17వ శతాబ్దంలోనే బహుజన రాజైనా సర్దార్ పాపన్న గురించి తెలుసా?

by Disha edit |
17వ శతాబ్దంలోనే బహుజన రాజైనా సర్దార్ పాపన్న గురించి తెలుసా?
X

రు కొడితేనేమి ఫలం? పల్లె కొడితేనేమి ఫలం? కొడితే గోల్కొండనే కొట్టాలి' అని 17వ శతాబ్దంలోనే దక్కన్ గడ్డపై మొదటిసారిగా బహుజన రాజ్యాన్ని స్థాపించిన తొలి బహుజన పోరాటయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న (1650-1709). ఒక సాధారణ కులంలో జన్మించి ఆనాటి సామాజిక వ్యవస్థలోనున్న ఆధిపత్య కులాల అధికారాన్ని, బానిసత్వాన్ని ధిక్కరించి దళిత బహుజనులను రాజ్యాధికారం వైపు నడిపిన తొలి బహుజన రాజు.

1960 దశకం తర్వాత ప్రపంచవ్యాప్తంగా చరిత్ర నూతన పొంతలు తొక్కింది.ప్రత్యామ్నాయ చరిత్ర నిర్మాణంలో విస్మరణకు గురైన ప్రాంతాలు, వ్యక్తుల అస్తిత్వ చరిత్ర నిర్మాణం ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే 17వ శతాబ్దానికి చెందిన సర్వాయి పాపన్న గౌడ్ ప్రస్తావన మన ముందుకు వచ్చింది. ఆధిపత్య కులాల చరిత్రలో విస్మరణకు గురైన సర్వాయి పాపన్న గౌడ్ ప్రాసంగికత రోజురోజుకు ద్విగుణీకృతం అవుతున్న నేపథ్యంలో ఆయన చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

తొలి బహుజన రాజ్యం

విజయం సాధించినవారి గురించే రాయబడిందే చరిత్ర అయ్యింది. క్షత్రియ రాజులు, అగ్రవర్ణ భూస్వామ్య కులాలవారు వారి ఎదుగుదలకు చేసే ఆక్రమణలు, దోపిడీలు, లూటీలను చరిత్ర గొప్ప పోరాటాలుగా, వారిని పోరాట యోధులుగా చిత్రీకరించింది. వారి ఆధిపత్యాన్ని ఎదిరించిన సర్వాయి పాపన్నను దోపిడీ దొంగగా చిత్రీకరించింది. 'దుర్గములు నిర్మించి, దుర్గములను సాధించి రాజ్యమును విస్తరించుకొన ప్రయత్నించినవాడు దొర గాక దొంగ యెట్లగును' అని ప్రశ్నించిన మల్లంపల్లి సోమశేఖర శర్మ కోణంలో పాపన్న చరిత్రను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. పాపన్న తన 59 సంవత్సరాల కాలంలో ఖిలాషాపురం, షాపురం, కొలనుపాక, భువనగిరి ప్రాంతాలను ఆధారం చేసుకొని గోల్కొండ కోటను ఆక్రమించి తొలి బహుజన రాజ్యాన్ని స్థాపించిన పోరాట వీరుడు. భూస్వామ్య, బానిసత్వ ప్రభుత్వాలను ప్రత్యామ్నాయ సమాంతర బహుజన రాజ్యాన్ని ఈ గడ్డ మీద ఏర్పాటు చేసిన వీరుడి చరిత్రను ఆధిపత్య కులాల చరిత్రకారులు మట్టిలో కప్పేశారు.

