రాజ్యాధికారమే స్త్రీ విముక్తి మార్గం

by Disha edit |
రాజ్యాధికారమే స్త్రీ విముక్తి మార్గం
X

స్త్రీలను సాహిత్యం, మనస్తత్వ శాస్త్రంతో పాటు మతం కూడా బలంగా పురుష పెత్తనం కిందికి నెట్టింది. అది హిందూమతంలోనే కాదు, అన్ని మతాల్లోనూ కొనసాగింది. స్త్రీని మానసికంగా బలహీనమైనది అని చెబుతున్నవన్నీ అబద్ధాలు. ఆమె ఒక పని చేపడితే ఆ పని పూర్తి అయ్యేవరకు నిదురపోదు. నిజానికి స్త్రీ ఒక తల్లిగా, ఒక చెల్లిగా కుటుంబ నిర్వహణ సామర్థ్యాన్ని కలిగి ఉండడమే కాదు... రాజ్య, ప్రభుత్వ నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోతోందని తెలుస్తుంది. ఈనాడే కాదు స్వతంత్ర భావాలు కలిగిన స్త్రీలు, రాజకీయాల్లో ముందడుగు వేసిన స్త్రీలు ఆయా దేశాల్లో ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని ముందుకెళ్ళారు.

ప్రపంచవ్యాప్తంగా స్త్రీల రాజకీయ ఉన్నతి పెరుగుతోంది. దానికి కారణం స్త్రీలలో సహజంగా ఉంటున్న నిరంతర చైతన్యం, సామర్థ్యం, సాధికారత, సానుకూల దృక్పథం, అంకితభావం, పోరాట శక్తి, వారిని పురుషులకంటే కూడా మునుముందుకు నడిపిస్తున్నాయి. స్త్రీలు పార్లమెంటులో అధిక సంఖ్యలో ఉన్నప్పుడే వారి ప్రతిపాదనలు, హక్కులు నెరవేరబడతాయని డా॥బి.ఆర్.అంబేద్కర్ చెప్పారు. స్త్రీ విద్యావంతురాలయితే ఆరోగ్యం, పరిసరాలు, సమాజం సామాజిక ఘర్షణలన్నింటినీ అవగాహన చేసుకోగలుగుతుంది. పురుషుడికి నేర్పిన అక్షరంలో పెత్తనం పాలు ఎక్కువుండగా స్త్రీ నేర్చుకున్న అక్షరంలో సమాజ వికాసం దాగుంది. అందుకే స్త్రీ అత్యున్నతంగా విద్యావంతురాలైన కేరళ రాష్ట్రంలో సమాజ వికాసం కూడా గణనీయంగా వుంది. స్త్రీ విద్య తక్కువ వున్న రాజస్థాన్‌లో సతీసహగమనాలు ఇంకా జరుగుతుండగా, కేరళ స్త్రీ ప్రపంచ ఎల్లలను తాకి విశ్వ విజ్ఞాన దర్శినిగా వికాసం పొందుతోంది. స్త్రీలు ఈ రోజు శాస్త్ర రంగంలో, సాంకేతిక రంగంలో, విజ్ఞాన రంగంలో అత్యున్నత దశలో ఉండడానికి కారణం వారి విద్యార్జన శక్తి అత్యుత్తమంగా నెలకొనడమే.

మహిళా ఎంపీల సంఖ్య పెరిగింది

ఇకపోతే 17వ లోక్‌సభలో స్త్రీల సంఖ్య పెరగడం గుణాత్మకమైన మార్పు అనక తప్పదు. 2019 ఎన్నికల్లో మహిళా అభ్యర్థులు 716 మంది ఉంటే, 78 మంది ఎన్నికయ్యారు. ప్రస్తుతానికి 77 మంది ఉన్నారు. 2014లో 62 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. గతంలో కంటే మహిళా ఎంపీలు 14 శాతం మేర పెరిగారు. ఇకపోతే స్త్రీలు తమ విద్యా సంపత్తితో పాటు రాజకీయ అవగాహనను కూడా పెంచుకోవాల్సి వుంది. భర్తకు భార్యలా కాకుండా మహిళా ఎంపీలు స్వతంత్రమైన వ్యక్తిత్వాన్ని కూడా అలవర్చుకోవాల్సి ఉంది. నిజానికి రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కులు, విధులు, ఆదేశిక సూత్రాలు అన్నీ స్త్రీ, పురుషుల సమానత్వాన్ని చాటి చెబుతున్నాయి.

