అమ్మా! నన్ను మన్నించు కదిలించిన మల్లోజుల వేణుగోపాల్ కన్నీటి లేఖ

by Disha edit |
అమ్మా! నన్ను మన్నించు కదిలించిన మల్లోజుల వేణుగోపాల్ కన్నీటి లేఖ
X

అమ్మా, మల్లోజుల కుటుంబంతో, పెద్దపల్లి పట్టణంతో వందేళ్ల నీ రుణం తీర్చుకున్నావా అమ్మా! నీ కడుపున పుట్టిన ఆరుగురు సంతానంలో నేనే చివరివాన్ని తల్లీ. నిను చివరి వరకు ఏడ్పించినవాన్నీ నేనే అమ్మా. అయితే, నీవున్నంత వరకు మేం క్షేమంగా వుండాలనీ సదా కోరుకునే నీ చివరి కోరికను మాత్రం తీర్చి నీకు ప్రజలు తృప్తిని మిగిల్చారమ్మా. ఇప్పటివరకూ వాళ్లే నన్ను క్షేమంగా కాపాడుకుంటున్నారమ్మా. జనం మధ్య, జనం కోసం, జనంతో వున్న నేను నీ అంత్యక్రియలైనా చూడలేకపోయానమ్మా. అయితేనేం, వేలాది జనం, విప్లవ సానుభూతిపరులు, విప్లవ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, మిత్రులు నిన్ను ఘనంగా సాగనంపారమ్మా. నీ పార్ధివ శరీరంపై వాళ్లు ఎర్రగుడ్డ కప్పుతారనీ, విప్లవ నినాదాలతో నీకు వీడ్కోలు చెపుతారనీ నిజంగానే నేను ఊహించలేకపోయానమ్మా. ఎందుకంటే చాలా మంది సోదర విప్లవకారుల తల్లులకు ఇలాంటి గౌరవం దక్కడం లేదమ్మా.

నాతో పాటే అడవిలో మన పక్కూరు జోగన్న వున్నాడు. వాళ్ల తల్లి చివరి రోజులలో దిక్కులేని జీవితం గడిపి వీధుల్లో అడుక్కుతింటూ తనువు చాలించిందనీ విన్నపుడు ఆయనతో పాటు మేమనుభవించిన వేదన అక్షరాలలోకి అనువదించలేనిదమ్మా. పైగా 'అభాగ్యులైన' దళితులకు ఈ నికృష్ణ బ్రాహ్మణీయ కుల వ్యవస్థలో దక్కే స్థానం తెలుసు కదా! వాటన్నింటిని అంతం చేసి నిజమైన కుల విముక్త, దోపిడీ విముక్త, జెండర్‌ వివక్షకు తావులేని సమాజ నిర్మాణానికి అంకితమైన విప్లవకారులకు జన్మనిచ్చిన వారంతా విప్లవ మాతృమూర్తులేనమ్మా. వారంతా గౌరవనీయులే. నీతో సహా వారందరికీ శిరస్సు వంచి వినమ్రంగా విప్లవాంజలులు ఘటిస్తున్నానమ్మా. నీ అంత్యక్రియలలో పాల్గొన్నవారందరికీ అశ్రు నయనాలతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. వారు పాడిన పాటలు నా చెవులలో ఇంకా, ఇంకా నేనున్నంత వరకు ప్రతిధ్వనిస్తూనే వుంటాయి. అమ్మ వలపోతగా నా సహచర సోదరులు చేసిన గానం నా గుండెలలో భద్రంగా వుంటుందమ్మా. నేను వారి ఆశలను వమ్ము చేయకుండా, నీకూ, అమరుడైన నా సోదరునికి మన కుటుంబానికి ఏ కళంకం రాకుండా, జనానికి దూరం కాకుండా తుదివరకూ నమ్మిన ఆశయాల కోసం నిలబడుతాననీ మరోసారి హామీ ఇస్తున్నానమ్మా.

