షార్ట్ ఫిల్మ్....నిడివి తక్కువ- విస్తృతి ఎక్కువ

by Disha edit |
షార్ట్ ఫిల్మ్....నిడివి తక్కువ- విస్తృతి ఎక్కువ
X

సినిమా నిశ్చలమైంది కాదు. అది ఓ కదులుతున్న ప్రపంచం. విశిష్టమయిన దృశ్య మాధ్యమం. సినిమా ద్వారా మనం కథ చెప్పం.. చూపిస్తాం. అలా చూడడంలోనే ప్రేక్షకులకు ఆ కథ పట్ల ఆసక్తి కలగాలి వారందులో మమేకం కావాలి. ఆ సినిమాలోని ఇతివృత్తం పట్ల పాత్రల పట్ల ప్రేక్షకుల్లో ఇష్టం, కోపం, ద్వేషం ఇలా అనేక భావాలు కలగాలి అప్పుడే ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. వాళ్ళు ఆ సినిమాని ఆదరిస్తారు అభిమానిస్తారు. సినిమాకు మూలాంశమయింది కథ. కథకుడు కథ రాసినప్పుడు పాఠకుల్ని దృష్టిలో పెట్టుకుని రాస్తాడు. అదే కథకు దృశ్యమాధ్యమంలో సినిమాగానో టీవీ ఎపిసోడ్ గానో లేదా ఇవ్వాల్టి వెబ్ సెరీస్ గానో, షార్ట్ ఫిల్మ్ గానో రూపొందించాల్సి వచ్చినప్పుడు ఆ కథని దృశ్య రూపంలో రాసుకోవాలి. కథలో వుండే మాధుర్యం దృశ్యరూపంలోకి మార్చినప్పుడు అందులోని మూల భావం, ఆయా పాత్రల ప్రవర్తన, వ్యక్తిత్వాలు, మాట్లాడే భాష లాంటి అనేక అంశాలను ప్రధానం చేసుకోవాలి. ఆ కథకు చెందిన కథా నేపథ్యం, ఆ కథ నడిచే ప్రాంత వాతావరణం, ఆ ప్రాంతీయ పరిమళం దృశ్య మాధ్యమంలో వెల్లివిరియాలి. అప్పుడే అది గొప్ప దృశ్య సృజన అవుతుంది. లేకుంటే పేలవమై ప్రేక్షకుల తలల మీంచి అట్లా ఎగిరిపోతుంది.

కానీ ఇవాళ సినిమా అనగానే పెద్ద స్టార్లు, పెద్ద నిర్మాతలు, కోట్ల పెట్టుబడులు, పెద్ద నిర్మాణ సంస్థలు, పాన్ ఇండియా అంటూ అనేకం మన ముందు నిలబడతాయి. భీకరమైన ఫైట్లు, ఫారిన్లో పాటలు గ్రాఫిక్స్, ఇలా మన సినిమాలకు ఒక అప్రకటిత సూత్రం నిర్దేశితమయిపోయింది. భారతదేశ వ్యాప్తంగా ఇలాంటి సినిమాలు తీసేందుకు రూపొందించేందుకు, నటించేందుకు, ప్రదర్శించేందుకు అనేక మంది నిర్మాతలు, సంస్థలు, గ్రూపులు గుత్తాధిపత్యం చెలాయిస్తూ స్థిరపడిపోయాయి. అదంతా దుర్భేద్యమైన కోట. మొత్తం సినిమా రంగాన్ని అది నిర్దేశిస్తుంది, నియంత్రిస్తుంది. వ్యాపార పరంగా కొన్ని విజయాలూ అనేక అపజయాలూ మూట గట్టుకుంటూనే ప్రధాన స్రవంతి సినిమా కొనసాగుతూనే వున్నది. ఒక నిర్మాత ఓటమిపాలై వెనుతిరిగితే వెంటనే మరో నిర్మాత వేదిక మీదికి వస్తూ వుంటాడు. అది సినిమా గ్లామర్ కున్న బలం.

