సప్త స్వర నాయికి

by Disha edit |
సప్త స్వర నాయికి
X

జానకి గొంతు ఓ గంగా ప్రవాహం. వయసుతో నిమిత్తం లేని ఆమె స్వరం ఓ కోయిలగానం. ఆమె పలుకు ఓ ప్రకృతి పులకింపు చైత్రమాసపు కోయిలగానం ఆమె స్వరం. ఆమె పాట.. పగలే వెన్నెల కురిపిస్తుంది.. ఆమె పాట.. పదహారేళ్ల అమ్మాయి ఊసులను చెబుతుంది.. ఆమె పాట.. కదిలే ఊహలకు కన్నులు ఉంటే ఎలా ఉంటుందో చిత్రిస్తుంది.. ఆమె పాట.. మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో.. వివరిస్తుంది.. అదుపు లేని గాలిని సైతం తన గానామృతముతో గోదావరి వెల్లువగా ప్రవహింపజేసే సుమధుర గాయని ఎస్‌.జానకి.ఎస్.జానకి పాట తీయని స్వరాల తోట.

ఆమె పాట వింటే మనసు ఉప్పొంగుతుంది. ఉరకలేస్తుంది. అంతెందుకు మనసుకే రెక్కలొస్తాయి. ఎక్కడికో ఎగిరిపోతుంది.. ఆమె మధురమైన గాత్రం వింటే.. ప్రతీరోజు కూడా మళ్లీ మళ్లీ రానిరోజులా అనిపిస్తోంది. ఓ అల్లరి.. ఓ అలజడి.. ఓ ఒరవడి.. వెరసి ఓ సిరిమువ్వల సవ్వడి.. జానకి పాటలో పల్లవిస్తుంది.. మనల్ని పసిపిల్లల్ని చేస్తుంది. సినీ సంగీతాభిమానుల హృదయాల్లో స్వరమధురిమలు నింపి, తరతరాలు నిలిచిపోయే తీయని సంగీతాన్ని అందించిన జానకి గుంటూరు జిల్లా పల్లపట్లలో జన్మించారు. నాదస్వరం విద్వాన్ శ్రీ పైడిస్వామి వద్ద జానకి సంగీతాన్ని అభ్యసించారు. ఆమె మూడేళ్ళ ప్రాయంలోనే సంగీత అక్షరాభాస్యం చేశారు. జానకి విదియన్ విళైయాట్టు అనే తమిళ చిత్రంలో టి.చలపతిరావు సంగీత సారధ్యంలో తొలిపాట పాడారు. అలా మొదలైన ఆమె సంగీత ప్రయాణంలో ఎన్నో కీర్తి కీరిటాలు, మరెన్నో మైలురాళ్లు. లక్షలాది మంది సంగీతాభిమానులను సంపాదించుకున్నారు. పాడటం మొదలు పెట్టిన తొలి సంవత్సరంలోనే వందకు పైగా పాటలు పాడే అవకాశం లభించిందంటే... ఆమె పాట ఎంతగా ఆకర్షించిందో అర్థం చేసుకోవచ్చు. ఆరోజుల్లో అదో గొప్ప రికార్డ్‌గా నిలిచిపోయింది. మిమిక్రీ చేస్తూ.. శ్రోతలను మాయ చేయడంలో అందెవేసిన గొంతు జానకిది. పాటల్లో మిమిక్రి మిక్స్‌ చేసి సంగీత ప్రపంచాన్ని ఇలా కూడా మెప్పించవచ్చా? అని ఆశ్చర్యపరిచేలా పాడారామే.

తరాల హీరోయిన్లకి గొంతునిచ్చి..

పదహారేళ్ళ వయసు చిత్రంలోని 'కట్టుకథలు చెప్పి.. నేను కవ్విస్తే..' పాటలో పండు ముసలావిడ గొంతు.. 'గోవుల్లు తెల్లన.. గోపయ్య నల్లన' పాటలో చిన్న పిల్లాడి గొంతు, పెద్ద వాళ్ళ స్వరం... 'చిన్నారి పొన్నారి కిట్టయ్య' పాటలో పిల్లాడి గొంతు.. శ్రీవారి శోభనం చిత్రంలోని 'అలకపానుపు ఎక్కనేల, చిలిపిగోరింక' పాటలో హీరోయిన్ బామ్మ గొంతులతో పాట పాడి తనది ఎవరూ బీట్ చేయలేని ప్రత్యేకత అని నిరూపించుకున్నారు. ఆమె గొంతులో ఎన్నెన్నో భావాలు.. 'మేఘమా దేహమా' పాటలో ఆమె గొంతు పలికిన ఆర్ధ్రత.., 'ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది' అంటూ సాగే పాటలో ఆమె స్వరం పలికిన ప్రేమ తత్వం.. 'వెన్నెల్లో గోదావరి అందం' పాటలో ఆమె గొంతులో పలికించిన ఆవేదన.. 'తొలిసారి మిమ్మల్ని చూసింది' అంటూ సాగే పాటలో ఆమె స్వరంలో ప్రతిఫలించిన అల్లరి ఎన్నటికీ మరచిపోలేని రీతిలో ఉంటాయి. అలనాటి జమున నుంచి నిన్నమొన్నటి హీరోయిన్ల వరకూ ఆలంబన అయింది. ఐదారు శతాబ్దాల హీరోయిన్లకి గొంతు అరువిచ్చి ఒప్పించడం, వయసు మీదపడినా ఆ ప్రభావం గొంతుమీద పడనివ్వకపోవడం... ఇవన్నీ అందరికీ సాధ్యమయ్యే విషయాలు కావు. వేలకొద్దీ పాటలు పాడారు జానకి. వాటిలో మంచిపాటలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. ఏదో అస్పష్టమైన అజ్ఞాతమైన భావాన్ని కలిగించే మూడీ సాంగ్స్‌... కిర్రెక్కించే హుషారైన జాలీ సాంగ్స్‌.. రెండు రకాలూ పాడగలిగింది జానకి గళం.

ఎన్నో అవార్డులు..

సత్కరించిన అవార్డులు ఆరు జాతీయ అవార్డులు, 10 నంది అవార్డులు, 7 తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు, 14 కేరళ రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు...ఎస్.జానకి గాత్రానికి మురిసి ఆమెను వరించాయి. 1986లో కలైమామణి అవార్డు, 1987లో సుర్ సాగర్ అవార్డు 2002లో కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సినిమా అచ్చీవర్ అవార్డు ...ఇలా ఒక్కటేంటి ఎన్నో అవార్డులు ఎస్.జానకి మధుర గానానికి సొంతమైపోయాయి. జీవితంలో ఎన్ని కష్టాలు సమస్యలు వచ్చినా.. చిరునవ్వుతో పక్కకి తీసి పడేయగలగడం కళాకారులకే సాధ్యమవుతుంది. ఆప్తులు దూరమైనా అంతరంగంలో చెక్కుచెదరని ప్రశాంతత, పెదవులపై మాసిపోని చిరునవ్వు.. ఇవి జానకికి పెట్టని ఆభరణాలు. తన పాటలతో దశాబ్దాలుగా అలరిస్తున్న అభిమాన గాయకురాలికి కోట్లాదిమంది అభిమానుల ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. కలకాలం చిగురిస్తూ ఉండాలీ ఆ నవ్వు.. తరతరాలు నిలిచిపోయే తీయని గొంతును అందించిన జానకికి జన్మదిన శుభాకాంక్షలు.

వాడవల్లి శ్రీధర్

99898 55445



Next Story

Most Viewed