'పెద్దపల్లి పెద్దవ్వ' లేదనీ, 'విప్లవ మాతృమూర్తి కన్నుమూసిందని' 'అమ్మా మళ్లీ పుడతావా?' అంటూ అనేక విధాలుగా నీ జీవితాన్ని గుర్తు చేసుకుంటూ తమ భావాలకు అక్షర రూపం ఇచ్చిన కలం యోధులందరికీ వినమ్రంగా ఎర్రెర్ర వందనాలు తెలుపుకుంటున్నాను. బ్రిటిష్‌ సామ్రాజ్యవాదుల సంకెళ్ల నుండి దేశ విముక్తి కోసం బాపు పోరాడాడు. అన్న దోపిడీ విముక్తి కోసం పోరాడుతూ ప్రాణ త్యాగం చేశాడు. దేశం నుండి సామ్రాజ్యవాదులు వెళ్లిపోయినా దోపిడీ అంతం వరకు పోరాడాలనీ షహీద్ భగత్‌‌సింగ్‌ అన్నాడు. మహాకవి శ్రీశ్రీ 'తెల్లవాడు నిన్ను నాడు భగత్‌‌సింగ్‌ అన్నాడు, నల్లవాడు నిన్ను నేడు నక్సలైట్‌' అంటున్నాడు. ఎల్లవారు మిమ్ము రేపు వేగుచుక్కలంటారని' చెప్పాడు. నువ్వు అలాంటి వేగుచుక్కలను కన్నతల్లివి. నిన్ను వీరమాతగా ప్రజలు గుర్తిస్తున్నారమ్మా. బయటి పత్రికలు నీ త్యాగాన్ని ఎత్తిపడుతున్నట్టే, లోపల నాకు నా సహచర కామ్రేడ్స్‌ నుండి అందుతున్న సాంత్వన సందేశాలలో ఒకరు 'అమ్మ చివరి వరకు కూడా విప్లవకారులకు స్ఫూర్తిదాయకంగా వుంది.

తన ఇద్దరు కొడుకులను ఉద్యమానికి అంకితం చేసింది. పిల్లలను ఉద్యమానికి అంకితం చేసిన వీరమాతకు విప్లవ జోహార్లర్పిద్దాం' అంటూ రాస్తే, మరో కామ్రేడ్‌ 'మధురమ్మ మరణం నిజంగానీ మధురమైన గొప్ప మాతృమూర్తిగా నిలిచిపోయింది. రాంజీ దాదా (కోటన్న) కూడా మాకు అమ్మ గురించి చెప్పేవాడు. అమ్మకు జోహార్లు చెపుదాం' అంటూ రాసింది. పోతే, మరో నాయకత్వ కామ్రేడ్‌ నిన్ను గుర్తు చేసుకుంటూ, 'నేను చివరిసారి 1980 వేసవిలో అమ్మా-బాపును కలిశాను. నేను ఎప్పుడు ఇంటికి వెళ్లినా నీవు లేకపోయినా మా అమ్మలాగే భోంచేసి పో అనేది. అడవిలో ముదిమి వయసులోని తల్లులు వచ్చి ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నపుడు నాకు అమ్మా-నాన్నలే గుర్తొస్తారు. వాళ్లలోనే మన అమ్మా-బాపులను చూసుకుందాం" అంటూ ఓదారుస్తూ రాశాడు. మరో కామ్రేడ్‌ 'అమ్మ మరణవార్త అందరినీ కలచివేసేదే. భారత విప్లవోద్యమానికి సేవలందించే పుత్రులను ఇచ్చిన తల్లి. శత్రువు ఎన్ని నాటకాలు ఆడినా ప్రజల పక్షం నిలిచిన మాతృమూర్తి. అమ్మకు అందరం విప్లవ జోహార్లర్పిద్దాం. నా సహచర కామ్రేడ్స్‌ అంతా నీ సేవలను గుర్తు చేసుకుంటున్నారమ్మా. జన్మనిచ్చిన నా తల్లి రుణం ఎర్ర జెండా సాక్షిగా నేను ఆమెను సదా పీడిత ప్రజలు గుర్తుంచుకునే విధంగా వారి విముక్తికి అంకితమై తీర్చుకుంటానమ్మా.