స్వతంత్ర సినిమాకు పాదులు

ఈ ప్రధాన స్రవంతి సినిమాకు సమాంతరంగా మరో ‘భారతీయ స్వతంత్ర సినిమా’ పాదులు వేయడం చాలా కాలం నుండే మొదలు పెట్టింది. యువకులు, విద్యావంతులు, విద్యార్థులు, సినిమా రంగం పట్ల అభిమానం నిబద్ధత కలిగి వున్న వారు పెద్ద సినిమాకు దూరంగా తమ తమ ప్రయత్నాలు ప్రారంభించారు. ఇది సరిగ్గా ఆమెరికాలోని 7 మేజర్ స్టూడియోలకు సమాంతరంగా ఎదిగివచ్చిన ఇండిఫిల్మ్, లేదా ఇండిపెండెంట్ ఫిల్మ్‌ను పోలి వుంది. అమెరికాలో పారమౌంట్, ఎంజీఎం, ఆర్కేయార్, వార్నర్ బ్రదర్స్, యూనివర్సల్ పిక్చర్స్, ట్వంటియత్ సెంచరీ ఫాక్స్ లాంటి స్టూడియోలు 1920-50 దాకా సినిమా రంగంపై తమ నియంత్రణను కొనసాగించాయి. కానీ వాటికి అవతల నిర్మించబడి, పంపిణీ అవుతున్న సినిమాల్ని వాళ్ళు ఇండిపెండెంట్ సినిమా అని పిలుస్తున్నారు. అది అమెరికాలో క్రమంగా నిలదొక్కుకుంది. అలాంటి ప్రయత్నాలే కొంతమంది మన దేశంలో కూడా మొదలు పెట్టారు.

ఆధునిక సాంకేతిక అభివృద్ధి నేపథ్యంలో డిజిటల్ టెక్నాలజీ ఆవిష్కృతం కావడం, డిజిటల్ కెమెరాలూ, నాన్ లీనియర్ ఎడిటింగ్ వసతులూ రావడంతో పాటు ఆ సాంకేతికత వినియోగదారుడికి అందుబాటులో వున్న ధరకి లభించడంతో స్వతంత్ర సినిమా ఎదుగుదలకు పాదులు పడ్డాయి. అవకాశాలు పెరిగాయి. 35 ఎంఎం ఫార్మాట్‌లో సినిమా నిర్మాణానికి ముడిసరుకు, కెమెరా పోస్ట్ ప్రొడక్షన్ వ్యయం అమితంగా పెరిగిపోయింది. ఇక 16 ఎంఎం చిత్ర నిర్మాణమూ, ప్రదర్శనా అదృశ్యం అయిపోయింది. దాంతో డిజిటల్ టెక్నాలజీ నిర్వహణ పరంగానూ, ఖర్చుల పరంగానూ అనుకూలంగా మారిపోయింది. ఫిల్మ్ కెమెరాల్లో 1985లో కాంకార్డర్లు, 1990ల్లో హై డెఫినిషన్ వీడియో అందుబాటులోకి వచ్చాయి. ఇంకా డీవీడీ ఫైర్ వైర్ టెక్నాలజీ రావడంతో చలన చిత్ర నిర్మాణం విపరీతంగా పెరిగిపోయింది. ప్రపంచంలో మొట్టమొదటి హై డెఫినిషన్ డీవీడీ ‘వన్ సిక్స్ రైట్’ 2006 నవంబర్ లో విడుదల అయింది. మొట్ట మొదటి పూర్తి కంప్యూటర్ యానిమేషన్ సినిమా 2004లో విడుదలైంది. ఇట్లా డిజిటల్ టెక్నాలజీ ఇండిపెండెంట్ సినిమా ఎదుగుదలకు తోడ్పడింది. ఆ క్రమంలోనే కేబుల్ టీవీ, ఇంటర్నెట్‌లు ప్రదర్శనా రంగంలో ఈ స్వతంత్ర సినిమాకు గొప్ప అవకాశాన్నిచ్చాయి.

