కులవ్యవస్థను బలపరచడం కోసమే!

by Disha edit |
కులవ్యవస్థను బలపరచడం కోసమే!
X

జీవితం, ప్రపంచం వాటంతట అవి నిలబడడానికి సంబంధించిన విలువలు, నమ్మకాలు, సంస్థలు, పద్ధతుల గురించి చెప్పేదే ధర్మం. సనాతన అంటే సంస్కృత భాషలో శాశ్వతమైనది. సనాతన ధర్మం అంటే శాశ్వతమైన ధర్మం అని అర్థం. అంటే ప్రపంచం మారదని చెప్పే సిద్ధాంతం ఇది! ప్రాచీన గ్రంథాలలో ఏదైతే రాసి ఉందో, అది మారదని, శాశ్వతమైన విశ్వఆదేశం (సనాతన ధర్మం) అని నమ్ముతారు. వేదాలు, స్మృతులు, సదాచారం, ఆత్మ, తుష్టి అనేవి ధర్మం నిర్మించిన లక్షణాలు. సనాతన ధర్మాన్ని ఒక మతంగా విశ్వసించే వారున్నారు. దీనిని ఆచరించడం సదాచారమని మనుస్మృతి సైతం నిర్వచించింది. అలాగే వర్ణాశ్రమమే ధర్మమని భగవత పురాణం స్పష్టం చేసింది. దీని ప్రకారం విరాట్ పురుషుడి పైభాగం (ముఖం) నుంచి పుట్టిన వారు ఉన్నతమైన వారు. విరాట్ పురుషుడి అవమానకరమైన శరీర కింది భాగం నుంచి పుట్టిన వారు తక్కువ వారని అర్థం.

మనుధర్మం ప్రకారం

సనాతన ధర్మం అంటే సామాజిక వ్యతిరేకం, అమానుషం అయిన కుల వ్యవస్థను పటిష్టపరచడానికి, కొనసాగించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అయితే నేడు ఈ ధర్మం గురించి ఇంతలా చర్చ జరగడానికి కారణం ఈ ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు. ఆయన సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకించనవసరం లేదు. డెంగ్యూ, మలేరియాలాగా దాన్ని నిర్మూలించాలన్న వ్యాఖ్యలని ‘హిందువులను నిర్మూలించాలి’ అనే విధంగా వక్రీకరించి ప్రచారం చేస్తున్నారు హిందుత్వ శక్తులు. అలాగే మనుస్మృతిలో వర్ణాశ్రమ ధర్మంపై కొన్ని నియమ నిబంధనలు విధించినాయి. ఈ మనుధర్మం ప్రకారం బ్రాహ్మలు జ్ఞానాన్ని బోధిస్తూ, యజ్ఞాలను చేస్తూ, సంభావనలు తీసుకోవాలని, దీనికి విరుద్ధంగా శూద్రులు ద్విజులకు (బ్రాహ్మణులకు) సేవ చేయాలి. శూద్రులు సంపదను కూడబెట్టడానికి వీలు లేదు. ధర్మశాస్త్రాల ప్రకారం ఎవరు ఏ వృత్తిని చేపట్టాలనేది వర్ణాన్ని బట్టి ధర్మం నిర్ణయిస్తుందని వ్యవహారమాల సూచిస్తుంది. ప్రతి ఒక్కరు వారి వారి వర్ణం ప్రకారమే వృత్తి చేపట్టాలి. వేరే వర్ణానికి చెందిన వృత్తి చేపడితే వ్యవహారమాల ప్రకారం అది శిక్షార్హం. బ్రాహ్మల లాగా శూద్రులెవరైనా పవిత్ర దారాలను(యజ్ఞోపవీతాలను) వేసుకున్నట్టయితే అలాంటి వారిని రాజు శిక్షించాలని శాసిస్తోంది. ఈ ధర్మశాస్త్రాన్ని శంకరాచార్యుడి అద్వైత తత్వసిద్ధాంతం, చాతుర్వర్ణ వ్యవస్థ బాగా వివరించింది.

వర్ణాశ్రమ అంటే..

