పొలిటికల్ బ్లేమ్ గేమ్ లో సెప్టెంబర్ 17,దీనిపై రాజకీయ పార్టీల వాదనేంటి?

by Viswanth |
పొలిటికల్ బ్లేమ్ గేమ్ లో సెప్టెంబర్ 17,దీనిపై రాజకీయ పార్టీల వాదనేంటి?
X

చరిత్రను చూసే తీరుకు అనుగుణంగా కొంతమందికి విమోచనంగానూ, మరికొందరికి విలీనంగానూ, ఇంకొందరికి విద్రోహంగానూ కనిపిస్తుంది. దీనికి బీజేపీ మతం రంగు అద్దుతున్నది. నిజాం ఇస్లాం మతానికి చెందిన వారు కనుక ముస్లిం ప్రజలు, వారికి ప్రతినిధిగా ఉన్న మజ్లిస్ పార్టీ దీనితో విభేదిస్తున్నది. నిజాంను సొంతం చేసుకుంటున్నది. నిజాంను ప్రశంసించకుంటే ముస్లింల ఓటు బ్యాంకు దెబ్బతింటుందనేది టీఆర్ఎస్ భావన. అందుకే ఏక కాలంలో సాయుధ పోరాటయోధులను కీర్తిస్తూ నిజాం అభివృద్ధినీ ప్రశంసిస్తున్నది. హైదరాబాద్ స్టేట్‌ భారత యూనియన్‌లో విలీనం కావడం, నిజాం పాలన నుంచి, రజాకార్ల అకృత్యాల నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించడం ఒక చారిత్రక వాస్తవం. నిజాం పాలన అంతమై ఏడు దశాబ్దాలైనా ఇప్పటికీ తెలంగాణలో భూమి సమస్య కొనసాగుతున్నది.

క గ్లాసులో సగం నీరు మాత్రమే ఉంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సగం నీరు ఉన్నదని భావించాలా? లేక సగం ఖాళీగా ఉన్నదని అర్థం చేసుకోవాలా?' ఇది కొన్ని శతాబ్దాలుగా ఉన్న చర్చ. ఇప్పుడు తెలంగాణలో సెప్టెంబరు 17వ తేదీకి ఉన్న చారిత్రక ప్రాధాన్యతను గురించిన చర్చ కూడా ఇలాగే ఉంటుంది. గ్లాసును చూసే దృష్టి కోణానికి అనుగుణంగా సమాధానం వస్తుందన్నట్లుగానే చారిత్రక ప్రాధాన్యం ఉన్న సెప్టెంబరు 17 కూడా ఒక్కొక్కరి ఆలోచనలకు అనుగుణంగా ఒక్కోలా కనిపిస్తుంది. విలీనమా? విమోచనమా? విద్రోహమా? ఇదేదీ కాకుండా జాతీయ సమైక్యతా? రాష్ట్రంలోని ఒక్కో రాజకీయ పార్టీకి ఇది ఒక్కో రకంగా కనిపిస్తున్నది.

ఒకటే చారిత్రక ఘట్టం అయినా చూసే దృక్కోణాన్ని బట్టి సెప్టెంబరు 17కు వేర్వేరు అర్థాలు, నిర్వచనాలు, వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఆయా రాజకీయ పార్టీలు వాటికి ఒనగూరే ప్రయోజనాలకు అనుగుణంగా అర్థాలు చెప్పుకుంటున్నాయి. రాచరిక పాలనకు, నిరంకుశ విధానాలకు, అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన వీరోచిత సాయుధ పోరాటాన్ని అవి రాజకీయ పబ్బం కోసం వాడుకుంటున్నాయి. వీరుల త్యాగాలను విస్మరిస్తున్నాయి, అప్రాధాన్యం చేస్తున్నాయి. చివరకు సాయుధ రైతాంగ పోరాటాన్నే అవమానిస్తున్నాయి. ఏడున్నర దశాబ్దాలుగా ఆ పోరాటాన్ని పట్టించుకోని ఈ పార్టీలు ఇప్పుడు ఓట్ల కోసం రకరకాల వేషాలు వేస్తున్నాయి. సెప్టెంబరు 17 సందర్భాన్ని ఉత్సవాలుగా నిర్వహించడానికి పోటీ పడుతున్నాయి.

మతంతో ముడిపెట్టే ఆలోచన

స్వంత భూమి లేని నిరుపేదలు ఒకవైపు, కనుచూపు మేర భూములన్నీ గుప్పిట పెట్టుకున్న భూస్వాములు మరోవైపు ఉన్న పరిస్థితులలో నిజాం నిరంకుశ పాలనకు, రజాకార్ల అకృత్యాలకు, అణచివేతకు వ్యతిరేకంగా యావత్తు తెలంగాణలో సాయుధ రైతాంగ తిరుగుబాటు జరిగింది. 'భూమి, భుక్తి, విముక్తి కోసం' అనే నినాదంతో నిజాం పాలనకు వ్యతిరేకంగా కుల, మత, పేద, ధనిక, ప్రాంతం అనే తేడా లేకుండా ప్రజలు తిరగబడ్డారు. నిజాం ప్రభువును మతం కోణంలో ప్రజలు చూడలేదు. అందుకే సాయుధ పోరాటంలో ముస్లింలూ పాల్గొన్నారు. భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా ఒక్కటయ్యారు.