నీ మరణ వార్త మాకు మరుక్షణంలోనే తెలియదనీ, మన మధ్య ఎలాంటి ఆన్‌‌లైన్‌ సంబంధాలు లేవనీ, వుండవనీ తెలిసినా, కడసారి చూపుకైనా నేను రాలేననీ వందశాతం వారికి తెలిసిందే అయినప్పటికీ, ఈ ఆఖరి నిముషంలోనైనా పెద్దపల్లి పెద్దవ్వకు ఖాకీ రాబందుల పొడ పడకుండా ప్రాణం పోతలేదు కదా? అని జనం తిట్టిపోసుకుంటారనీ లోలోపల బాధగా చాలా మందికి వున్నప్పటికీ హృదయమున్న పీడిత ఖాకీ సోదరులు విధిలేక యథావిధిగా తమ బాస్‌‌ల ఆదేశాల ప్రకారం నీ అంతిమ యాత్రకు కాపలా విధులు నిర్వహించడం రాజ్య స్వభావాన్ని వెల్లడి చేస్తుందమ్మా. అయితే, నీ మరణంతో వారు ఇక గతంలా తరచుగా మన గడప తొక్కే అవసరం లేకుండా చేశావమ్మా. నీవు లేకున్నా మిగిలిన నా సోదరుని కుటుంబాన్నైనా ఇకపై వాళ్లు వేధించకుండా వుంటారనుకోగలమా!

బ్రాహ్మణవాదం పరమ దుర్మార్గమైనదమ్మా. పగ తీర్చుకునే వరకు సిగలు ముడివేయని పాఖండులమ్మా పాలకులు. నీకు మూడేళ్ల వయసులోనే బాపుతో పెళ్లి జరిపించారని చెప్పేదానివి. ఫలితంగా చిన్న వయసులోనే నీ కడుపున పుట్టిన బిడ్డలు నీకు దక్కడం లేదనీ వరుసగా ముగ్గురిని కోల్పోయిన తరువాత బాపు హేతువాదే అయినప్పటికీ నీవు మాత్రం రాతి దేవుళ్లను కడుక్క తాగి, మట్టి దేవుళ్లను పిసుక్కు తాగి మమ్మల్ని ముగ్గురిని బతికించుకున్నానని మాకు ఏ చిన్న ఇబ్బంది కలిగిన ఏడుస్తూ చెప్పేదానివి అమ్మా. ముగ్గురు పోగా మిగిలిన మా ముగ్గురిలో చెట్టెత్తు నీ నడిపి కొడుకును (మల్లోజుల కోటీశ్వర్లు) విప్లవకారుడని, ప్రమాదకరమనీ 57 వ ఏట దోపిడీ రాజ్యం పొట్టనపెట్టుకోగా, అతడు ఆపాదమస్తకం గాయాలతో విగతజీవిగా నీ ఇంటికి, నీ ముందుకు రాక తప్పలేదమ్మా. నీవు ఆ దృశ్యాన్ని చూసి తట్టుకోలేకపోయావు. కానీ, దోపిడీ రాజ్యం నిర్ధాక్షిణ్యమైనదమ్మా. అందుకే అన్నింటికి తెగించి పేదల రాజ్యం కోసం పోరాడక తప్పదమ్మా.

