అలా అయితేనే రాజ్యాంగ రక్షణ

by Disha edit |
అలా అయితేనే రాజ్యాంగ రక్షణ
X

ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే సివిల్, క్రిమినల్, ఫ్యామిలీ తదితర కేసులలో హైకోర్టు తీర్పులే అంతిమమైనవిగా ఉండాలి. అందుకుగాను రాజ్యాంగ సవరణ చేయాలి. సాధారణ అంశాలను సుప్రీంకోర్టు స్వీకరించటంతో సామాన్య ప్రజల సమయం, డబ్బు వృథా అవుతుంది. ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం కూడా. ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగులో ఉన్న కేసులన్నింటి పరిష్కారానికి ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలి. 'ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా' ను అత్యున్నత కోర్టుగా పునరుద్ధరించాలి. రాజ్యాంగపర ఒరిజినల్ జ్యూరిస్‌డిక్షన్ అంశాలకు మాత్రమే దానిని పరిమితం చేయాలి. అపుడే ప్రతి పౌరుడికి న్యాయం చేకూరి రాజ్యాంగం రక్షించబడుతుంది. లేదంటే సామాన్య ప్రజానీకానికి న్యాయం అనేది కలగానే మిగిలిపోతుంది.

భారత ఉపఖండాన్ని బ్రిటిష్‌వారు ఆక్రమించుకుంటున్న తరుణంలో ప్రజల సమస్యలను పరిష్కరించడానికి న్యాయ వ్యవస్థను ప్రవేశపెట్టారు. 'న్యాయశాఖ సామర్థ్యం కంటే ప్రజాస్వామ్యానికి మరో గీటురాయి లేదని' లార్డ్ బ్రెయిన్ అనే రాజనీతి విశ్లేషకుడు వ్యాఖ్యానించారు. బ్రిటిష్‌వారు మొదటగా ఆక్రమించిన బెంగాల్ ప్రావియన్స్‌లో రెగ్యూలేటింగ్ చట్టం-1773 ద్వారా 1774లో కలకత్తాలోని ఫోర్ట్ విలియమ్స్‌లో సుప్రీంకోర్టును ఏర్పాటు చేసారు. దీని పరిధిలో బిహార్, ఒడిశా, బెంగాల్ ప్రావియన్సులు ఉండేవి. కింగ్ జార్జ్- 3 పరిపాలనా కాలం 1800 సంవత్సరంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో రెండవ సుప్రీంకోర్టు, 1823లో బాంబే ప్రెసిడెన్సీలో మూడవ సుప్రీంకోర్టు ఏర్పాటు చేసారు. ప్రావియన్సులు పెరిగిన తర్వాత సుప్రీంకోర్టులను రద్దు చేసి 'ఇండియన్ హైకోర్టు చట్టం-1861' ఆధారంగా అన్ని ప్రావియన్స్‌లలో హైకోర్టులను ఏర్పాటు చేసారు.

మొదటి హైకోర్టు 2 జూలై 1862న కలకత్తాలో ఏర్పాటైంది. అప్పుడు హైకోర్టు తీర్పులే అంతిమంగా ఉండేవి.రాజ్యాంగపర అంశాల మీదనే లండన్‌లో ఉన్న ప్రివ్యూ కౌన్సిల్‌లో అప్పీల్ చేసుకునే వీలుండేది. అనంతరం 'భారత ప్రభుత్వ చట్టం-1935'' ప్రకారం ముగ్గురు జడ్జిలతో ఢిల్లీలో 'ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా'ని ఏర్పాటు చేసారు. ఇందులో ప్రధాన న్యాయమూర్తిగా బ్రిటిష్ (క్రిస్టియన్) జడ్జి ఉండేవారు. మిగతా ఇద్దరిలో ఒకరు ముస్లిం, మరొకరు హిందూ న్యాయమూర్తులను లౌకిక భావంతో నియమించేవారు. ఈ ఫెడరల్ కోర్టు 1 అక్టోబర్ 1937 నుండి భారత రాజ్యాంగం అమలులోకి వచ్చేదాకా (26 జనవరి 1950 వరకు) దాదాపుగా 12 సంవత్సరాల 4 నెలలు పని చేసి, 135 రాజ్యాంగపర తీర్పులను ఇచ్చింది. ఇది సంవత్సరాల కాలంలో 30 రోజులు మాత్రమే పని చేస్తూ రాజ్యాంగపర అంశాల తీర్పులను వెలువరిస్తూ అత్యున్నత న్యాయస్థానంగా నడిచేది.