రాచరిక వ్యవస్థకు, అణచివేతకు మధ్య జరిగిన ఈ మహత్తర పోరాటంలో ముస్లింలైన షోయబుల్లాఖాన్, మగ్దుం మొహియుద్దీన్‌ ప్రాణాలర్పించారు. నిజాం ప్రభువు ముస్లిం అయినందున అతని రాజ్యం అంతరించిపోయింది కాబట్టి హిందువులకు విమోచనం కలిగిందనేది బీజేపీ భావన. కానీ, ఇది పాలకులకు, ప్రజలకు మధ్య జరిగిన యుద్ధం అనే అంశాన్ని తెర వెనక్కు నెడుతున్నది. పోరాటానికి మతాన్ని ఆపాదించడం ఆ పార్టీ వైఖరికి, ఆలోచనకు నిదర్శనం. అందుకే దీన్ని రెండు మతాల మధ్య యుద్ధంగా భావిస్తూ విమోచన దినోత్సవంగా జరపాలని నినదిస్తున్నది.

విలీనం వెనక సాయుధ పోరాటం

నిజాం పాలనలోని అణచివేతకు, వెట్టి చాకిరీకి, బానిస స్వభావానికి నిరసనగా ప్రజలంతా ఊరూవాడా ఏకమై పోరుబాట పట్టారు. అజ్ఞాత జీవితం గడిపారు. నిజాంకు నమ్మకస్తులుగా ఉన్న దేశ్‌ముఖ్‌ల భూస్వామ్య, పెత్తందారీ విధానానికి వ్యతిరేకంగా నడుం బిగించారు. దేశానికి స్వాతంత్రం 1947లోనే వచ్చినా తెలంగాణలో మాత్రం హైదరాబాద్ స్టేట్ పేరుతో నిజాం పాలనే కొనసాగుతున్నది. సాయుధ పోరాటమూ కంటిన్యూ అవుతున్నది. నవాబును లొంగిపోవాలన్న డిమాండ్ ప్రజల నుంచి బలంగా వినిపిస్తున్నది.సాయుధ పోరాటం నిజాం నవాబుకు తలనొప్పిగా మారింది. రజాకార్లు గ్రామాలపై విరుచుకుపడ్డారు.

నిజాం నవాబు బలహీన పరిస్థితిని గమనించిన భారత యూనియన్ అప్రమత్తమైంది. సైన్యాన్ని పంపి నిజాంను లొంగిపోయేలా చేసింది. హైదరాబాద్ స్టేట్‌ను విలీనం చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఒకవైపు కమ్యూనిస్టు నాయకత్వంలో ప్రజల తిరుగుబాటు, మరోవైపు ఇండియన్ ఆర్మీ దండయాత్రతో నిజాం నవాబుకు లొంగుబాటు తప్పలేదు. 1948 సెప్టెంబరు 17న భారత యూనియన్‌కు నిజాం నవాబు సరెండర్ అయ్యారు. దాంతో హైదరాబాద్ సంస్థానం స్వతంత్ర భారత్‌లో విలీనమైంది.

కమ్యూనిస్టులను అణచివేసే విద్రోహం

నిజాం లొంగిపోయిన తర్వాత భారత ప్రభుత్వం ఆయనను రాజ్‌ప్రముఖ్‌గా నియమించింది. కమ్యూనిస్టు పార్టీలు దీన్ని బహిరంగంగానే ప్రశ్నించాయి. 'నిజంగా నిజాం పాలనను అంతం చేయడమే భారత యూనియన్ ప్రభుత్వ లక్ష్యమైతే ఆయనను ఎందుకు కొనసాగించింది? వెంటనే ఎందుకు ఎన్నికలు జరపలేదు?' అంటూ ప్రశ్నించాయి. కమ్యూనిస్టులది పైచేయి అయితే హైదరాబాద్ స్టేట్ స్వతంత్ర రాజ్యంగా అవతరిస్తుందని, చివరకు భారత యూనియన్‌కు తలనొప్పిగా మారుతుందని, అందుకే ఆర్మీని రంగంలోకి దింపి లొంగిపోయేలా చేసుకున్నదనేది వీరి వాదన.

భూస్వాముల నుంచి పేదలు గుంజుకున్న భూములను మళ్లీ వారికి కట్టబెట్టడానికి ఆర్మీ ప్రయత్నించిందనే అపవాదూ ఉన్నది. అందుకే ఆర్మీకి వ్యతిరేకంగానూ ప్రజలు కొట్లాడారు. మార్క్సిస్టు దృక్కోణం నుంచి సెప్టెంబరు 17 సాయుధ పోరాటానికి విద్రోహం చేసిన రోజుగా కనిపిస్తుంది. ఒక వ్యక్తిగా సర్దార్ పటేల్ చేసిన కృషికి విజయం అంటూ హీరోగా చిత్రీకరిస్తూ ప్రజల పోరాటాన్ని విస్మరించడం దురదృష్టకరం.

