బాసర అమ్మవారి ఆశీస్సులతో ప్రజాసంగ్రామ యాత్ర

by Disha edit |
బాసర అమ్మవారి ఆశీస్సులతో ప్రజాసంగ్రామ యాత్ర
X

పథకాల పేరు మార్చి క్రెడిట్‌ తమ ఖాతాలో వేసుకుంటూ, చివరికి కేంద్రం ఏమీ ఇవ్వడం లేదంటూ గులాబీ మూక చేస్తున్న దుష్ప్రచారంపై ప్రజలకు అవగాహన కల్పిస్తం. బీజేపీ సిద్ధాంతాలను, విలువలతో కూడిన రాజకీయాలను ప్రచారం చేస్తం. గత నాలుగు విడతల ప్రజాసంగ్రామ పాదయాత్రతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మార్పులు వచ్చాయి. టీఆర్‌ఎస్‌ కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని స్పష్టమైన సంకేతాలు వెలువడినయ్‌. బాసర సరస్వతీ అమ్మవారి ఆశీర్వాదంతో, ప్రజల ఆధారాభిమానంతో ముందుకు సాగుతం. అందరూ కమలదండుతో చేతులు కలపాలని, కుటుంబ పాలనను అంతమొందించి ప్రజారంజక పాలన తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొనాలని స్వాగతిస్తున్నం.

తొమ్మిదేళ్లుగా తోడేళ్ల లెక్క తెలంగాణ రాష్ట్రాన్ని పీక్కు తింటున్న అవినీతి, నియంతృత్వ కుటుంబ పాలనను తరిమికొట్టడానికి భారతీయ జనతా పార్టీ నిత్యం పోరాటం చేస్తున్నది. ఐదో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర ఈ పోరాటానికి మరో నూతన అధ్యాయనాన్ని అందించబోతున్నది. కేసీఆర్‌ కుటుంబ పాలనను, లారీల కొద్ది ప్రజల డబ్బును, టన్నుల కొద్ది ప్రజల సొమ్మును దోచుకున్న టీఆర్‌ఎస్‌ నాయకులను గద్దె దించే వరకూ కాషాయ సైనికుల కవాతు ఆగదని శంఖం పూరించబోతున్నది. తెలంగాణలో మెజారిటీ వర్గాల ప్రయోజనాల కోసం 'బీసీబంధు', అణగారిన ఎస్టీ బిడ్డల కోసం 'గిరిజన బంధు' తేవడమే లక్ష్యంగా, సకల జనులు కలలుకన్న భావి తెలంగాణ పునర్నిర్మాణమే ధ్యేయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ కుమార్‌ తలపెట్టిన ప్రజాసంగ్రామ పాదయాత్ర ఐదో విడత నవంబర్‌ 28న ప్రారంభం అయ్యింది.

ప్రజల కష్టాలు, నష్టాలు తెలుసుకుంటూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, భావి సామాజిక తెలంగాణ కోసం ప్రణాళికలు రచిస్తూ బండి సంజయ్‌ ఇప్పటికే నాలుగు విడతలలో పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేసిన్రు. పాదయాత్రకు, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టించింది. అయినా వెనకడుగు వెయ్యకుండా, వెన్ను చూపకుండా ఇప్పటి వరకు విడతలుగా 21 జిల్లాలలో 1,178 కిలోమీటర్లు నడిచి బండి సంజయ్‌ తెలంగాణ ప్రజల మనసులు గెలుచుకున్నారు. ఇప్పుడు అదే ఉత్సాహం, అదే ఉద్వేగంతో మరో విడత పాదయాత్ర మొదలు పెట్టిండ్రు. అదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలలో 225 కిలోమీటర్ల మేర కొనసాగే ఈ పాదయాత్ర డిసెంబర్‌ 17న కరీంనగర్‌‌లో నిర్వహించే బహిరంగ సభతో ముగుస్తది.