అక్కడి నుంచే మొదలు

స్వాతంత్ర్యానంతరం భారత రాజ్యాంగం-1950 అమలులోకి వచ్చాక ఆర్టికల్-131 ఒరిజినల్ జ్యూరిస్‌డిక్షన్ (ప్రాథమిక విచారణ అధికార పరిధి), ఆర్టికల్-143 అడ్వయిజర్ జ్యూరిస్‌డిక్షన్ (సలహాపూర్వక విచారణ పరిధి) ఆర్టికల్స్‌ని, భారత ప్రభుత్వం చట్టం-1935 నుండి ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియాకు ఉన్నట్టుగానే సుప్రీంకోర్టుకు ఆపాదించారు. అదనంగా ఆర్టికల్ 132, 133 , 134 అప్పిలేట్ జ్యూరిస్‌డిక్షన్ (సివిల్, క్రిమినల్ అప్పీల్స్ విచారణ అధికార పరిధి), ఆర్టికల్- 136 స్పెషల్ లీవ్ పిటిషన్స్ (సుప్రీంకోర్టు ప్రత్యేక అనుమతితో ఆప్పిల్స్ స్వీకరించే విచక్షణాధికారం) అధికరణాలని రాజ్యాంగంలో చేర్చారు. సుప్రీంకోర్టు ఒరిజినల్ జ్యూరిస్‌డిక్షన్ ద్వారా కేంద్రం-రాష్ట్రాలు, అంతర్రాష్ట్ర వివాదాలు, ప్రాథమిక హక్కుల పరిరక్షణ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాలు పరిష్కరించాలి. కానీ, అప్పీలేట్ జ్యూరిస్‌డిక్షన్ కలిగి ఉండటం ద్వారా హైకోర్టులు ఇచ్చిన సివిల్, ఫ్యామిలీ భార్యాభర్తల గొడవలు, రాష్ట్రాల భూ చట్టాలు, భూ వివాదాలు, ఆర్థిక సంబంధ విషయాలు, కార్పొరేట్, విద్యా సంబంధ వివాదాల తీర్పులు, క్రిమినల్ తగాదాలు మర్డర్, దొంగతనాలు, మానభంగాలు, ఫోర్జరీ, చీటింగ్, బెదిరింపుల కేసుల తీర్పులను అప్పీల్ కేసులుగా స్వీకరించడం జరుగుతున్నది.

దీంతో జీఎస్‌టీ, ఆర్టికల్-370, ఎన్‌ఆర్‌సీ, సీఏఏ, రాష్ట్రాల మధ్య గల నీటి పంపకాల లాంటి అత్యంత కీలక రాజ్యాంగపర కేసుల విషయంలో జాప్యం జరిగి అవి కొలిక్కి రావటం లేదు. హైకోర్టు తీర్పులను స్వీకరించడం వలన, దీపావళికి టపాకాయలు కాల్చాలా? వద్దా? లాంటి అనవసర విషయాలను స్వీకరించటం వలన అసలైన కేసులు పెండింగులో పడి విచారణకు నోచుకోవటం లేదు. ఆర్టికల్- 136 స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా అదనంగా కేసులు స్వీకరించడంతో సుప్రీంకోర్టులో కేసులన్నీ కోకొల్లలుగా పడి ఉంటున్నాయి. రాజ్యాంగపర కేసులు కాకుండా 90 శాతం క్రిమినల్, సివిల్, అప్పీల్, ఎస్‌ఎల్‌పీ కేసుల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా మారి కేసుల విషయంలో రోస్టర్ సమస్యలు తలెత్తుతున్నాయి.

Also read: ఆయన న్యాయవ్యవస్థను క్రమబద్దీకరించగలరా?