భగవద్గీతలో సైతం చాతుర్వర్ణ ధర్మాన్ని భగవంతుడు సృష్టించాడని పేర్కొన్నది. రుగ్వేదంలో చెప్పిన పురుషసూక్తం సరైనదని, విరాట్ పురుషుడి వివిధ శరీరాంగాలనుంచి భగవంతుడు నాలుగు వర్ణాలుగా మనుష్యులను పుట్టించాడని, ‘బ్రాహ్మణులు విరాట్ పురుషుడి ముఖం నుంచి పుట్టారు’ మిగతా వారు అప్రధానమైన వారని శంకరాచార్యుడి బృహదరనాయక ఉపనిషత్ శంకర భాష్యంలో వర్ణాశ్రమ విభజనను అంగీకరించాడు. అలాగే ఈ ధర్మాన్ని అతిక్రమిస్తే సంకరమై, అపవిత్రమైన అసహ్యకరమైన ప్రపంచం ఏర్పడుతుందని అర్థశాస్త్రం, వర్ణధర్మాలు వదిలేసి, వర్ణాంతర వివాహాలు జరిపితే వర్ణసంక్రమం జరిగి వర్ణ ధర్మాలు పోతాయని, ఎక్కడైతే వర్ణాలు కలిసిపోతాయో, అక్కడ వర్ణాల స్వచ్ఛత దెబ్బతింటుందని, దేశంలోని నివాసాలు దెబ్బతిని, దేశం నశిస్తుందని మనువు చెప్పాడు. అలాగే కుల ధర్మాన్ని అతిక్రమించి వివాహాలు చేసుకుంటే కులం నశిస్తుందని భగవద్గీతలో అర్జునుడు కూడా ఆందోళన వ్యక్తం చేస్తాడు. వర్ణాశ్రమధర్మం నశిస్తున్నప్పుడు దాన్ని పరిరక్షించడానికి వాసుదేవుడు మళ్ళీ జన్మిస్తాడని భగవద్గీత, పురాణాలు చెపుతున్నాయి.

ధర్మాన్ని వ్యతిరేకించిన నాయకులు..

ధర్మాన్ని పురాణాలు, ధర్మశాస్త్రాలు ప్రశ్నలకు అతీతంగా నిర్వచించి, వ్యాఖ్యానం చేశాయి. సనాతన ధర్మమంటే వర్ణాశ్రమ ధర్మమని,వర్ణాశ్రమ ధర్మాన్ని అనుసరించి సమాజం నడవడమే ప్రాపంచిక దృక్పథమని భావించాయి. 'ధర్మం' పేరుతో కులవ్యవస్థను పరిరక్షించారని నారాయణ గురు శిష్యుడు, కేరళలోని సంఘ సంస్కర్త, ఆలోచనాపరుడు సహోదరన్ అయ్యప్పన్ 1950 శివగిరిలో ప్రసంగిస్తూ అన్నారు. ‘సనాతన ధర్మం’, ‘వర్ణాశ్రమ ధర్మం’ అనే పేరుతో మతాన్ని నిర్మించిన బ్రాహ్మలు తమకంటే తక్కువని భావించేవారిని న్యూనతా భావంలోకి నెట్టడానికేనని ‘పరివర్తనం’ అనే కవితలో సహోదరన్ అయ్యప్పన్ వివరించారు. అలాగే గాంధీ 1934లో కేరళ వచ్చిన సందర్భంలో కూడా భారతీయులను నిరుపేదలుగా ఉంచడానికి ఉపయోగపడే వర్ణాశ్రమ ధర్మం చాలా క్రూరమైందని వివరించారు. అలాగే వేదాలు, శాస్త్రాలు హేతుబద్దతని, నీతిని, తిరస్కరించి వాటిని చంపేస్తాయని, ఎందుకంటే వేదాలు, ధర్మశాస్త్రాలు వర్ణాశ్రమ ధర్మంలోని కుల నిచ్చెనమెట్ల సామాజిక వ్యవస్థను నిలబెడతాయని అంబేద్కర్ వ్యాఖ్యానం.

నారాయణ గురు, సహెూదరన్ అయ్యప్పన్, పెరియార్, అంబేద్కర్ వంటి వారు కులవ్యవస్థను పటిష్టపరిచే మహిమాన్వితమైన ‘సనాతన’ సంప్రదాయాలను చాలా ధైర్యంగా ఎదుర్కొన్నారు. బౌద్ధాన్ని స్వీకరించిన అంబేద్కర్ పైన హింసాత్మక బ్రాహ్మణీయ భావజాలం ఉన్నవారు దాడిచేసినప్పటికీ, లక్షలాదిమంది తన అనుచరులతో కలిసి సనాతన ధర్మాన్ని సంపూర్ణంగా తిరస్కరించారు. నేటి సనాతన ధర్మం గురించి అర్థం చేసుకోవడానికి అంబేద్కర్ మార్గదర్శకం అవుతారు. అమానుషమైన, సామాజిక వ్యతిరేకమైన కులవ్యవస్థను బలపరచడం కోసమే సనాతన ధర్మం నేటికీ ఉన్నది.

-డాక్టర్ సి.ఎం.శ్యాం కుమార్

(కేరళ, కాలాడిలోని శంకరాచార్య సంస్కృత విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందిన వారు)

అనువాదకులు

-రాఘవశర్మ

94932 26180


Next Story