నీవు బతికున్నంత వరకు నీ కొడుకులు క్షేమంగా వుండాలనీ నిత్యం కోరుకుంటూ వుండేదానివి అమ్మా. కానీ, అన్నను రాజ్యం హత్య చేసింది. కానీ, ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా పీడిత ప్రజలు ఆయన విప్లవ సేవలను స్మరించుకుంటూ గత సంవత్సరం కూడా ఆయన దశ వర్ధంతి వేళ ప్రహార్ దాడిని ఓడిద్దామని ప్రతిన బూని ఆయన అమరత్వాన్ని చాటుతూ 'ప్రపంచ సోషలిస్టు విప్లవం వర్టిల్లాలని' నినదిస్తూ ఆయన ఆశయాల సాధనకై ప్రతిన పూనారమ్మా. అమరులను స్మరించుకునే ప్రతి నిముషం వారిని కన్నవారు గూడా గుర్తొస్తారు. ఆ రకంగా మన రక్త బంధం చరిత్రలో విప్లవ బంధంగా నిలిచిపోయి అజరం అమరం అయిందని అనుకోవచ్చమ్మా. నా ప్రజలకు తుదివరకు సేవ చేసి నీ రుణం తీర్చుకుంటానమ్మా. నీ కడుపున పుట్టినందుకు సంతోషంగా వుంది.

ప్రతి తల్లీ తన బిడ్డలు ఎలాంటి వారైనప్పటికీ సహజంగానే పేగు బంధంతో తుది వరకూ వారి బాగునే కోరుకుంటుందమ్మా. నేను నీకు తెలియనంత చేరువలో, నీ చెంతలోనే, ప్రపంచమే ఒక పల్లెగా మారిన వేళ నేనున్నప్పటికీ నిన్ను చూడలేని నిర్బంధ పరిస్టితులలో వుండడం నా తప్పేమీ కాదమ్మా. నిర్ధాక్షిణ్యమైన ఫాసిస్టు పాలకుల పాలన అలాంటిదమ్మా. తల్లులకు బిడ్డలను దూరం చేస్తున్నారు, కట్టుకున్నదానికి తనవాన్ని కాకుండా చేస్తున్నారు. పల్లెల్లో పడచు బిడ్డల బతుకులను బుగ్గి పాలు చేస్తున్నారు. రైతును పంటకు దూరం చేస్తున్నారు. అడవులను ఖాకీమయం చేస్తూ మూలవాసులను అడవికి పరాయివాళ్లుగా చేస్తున్నారు. కార్మికులను వీధుల పాలు చేస్తున్నారు. ముస్లిం, దళిత సోదరులను ఊచకోత కోస్తున్నారు. వాళ్ల దాష్టీకాలను ఎన్నని రాయను తల్లీ! ఇప్పటివరకూ నా మనసులోని భావాలను నీతో పంచుకోవడానికి చాలా సందర్భాలలో పౌర, పోలీసు అధికారులే అవకాశాలను కల్పించారమ్మ. నీతో పాటు వాళ్లూ గుర్తుంటారు.

చరిత్ర అంటేనే మంచితో పాటు చెడు కూడా నమోదవుతుంది కదా! 800 ఏళ్ల తరువాత తమకు అధికారం దక్కిందని హిందుత్వ శక్తులు సంబురపడుతూ కాషాయ జెండాను ఎగురేయడానికి ప్రపంచ పెట్టుబడులకు ఎర్ర తివాచీలు పరుస్తున్నారు. వారి కార్పొరేటీకరణకు, అడవులను వారి భద్రతా బలగాలతో నింపేస్తున్నారు. ఫలితంగా దేశం కార్పొరేటీకరణ-సైన్యకరణకు వ్యతిరేకంగా నినదిస్తున్నది. అమ్మా, నీ అంతరంగం నా ఇద్దరన్నల కన్నా నాకే ఎక్కువ తెలుసే. నేను చిన్నవాడిని. ఎక్కువ కాలం నీతో గడిపినవాన్ని. మధ్యతరగతి మర్యాదల మధ్య నువు నలిగిన తీరు నేను మరువలేదు. నువ్వు మా చదువుల కోసం కడుపు కట్టుకొని పాలు, పెరుగు అమ్మి సాదినవు గాదే. 'ప్రాణం పోయినా మానం పోవద్దనే' మధ్య తరగతి మనస్తత్వానికి (జాన్‌ గయేతోభీ ఫర్వా నహీ, లేకిన్‌ షాన్‌ మే ఫర్క్‌ నహీ ఆనా) నీవు, మన ఇల్లే పెద్ద ఉదాహరణమ్మా. నీవు, మనది బ్రాహ్మణ కుటుంబం, ఊళ్లో పరువు కల కుటుంబం, వరి అన్నం తినాలి కానీ గట్క తింటారా అని లోకం ఎక్కడ ఎద్దేవా చేస్తుందోనని నీవు ఇంట్లో బియ్యం నిండుకునపుడు జొన్న గడ్క, జొన్న అట్లు పోసి గుంభనంగా మా కడుపులు నింపిన రోజులు అడవిలో ఉపవాసం తప్పనప్పుడు నాకు తప్పకుండా గుర్తొస్తాయమ్మా. అమ్మా, నీకూ, మరెవరకికీ తెలువకుండా నా జేబు ఖర్చుల కోసం నేను ట్యూషన్‌ చెప్పిన నా గతాన్ని ఇటీవలే మన నిజాం వెంకటేశం సారును గుర్తు చేసుకున్న సందర్భంగా మొదటిసారి నా ఇన్‌ సైడర్‌‌ను బయటపెట్టానమ్మా. పేదరికంలో పెరగడం విప్లవావశ్యకతను నాలో అనుక్షణం గుర్తు చేస్తుందమ్మా.