మాయమాటల సర్కారు

మాయ మాటలు చెప్పడం, ఓట్లు పడంగనే అవతల పడటం కేసీఆర్‌‌కి అలవాటుగా మారింది. దీని గురించి ఎప్పటికప్పుడు బీజేపీ ప్రజలను అప్రమత్తం చేస్తున్నా, మళ్లీ మళ్లీ కొత్త వేషంతో కేసీఆర్‌ ప్రజలను వంచిస్తున్నరు. మునుగోడు ఉప ఎన్నికలోనూ ఇదే వంచన పునారావృతం అయ్యింది. 'టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించండి, మునుగోడును నా గుండెలలో పెట్టుకుంటా, ప్రతి ఎకరాకు నీరు వచ్చేలా చర్లగూడెంతో పాటు ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తా అన్నారు. వంద పడకల ఆస్పత్రి, చండూరు రెవిన్యూ డివిజన్‌‌తో పాటు మీ కోరికలన్నీ 15 రోజులలోనే తీరుస్తా' అన్నరు. 15 రోజులు దాటిపోతున్నా వాటి మీద ఒక్క ప్రకటనా రాలేదు.

మునుగోడును దత్తత తీసుకుంటనని చెప్పిన ఆయన కుమారుడి మాటలు కూడా ఉత్తరకుమారుడి ప్రగల్భాలుగానే మిగిలిపోయినయ్‌. మునుగోడు ప్రజలు మోసపోయిన్రు. వచ్చే ఎన్నికలలో వారు వేయబోయే వేషాలపై ఈ పాదయాత్ర ద్వారా ప్రజలలో చైతన్యం తీసుకొస్తం. వంద మంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం మిడతల దండులా మునుగోడుపై పడితే, పట్టుమని పదివేల మెజారిటీ రాలేదు. బీజేపీ ఓటు బ్యాంకు 12 వేల నుంచి 86 వేలకు పెరిగింది. ఇది బీజేపీ పట్ల ప్రజలలో పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనం.

Also read: నవ తెలంగాణ సాధన కోసమే యాత్ర

అనంతమైన దోపిడీ

ఇటీవల టీఆర్‌ఎస్‌ నాయకుల ఇండ్లలో ఐటీ దాడులు చేస్తుంటే, లారీల కొద్దీ డబ్బు, టన్నుల కొద్ది బంగారం, వెండి బయటపడుతున్నది. తొమ్మిదేళ్లుగా వారు చేస్తున్న దోపిడికి ఇదే నిదర్శనం. ఈ దోపిడీ డబ్బుతోనే మునుగోడు ఉపఎన్నికలో ఓటుకు వేలకు వేలిచ్చి కొని, ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యంగా మార్చిన్రు. అవినీతిని ప్రశ్నిస్తే కేసులు పెడ్తరు, దాడులు చేస్తరు. తాము పవిత్రులమని నిరూపించుకోవాల్సింది పోయి, బీజేపీ కక్ష సాధింపు అనడం సిగ్గుచేటు. ఇగ, ఢిల్లీ లిక్కర్‌ కేసులో దొరికిన టీఆర్‌ఎస్‌ నాయకులు తెలంగాణ రాష్ట్ర పరువు తీసిన్రు. ఏకంగా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులే ఈ కేసులో ఉండటం దురాశ అనిపించక మానదు. అవినీతి కేసులలో ఇరుక్కున్నదిగాక, దాన్ని నుంచి తప్పించుకోవడానికి బీజేపీ మీద బురద చల్లడానికి కుట్రలు చేస్తున్నరు. ఈ వాస్తవాలతో వారిని ప్రజాకోర్టులో నిలదీసి, వెలేసే రోజులు దగ్గరవడ్డయ్‌.

సకల జనుల పోరాటాలు, విద్యార్థుల ప్రాణ త్యాగాలతో ఉద్యమ పార్టీగా అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణ ప్రజల కలలను కల్లలు చేసింది. తొమ్మిదేండ్ల ఏలుబడిలో మన బిడ్డలకు ఉద్యోగాలు రాలే. మన పొలాలకు నీళ్లు రాలే. మన డబ్బా ఇండ్లు డబుల్ బెడ్రూం కాలే. మన ఊరికి నిధులు రాలే. మన రైతుల అప్పులు తీరలే. ఆస్పత్రికి పోతే ఖర్చుల కష్టాలు తగ్గలే. బడి ఫీజుల బాధలు తప్పలే. ఉద్యమకారులకు అవకాశాలు రాలే. ఇట్లా, ఏ దిక్కు నుంచి చూసినా, తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడలే. కొత్త రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబానికి, తెలంగాణ ఉద్యమ ద్రోహులకు తప్ప ఏ ఒక్కరికీ మేలు జరగలే. కేసీఆర్‌ నియంతృత్వ, కుటుంబ పాలనలో జనం అరిగోస పడుతున్నరు. ఆ జనం గోస తీర్చడానికి, వారికి భరోసా ఇవ్వడానికే బీజేపీ ఈ ప్రజా సంగ్రామయాత్ర సాగిస్తున్నది.