విజేతలు మాత్రమే నిర్మించిన చరిత్రను పరాజితుల కోణం నుండి పునర్నిర్మాణం చేసుకోవాలి. అధిపత్య కులాలవారు బహుజనులను అణగదొక్కుతున్న17 వ శతాబ్దంలోనే పాపన్న సైన్యాన్ని తయారు చేసుకున్నడు. అతని నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ నేటి తరం నేర్చుకోవాలి. సబ్బండ వర్గాలను ఏకం చేసి 1675 సంవత్సరంలో మొదలైన పోరాటం సర్వాయిపేట, మొఘల్ అనుయాయులు, ఫౌజీదారుల నుంచి కొల్లగొట్టిన ధనంతో 12 ఎకరాల విస్తీర్ణంలో శత్రు దుర్బేధ్యమైన కోటను నిర్మించుకున్నాడు. సర్వాయిపేట కేంద్రంగా రాజ్య విస్తరణ మెదలుపెట్టి, 1698 తాడికొండ లో 50 ఎకరాల విస్తీర్ణంలో నాలుగు బురుజులతో బలమైన కోటను నిర్మించాడు. షాపురం కోటను 1700 సంవత్సరంలో మొదలుపెట్టి 1705 వరకు నిర్మించినట్టుగా తెలుస్తున్నది. భువనగిరి, భైరాన్‌పల్లి, హుస్నాబాద్ ప్రాంతాలలో రక్షణ స్థావరాలను ఏర్పాటు చేసుకొని పాపన్న 25 సంవత్సరాల కాలం పాటు యుద్ధాలు, పోరాటాలలో మునిగి తేలాడు.

దక్కన్ నేలమీద చెరగని ముద్ర

సర్వాయి పాపన్న మొఘల్ వైశ్రాయుల నిరంకుశ ఆధిపత్యాన్ని, బ్రాహ్మణవాద భావజాలానికి వ్యతిరేకంగా స్థానిక ప్రజలను కాపాడే బాధ్యతను స్వీకరించాడు. తన తల్లి పేరును ముందుంచుకుని సర్వాయి పాపన్నగా ప్రసిద్ధి చెందాడు. ఇలా చరిత్రలో తల్లి పేరును తన పేరు ముందు పెట్టుకున్నవారు శాతకర్ణి తర్వాత పాపన్న మాత్రమే. నాటి సమాజంలో పాతుకుపోయిన బలమైన ఫ్యూడల్ శక్తుల కోట గోడలను కూలగొట్టిన యోధుడు పాపన్న. శత్రువులకు చిక్కకుండా, కోటల నిర్మాణం ద్వారా తన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని దానిని విస్తరించడం కోసం అహర్నిశలు శ్రమించడం అసాధారణ అంశం.

పాపన్న ఎంతకాలం పరిపాలన చేశాడనే అంశం కన్నా, ఒక సాధారణ వ్యక్తికి ఇంత ఎలా సాధ్యమైందనేది ముఖ్యం.దాదాపు మూడు దశాబ్దాల పాటు కాలానికి ఎదురీది దక్కన్ నేలమీద తనదైన చెరగని ముద్రవేసిన రాజు. ఫూలే, పెరియార్, అంబేద్కర్ స్ఫూర్తి నేడు తక్షణ అవసరం అని మాట్లాడుకుంటున్నం. కానీ, దాదాపు శతాబ్దాల కిందనే దీనిని గ్రహించిన పాపన్న స్ఫూర్తిదాయక పోరాటం ముందు తరాలకు అందించాల్సిన అవసరం ఉంది. కులం, మతం, వర్గం, జాతి, అనే సమాజ విచ్చిన్నకర అంశాలను పక్కనపెట్టి బహుజన రాజ్యాధికారం కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. దామాషా ప్రకారం విద్య, ఉద్యోగం, ఆకలి, అంటరానితనం దోపిడీ లేని సమాజం కోసం నడుం బిగించడమే సర్దార్ సర్వాయి పాపన్నకు మనం ఇచ్చే నివాళి.

(నేడు సర్వాయి పాపన్న 372వ జయంతి)


డా. పొన్నం ముత్యం గౌడ్

బహుజన స్టూడెంట్ ఫెడరేషన్

96664 10677


Next Story