ఫాదర్ ఆఫ్ ఫిల్మ్ గ్రామర్

ఇండిపెండెంట్ సినిమాతో పాటు షార్ట్ ఫిల్మ్ నిర్మాణానికి లభించిన ఈ ప్రోత్సాహం అంతా ఇంతా కాదు. అనేక దేశాల్లో జాతీయ అంతర్జాతీయ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్స్ నిర్వహణ కూడా షార్ట్ ఫిల్మ్స్ నిర్మాణం పెరగడానికి ఎంతో దోహదం చేశాయి. ఇంటర్నెట్ ఫిల్మ్ కాంపిటీషన్స్ కూడా గొప్ప ఊపునిచ్చాయి. నిజానికి షార్ట్ ఫిల్మ్ అంటే చిన్న నిడివి కల సినిమాల నిర్మాణం. ఇది ఇటీవల ప్రారంభమైంది కాదు. అమెరికాకు చెందిన సినిమా దిగ్గజం, చరిత్రలో గొప్ప సుస్థిర స్థానాన్ని పొందిన డి.డబ్ల్యూ గ్రిఫిత్ 450 షార్ట్ ఫిల్మ్స్ నిర్మించాడు. ఆ క్రమంలోనే ఆయన ‘ఫాదర్ ఆఫ్ ఫిల్మ్ గ్రామర్’గా పేరు గాంచారు. అట్లాగే ప్రఖ్యాత ఫిల్మ్ మేకర్ డేవిడ్ లించ్ తీసిన షార్ట్ ఫిల్మ్స్ తోనే ఆయన ప్రతిభ ప్రపంచానికి తెలిసింది. అంతెందుకు చార్లీ చాప్లిన్ తన జీవిత కాలంలో 30కి పైగా షార్ట్ ఫిల్మ్స్ తీశాడు. ఇలా పూర్తి నిడివి సినిమాలకు సమాంతరంగా లఘు సినిమాల నిర్మాణం ఆ రోజుల్నుంచే వుంది.

లఘు చిత్రాల విప్లవం

ఒక కొత్త భావన, సరికొత్త ఆలోచన, ఓ స్పార్క్, ఓ చిన్న కాన్సెప్ట్, ఒక లఘు చిత్రానికి సరిపోతాయి. ఆధునిక సాంకేతికత అందించిన డిజిటల్ మాధ్యమంలో షార్ట్ ఫిల్మ్ నిర్మాణం సులభ సాధ్యమయింది. ఓ కవి పెన్నుతో కవిత రాసినట్టుగా ఓ చిన్న కెమెరాతో తమ సృజనని తెరపై చూపించే అవకాశం దర్శకులకు ఎంతగానో పెరిగింది. అంతేకాదు అందరికీ అందుబాటులోకి వచ్చిన సెల్ ఫోన్ కెమెరాతో కూడా నిర్మించే లఘు చిత్రాలకు పోటీలు నిర్వహించే సంస్థలున్నాయి. ఇట్లా అందుబాటులోకి వచ్చిన ఆధునిక టెక్నాలజీతో పాటు నవతరంలో పెల్లుబుకుతున్న సరికొత్త భావ పరంపర కూడా షార్ట్ ఫిల్మ్(లఘు చిత్రాల) నిర్మాణానికి వూతమిస్తూ లఘుచిత్ర విప్లవానికి దారితీసింది. ప్రపంచంలోని ఒక్కో ప్రాంత జీవితమూ, సంస్కృతి చరిత్ర విలక్షణంగానూ వైవిధ్యంగానూ ఉంటాయి. వాటిని రికార్డు చేయడం మిగతా ప్రపంచానికి తెలియజేయడం భావితరాల కోసం నిక్షిప్తం చేయడం కోసం ఈ షార్ట్ ఫిల్మ్స్ నిర్మాణం ఎంతగానో తోడ్పడుతున్నది.