మహిళా శ్రామిక శక్తి సరిపోదు

2016 లో నిర్వహించిన లింగ సమానత్వ సూచిలో 87వ ర్యాంక్ పొందిన ఇండియా 2023 నాటికి 146 దేశాల్లో 144వ స్థానానికి దిగజారిపోయింది. 2021 నాటికి దేశంలో కార్మికుల్లో స్త్రీల శాతం (19.2) మాత్రమే అని ప్రపంచ బ్యాంకు నివేదించింది. 2017-2018 నాటికి కార్మికుల శాతం 23.3 శాతంగా ఉండి, 2022-23కి 37 శాతానికి విస్తరించినప్పటికీ బంగ్లాదేశ్‌తో చైనాతో పోలిస్తే, భారతదేశం బాగా వెనుకబడి ఉంది. చైనా ఇప్పుడు 61 శాతం స్త్రీ శ్రామిక శక్తిని కలిగింది. దీన్ని పార్లమెంటులో ఎత్తి చూపి నిలవేయాలంటే దళితులు ఎక్కువగా పార్లమెంటు మెంబర్లు, అసెంబ్లీ మెంబర్స్ కావలసి ఉంది. నిజానికి ఒక రాజకీయ రంగంలోనే కాకుండా వ్యాపార రంగంలోనూ, విద్యా రంగంలోనూ, శాస్త్ర రంగంలోనూ, సాంకేతిక రంగంలోనూ స్త్రీలు మరింతగా ఎదగాలంటే, రాజకీయంగా వీరి గురించి పార్లమెంటులో ప్రత్యేకమైన బిల్లులు రావాలంటే తప్పకుండా రాజకీయ రంగంలో స్త్రీల సంఖ్య పెరగాలి.

పార్లమెంట్ లో మహిళా చైతన్యం

స్త్రీల రాజ్యాధికారంలో వారి సంఖ్య గణనీయంగా పెరగాల్సిన టువంటి చారిత్రక అవసరం ముందుకు వచ్చింది. కాగా, మహిళా ఎంపీలు చైతన్యవంతంగా పార్లమెంటులోనే మాట్లాడుతున్నారు. ఇది శుభ పరిణామం. ఇటీవల మహిళా ఎంపీలు పార్లమెంటులో ప్రధానమంత్రినే ప్రశ్నించే స్థాయికి వెళ్లడం, స్పీకర్ నుండి టైంని రాబట్టి తమ సమస్యలు గట్టిగా చెప్పే దశకు వెళ్ళడం ఒక గొప్ప పరిణామం. ఇకపోతే ఇందిరా గాంధీ, మమతా బెనర్జీ, జయలలిత వంటి నాయకురాళ్లు కూడా పరిపాలన రంగంలో సామర్థ్యాన్ని ప్రదర్శించి చరిత్రను చాటారు. 2029 పార్లమెంటు ఎలక్షన్ల నాటికి 33% మహిళా ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు కేటాయించబడనున్నాయి, ఈ క్రమంలో 2024లో జరిగే పార్లమెంటు, అసెంబ్లీ ఎలక్షన్‌లలోనూ స్త్రీలకు గణనీయంగా సీట్లు ఇవ్వవలసిన అవసరం ఉంటుంది.

స్త్రీల సాధికారత, రాజకీయ, ఆర్థిక, రంగాలలో పురోగతి. జాతీయ పురోగతికి, రాజ్యాంగ పరిరక్షణకు, కరుణ, ప్రేమ, ప్రజ్ఞల విస్తృతికి దేశ నైతిక శక్తికి, దేశ ఉత్పత్తి రంగ అభివృద్ధికి, స్త్రీ పురుష సమానత్వ కాంక్షకు నిలువెత్తు మార్గం సుగమం అవుతుంది అని డా॥బి.ఆర్.అంబేడ్కర్ తన ప్రసంగాలలో తెలియజేశారు. డా॥బి.ఆర్.అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో స్త్రీల అభ్యున్నతి కోసం ముందుకు నడుస్తాయని అంబేద్కర్ ఆశయాల ప్రతిఫలనం కోసం అందరూ సమైక్యంగా, సముత్తేజంగా, సముజ్జయంగా అందరూ నడవాల్సిన చారిత్రాత్మక సమయం ఇది. ఆ దిశగా మనమందరం నడుద్దాం.

డాక్టర్ కత్తి పద్మారావు

9849741695


Next Story