జరిగిన ప్రతిసారి నష్టపరిహారానికి ఎవరి దయాదాక్షింగాలపైన ఆధారపడకుండా ఒక పద్ధతి ప్రకారం జరిగిన నష్టానికి తప్పనిసరిగా నష్టపరిహారం చెల్లించే విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించాలి. గతంలో ఉండే పంటల బీమా కూడా రైతులకు అడపదడప నష్టపరిహారం చెల్లించింది కానీ పెద్దగా రైతులకు నష్టపరిహారం పంపిణీ చేసినట్లుగా దాఖలాలు లేవు.

కానీ మొత్తమే బీమా సౌకర్యం లేని దానికంటే కొంత రైతులకు ఉపశమనంగానే ఉండే! కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ బీమా నుండి పూర్తిగా వైదొలగడం ప్రత్యామ్నాయ పంటల బీమా పాలసీ కోసం ప్రయత్నం చేయకపోవడం ఈరోజు రాష్ట్ర రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పసల్ బీమా యోజన నష్టం కలిగించేదిగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంటల భీమా విధానాన్ని ప్రవేశపెట్టి ఆ ప్రమీయాన్ని ప్రభుత్వమే చెల్లించి రైతు యూనిట్ గా భీమా సౌకర్యం కల్పించాలి.

ఇప్పుడు నష్టపోయిన పంటలకు ప్రభుత్వం తక్షణమే పంటలను ప్రాతిపాదిక తీసుకొని కనీసం ఎకరాకు 20వేల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని అదేవిధంగా వచ్చే వానాకాలం పంటలకు ప్రభుత్వమే విత్తనాలను ఉచితంగా పంపిణీ చేయాలని, వెంటనే అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి పంటను తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, రుణాలను రీ షెడ్యూల్ చేయాలని, ఇప్పటినుండి అయినా అన్ని పంటలకు బీమా సౌకర్యాన్ని కల్పించి రైతు బీమా లాగా నష్టపోయిన ప్రతి పంటకు నెలలోపు నష్టపరిహారం చెల్లించే ఒక జవాబు దారి వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి రాష్ట్ర రైతాంగం విజ్ఞప్తి చేస్తుంది.

పులి రాజు,

సామాజిక కార్యకర్త

99083 83567






Next Story