ఈ చిన్న నిడివి గల చిత్రాలు కథాత్మకంగా ఉన్నప్పుడు షార్ట్ ఫిల్మ్ అనీ, విషయ ప్రధానంగా ఉన్నప్పుడు డాక్యుమెంటరీ ఫిల్మ్ అని అంటున్నాం. సాంకేతిక రంగంలో పెరిగిన విస్తృతితో మొత్తంగా ఈ చిన్న సినిమాల స్థితి అనూహ్యంగా మారిపోయింది. ముఖ్యంగా యూట్యూబ్ వచ్చాక వీడియోల నిర్మాణం విపరీతంగా పెరిగిందనే చెప్పాలి. ఏదైనా భావం చెప్పడానికే కాదు వ్యాపారానికి, ఆటకు పాటకు ఈ చిన్న సినిమాలు ప్రధాన మాధ్యమాలయ్యాయి. ఇక ఫేస్‌బుక్, వాట్సప్, ఇన్‌స్టాగ్రాం, ట్విట్టర్ లాంటి అనేక సామాజిక మాధ్యమాలు వచ్చాక ఈ షార్ట్ వీడియోలు రూపొందించడం ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయడం విపరీతంగా పెరిగిపోయింది. అందులో అవసరమయినవీ, అనవసరమయినవీ ఎన్నో వుంటున్నాయి. ముఖ్యంగా కాలక్షేప వీడియోలే ఎక్కువ ఉండడం విచారకరం. పనికిరాని వీడియోల పోస్టులు చూస్తూ వుంటే అసలు ఈ షార్ట్ ఫిల్మ్స్ యొక్క మౌలిక లక్ష్యం ఉపయోగాలు ఎక్కడికి పోయాయి అనిపిస్తుంది.

షార్ట్ ఫిల్మ్ అంటే చిన్న చిత్రమని కాదు

అయితే ఈ వెర్రితలలు వేసే వీడియోలకు భిన్నంగా అనేక మంది యువతీ యువకులు ఉన్నత విలువలతో ఉత్తమ సాంకేతికతతో షార్ట్ ఫిల్మ్స్ చేస్తూనే వున్నారు. దేశ వ్యాప్తంగా కోల్‌కతా, ట్రివేండ్రం, ముంబాయి లాంటి చోట్ల షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్స్ కొనసాగుతూనే వున్నాయి. మన సంస్కృతి, జీవన విధానాల నేపథ్యంలో వస్తున్న లఘుచిత్రాలు కూడా వుంటున్నాయి. అయితే వాటిని చూసే అవకాశాలు పెరగాలి. అంతేకాదు వాటి నిర్మాణం విషయంలో శిక్షణ ఇచ్చే వసతులు కూడా పెరగాల్సి వుంది. తీసింది ప్రతిదీ షార్ట్ ఫిల్మ్ అనకుండా ఒక ఒరవడిని ఒక భావ పరంపరని దృశ్యమానం చేసే నేర్పును నేర్పించే అవకాశాలు ఏర్పడాలి. ముఖ్యంగా కాలేజీ యూనివర్సిటీ కాంపస్‌లలో, కాంపస్ ఫిల్మ్ క్లబ్స్ ఏర్పాటయి షార్ట్ అండ్ డాక్యుమెంటరీ సినిమాల పట్ల అవగాహన, వాటి నిర్మాణం పట్ల, సాంకేతికత పట్ల శిక్షణ అవకాశాలు ఏర్పరచ గలిగితే మనదగ్గర కూడా గొప్ప షార్ట్ ఫిల్మ్స్ నిర్మాణమయ్యే అవకాశం వుంది. ఆ దిశలో కాలేజీలు, విశ్వవిద్యాలయాలూ, ప్రభుత్వాలూ ఆలోచించాలి. ముందుకు రావాలి. అప్పుడే ఆరోగ్యకరమైన సినిమా వాతావరణం ఏర్పడుతుంది.

వారాల ఆనంద్

94405 01281


Next Story