నిరంకుశ పాలన అంతమైన రోజు

ఎవరు ఎన్ని భాష్యాలు చెప్పినా నిజాం సంస్థానంగా కొనసాగుతున్న హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్‌లో అంతర్భాగంగా మారిందనేది చారిత్రక వాస్తవం. తెలంగాణ ప్రజల జీవితాలలో ఒక చారిత్రక దినం. దీన్ని గుర్తించనివారు సాయుధ పోరును, వీరుల త్యాగాలను అప్రాధాన్యం చేయడం, అవమానించడమే. దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ లాంటి వేలాది మంది త్యాగాలు తక్కువ చేయడమే. ఏక కాలంలో వీరి త్యాగాలను కీర్తిస్తూనే నిజాం పాలనను పొగడడం సమంజసం కాదు. ప్రస్తుతం అధికార టీఆర్ఎస్ చేస్తున్నది ఇదే. నిజాం పాలనలో అభివృద్ధి జరిగిందని ప్రశంసిస్తున్నది. ఏ పాలనలోనైనా అభివృద్ధి ఉంటుంది, ప్రజలను పీల్చి పిప్పిచేసే అణచివేతా ఉంటుంది. బ్రిటీషు పాలనలోనూ ఇది కనిపిస్తుంది. అందుకే నిజాం నవాబు అప్పట్లోనే ప్రపంచంలో అత్యంత సంపన్నుడయ్యాడు. ప్రజలు నిరుపేదలుగా ఉండిపోయారు. ప్రజలను పీడించకపోతే అపార సంపద ఎలా సమకూరింది? రోడ్లు, రైళ్లు, ఆస్పత్రులు, యూనివర్శిటీలు, ప్రాజెక్టులు, చెరువులు ఇలాంటి అభివృద్ధి ఉన్నదనే పేరుతో మొత్తం పాలనను కీర్తించడం సమంజసం కాదు. బ్రిటిష్ పాలకులూ దేశంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారు. కానీ, వలస పాలనకు చరమగీతం పాడాలనే ప్రజలు స్వతంత్ర ఉద్యమంలోకి దూకారు. నిజాం పాలననూ ఆ కోణం నుంచే చూడాలి. సంకుచిత రాజకీయాలు, వాటి ద్వారా వచ్చే ప్రయోజనాల కోసం చరిత్రను వక్రీకరించడమో, తప్పుడు భాష్యం చెప్పడమో సహేతుకం కాదు.

లక్ష్యం అసంపూర్ణంగానే

చరిత్రను చూసే తీరుకు అనుగుణంగా కొంతమందికి విమోచనంగానూ, మరికొందరికి విలీనంగానూ, ఇంకొందరికి విద్రోహంగానూ కనిపిస్తుంది. దీనికి బీజేపీ మతం రంగు అద్దుతున్నది. నిజాం ఇస్లాం మతానికి చెందినవారు కనుక ముస్లిం ప్రజలు, వారికి ప్రతినిధిగా ఉన్న మజ్లిస్ పార్టీ దీనితో విభేదిస్తున్నది. నిజాంను సొంతం చేసుకుంటున్నది. నిజాంను ప్రశంసించకుంటే ముస్లింల ఓటు బ్యాంకు దెబ్బతింటుందనేది టీఆర్ఎస్ భావన. అందుకే ఏక కాలంలో సాయుధ పోరాటయోధులను కీర్తిస్తూ నిజాం అభివృద్ధినీ ప్రశంసిస్తున్నది.హైదరాబాద్ స్టేట్‌ భారత యూనియన్‌లో విలీనం కావడం, నిజాం పాలన నుంచి, రజాకార్ల అకృత్యాల నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించడం ఒక చారిత్రక వాస్తవం.

నిజాం పాలన అంతమై ఏడు దశాబ్దాలైనా ఇప్పటికీ తెలంగాణలో భూమి సమస్య కొనసాగుతున్నది. 'దళితులకు మూడెకరాల భూమి' అనే హామీ ఈ పరిస్థితికి అద్దం పడుతున్నది. ఆనాటి సాయుధ పోరాట లక్ష్యం అసంపూర్ణంగానే మిగిలిపోయింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమ ఆకాంక్షలూ అసంపూర్ణం. ఎనిమిదేళ్లుగా అటు కేంద్రం, ఇటు రాష్ట్రం సెప్టెంబరు 17ను జరుపలేదు. ఇపుడు బీజేపీ, టీఆర్‌ఎస్ అధికారం కోసం, రాజకీయ ప్రయోజనం పోటీ పడి నిర్వహించడం విడ్డూరం.

Also Read : లోక్ సభకు ఉపఎన్నిక? పక్కా ప్లాన్ సిద్ధం చేసిన బీజేపీ

ఎన్. విశ్వనాథ్

99714 82403


Next Story