కుప్పలుతెప్పలుగా కేసులు

'ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా' ఉన్నప్పుడు గవర్నర్ జనరల్ నాలుగుసార్లు మాత్రమే సలహాలు, సూచనలు అడిగారు. సుప్రీంకోర్టు ఏర్పడిన తరువాత రాష్ట్రపతి 'ఢిల్లీ న్యాయ చట్టాల అంశం-1951, కేరళ విద్యా బిల్లు 1958, రాష్ట్రపతి ఎన్నికలు-1974, రామజన్మభూమి వివాదం-1993, సహజ వనరుల వివాదాలు-2012' లాంటి అంశాల మీద 15 సార్లకు పైగా సలహాలు, సూచనలు కోరారు. కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య తలెత్తిన వివాదాలను ఆర్టికల్-131 ప్రకారం సుప్రీంకోర్టు పరిష్కరించాలి. కానీ, పార్లమెంటు చేసిన ఓ చట్టం ప్రజలకు అన్యాయం కలిగిస్తున్నదని మధ్యప్రదేశ్ సుప్రీంకోర్టుకు వెళితే, అది ఆర్టికల్-131 కిందకు రాదని కొట్టి వేసింది. ఆర్టికల్-131 కింద ఎన్‌ఆర్‌సీ, సీఏఏని ఛాలెంజ్ చేసిన ఏకైక రాష్ట్రం కేరళ. ఇవన్నీ చాలవన్నట్టు ఆర్టికల్-138 ప్రకారం సుప్రీంకోర్టుకు పార్లమెంటు అదనపు అధికారాలను సంక్రమింప చేయవచ్చని కూడా పేర్కొంది.

2012 లెక్కల ప్రకారం, ట్రయల్ కోర్టులలో సుమారు 2 కోట్ల 70 లక్షల కేసులు పెండింగులో ఉండగా, జడ్జిల సంఖ్య 21 వేలకు పైగా ఉంది. సగటున ఒక్కో జడ్జి 1200 నుంచి 1300 మధ్య కేసుల భారాన్ని కలిగి ఉన్నారు. దేశవ్యాప్తంగా 25 హైకోర్టులు ఉండగా 700 మంది జడ్జిలు ఉన్నారు. 42 లక్షలకు పైగా కేసులు పెండింగులో ఉన్నాయి. సుప్రీంకోర్టు ఎనిమిది మంది జడ్జిలతో మొదలైంది. 2019 సవరణ ప్రకారం 33 మంది న్యాయమూర్తులను కేటాయించారు. ప్రస్తుతం 20 మంది పని చేస్తున్నారు. దాదాపు 60 వేలకు పైగా పెండింగ్ కేసులు ఉన్నాయి. ఒక్కొక్క న్యాయమూర్తి రెండు వేల కేసుల పరిష్కారం చూపే బాధ్యతను కలిగి ఉన్నారు. హైకోర్టులలో దాదాపు ఎనిమిది లక్షలపై కేసులు పది సంవత్సరాలుగా విచారణకు నోచుకోవటం లేదు.

Also read: సుప్రీం రీజనల్ బెంచీలు సాధ్యమేనా?

అలా అయితేనే ప్రజలకు న్యాయం

1946లో 'ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా' యేడాదికి 30 పని దినాలలో 14 కేసులను విని 11 కేసులలో తీర్పులు ఇచ్చింది. ప్రస్తుత సుప్రీంకోర్టులో 222 రోజుల పని దినాలలోనూ 75 సంవత్సరాలుగా 60 నుంచి 70 వేల కేసులు పెండింగులో ఉన్నాయి. సగటున సంవత్సరానికి వేయి కేసులు పెండింగులో పడుతున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజులలో ప్రజలకు సత్వర న్యాయం అనేది 'దూరపు కొండలు నునుపు'లాగా కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. ఈ సమస్యకు ప్రధాన కారణం ఏకీకృత న్యాయవ్యవస్థ అని ఈ దేశ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే సివిల్, క్రిమినల్, ఫ్యామిలీ తదితర కేసులలో హైకోర్టు తీర్పులే అంతిమమైనవిగా ఉండాలి. అందుకుగాను రాజ్యాంగ సవరణ చేయాలి.

సాధారణ అంశాలను సుప్రీంకోర్టు స్వీకరించటంతో సామాన్య ప్రజల సమయం, డబ్బు వృథా అవుతుంది. ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం కూడా. ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగులో ఉన్న కేసులన్నింటి పరిష్కారానికి ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలి. 'ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా' ను అత్యున్నత కోర్టుగా పునరుద్ధరించాలి. రాజ్యాంగపర ఒరిజినల్ జ్యూరిస్‌డిక్షన్ అంశాలకు మాత్రమే దానిని పరిమితం చేయాలి. అపుడే ప్రతి పౌరుడికి న్యాయం చేకూరి రాజ్యాంగం రక్షించబడుతుంది. లేదంటే సామాన్య ప్రజానీకానికి న్యాయం అనేది కలగానే మిగిలిపోతుంది.

(నేడు నేషనల్ లా డే)


శ్రీ కాంత్ స్మిత్

ప్రెసిడెంట్, తెలంగాణ ద్రవిడ లాయర్స్ అసోసియేషన్

94948 41254



Next Story

Most Viewed