మాటలు తప్ప చేతలు లేవు

తెలంగాణకు దళితుడే ముఖ్యమంత్రి అని, దళితులకు మూడెకరాల భూమి ఇస్తమని దళితులను మోసం చేసిన్రు. అబద్ధపు హామీలతో బీసీలను విద్యాపరంగా, ఆర్థికంగా దెబ్బ తీసిన్రు. కేజీ టు పీజీ ఉచిత విద్య మాటలకే పరిమితమైంది. రైతులకు రుణమాఫీ, ఉచిత ఎరువుల హామీలు అమలుకే నోచుకోలే. చేనేతకు చేయూతే లేదు. లక్షల కుటుంబాలు ఆధారపడిన గీతవృత్తిని లాభదాయకంగా మార్చడంలోనూ, ప్రమాదాలు జరగకుండా సాంకేతికతను అనుసంధానించడంలోనూ, ప్రమాదాలు జరిగినప్పుడు పరిహారం ఇచ్చి ఆదుకోవడంలోను గౌడన్నలను టీఆర్‌ఎస్‌ విస్మరించింది. గొర్రెల పంపిణీ పథకాన్ని మాటలకే పరిమితం చేసి యాదవులను మోసం చేసింది. చెరువులలో మీకోసం చేప పిల్లలు వేస్తున్నమని ముదిరాజుల చెవులలో పూలుపెట్టింది.

బీసీ రుణాలను మూలకు పడేసి ఐదేండ్లు కావొస్తున్నది. రాష్ట్ర జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా కుట్రపూరితంగా కేసీఆర్‌ అణచివేస్తున్నరు. బీసీలకు పదవులు లేవు, పనులూ లేవు. 'బీసీబంధు' అమలు చేయాలని బీజేపీ డిమాండ్‌ చేస్తున్నది. పోడు భూముల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తమన్నరు. పోడు భూములలో మొక్కలు నాటాలని ఆదేశాలు ఇచ్చేది మీరే. పట్టాలిస్తామని ఆశ పెట్టేది మీరే. ఈ రెండు నాలుకల ధోరణితో అధికారులు, పోడు రైతుల మధ్య గొడవలు జరిగి అమాయకుల ప్రాణాలు పోతున్నయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎఫ్‌ఆర్వో హత్యకు గురయిన్రు. గత ఎనిమిదేండ్లలో ఇలాంటి 843 ఘటనలు జరిగినయ్‌. 'గిరిజన బంధు' ని అమలు చేయకుండా వారిని ఆర్థికంగా అణచివేస్తున్నది కూడా టీఆర్‌ఎస్‌ సర్కారే.

Also read: జనరంజక పాలన కోసమే యాత్ర

కమలదండుతో చేతులు కలపండి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను, తెలంగాణకు అందిస్తున్న నిధుల గురించి ఈ యాత్ర ద్వారా ప్రజలకు వివరిస్తం. కేంద్ర నిధులను దారి మళ్లించి పథకాల పేరు మార్చి క్రెడిట్‌ తమ ఖాతాలో వేసుకుంటూ, చివరికి కేంద్రం ఏమీ ఇవ్వడం లేదంటూ గులాబీ మూక చేస్తున్న దుష్ప్రచారంపై ప్రజలకు అవగాహన కల్పిస్తం. బీజేపీ సిద్ధాంతాలను, విలువలతో కూడిన రాజకీయాలను ప్రచారం చేస్తం.

గత నాలుగు విడతల ప్రజాసంగ్రామ పాదయాత్రతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మార్పులు వచ్చాయి. టీఆర్‌ఎస్‌ కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని స్పష్టమైన సంకేతాలు వెలువడినయ్‌. బాసర సరస్వతీ అమ్మవారి ఆశీర్వాదంతో, ప్రజల ఆధారాభిమానంతో ముందుకు సాగుతం. అందరూ కమలదండు తో చేతులు కలపాలని, కుటుంబ పాలనను అంతమొందించి ప్రజారంజక పాలన తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొనాలని స్వాగతిస్తున్నం.


డా. గంగిడి మనోహర్‌రెడ్డి

ఉపాధ్యక్షులు, బీజేపీ తెలంగాణ శాఖ

ప్రముఖ్‌, ప్రజా సంగ్రామ పాదయాత్ర

98492 01362

Next Story

Most Viewed