అమ్మా, మన బంధువులలో కొందరు మేం 'చెడిపోవడానికి' మీరే (అమ్మా-బాపు) కారణమని నిందాపూర్వకంగా ముఖం మీద మీతో మాట్లాడినపుడు కన్నీళ్లు తుడుచుకుంటూ 'నీవు నా బిడ్డలు దొంగలు కాదు, లంగలు కాదు, వాళ్లు ప్రజల కోసం పని చేస్తున్నారు' అని 'వాళ్ల బాపు గుణం వారికి అబ్బింది' అని బదులిచ్చిన మాటలు నాకు జీవితాంతం గుర్తుంటాయమ్మా. బాపును పోలీసులు అవమాన పరిచినపుడు, మన ఇళ్లు కూల్చినపుడు మీరు భరించిన ఆత్మక్షోభ మీకే తెలుసమ్మా. అమ్మా, ఇంకేమీ రాయలేక పోతున్నానమ్మా. కళ్లు మసకబారుతున్నాయి. నీ మాట నిలబెడుతానమ్మా. నను నమ్ము నా తల్లీ. నీకివే నా

అంతిమ జోహార్లు.

కట్టా నరేంద్రచారి గారికి నమస్తే

అన్నా, నువు ఎవరో నాకు తెలియదు. అమ్మ గురించి నువు రాసిన మాటలు నన్ను కన్నీళ్లపర్యంతం చేశాయి. నీకు చేతులెత్తి దండం పెడుతున్నానన్నా. అమ్మతో నాకున్న ఆత్మీయానుబంధాన్ని నీ అక్షరాలు శక్తిమంతంగా నా ముందు నిలిపి నన్ను ఏడిపించాయి. మీ ఆశీస్సులు, సహకారం వుంటే విప్లవకారుల కుటుంబాలు గుండె ధైర్యంతో వుండడమే కాదు, నాలాంటి వాళ్లు మరింత పట్టుదల, ఉత్సాహంతో నమ్మిన ప్రజల కోసం బొందిలో ప్రాణం వున్నంత వరకు పని చేస్తామన్నా. నేనింతకన్నా మరేం రాయాలన్నా. మూడు కుర్చీలలో వున్న నావారి పక్కన నాల్గవ కుర్చీలో నాకు స్థానం ఇవ్వండని మిగిలిన నా కుటుంబ సభ్యులను కోరుకోవడం తప్ప నాకు మరేం అవసరం లేదన్నా. సంపదలు, ఆస్తులు మాకెందుకన్నా. నా భుజాల మీద కూచోని నాతో ఆటలాడుకున్న నా తల్లి దీప, దాని సోదరులు మా ఇంటి ముఖం చూడని బాబాయ్‌ మాకొకడు వున్నాడని గుర్తు పెట్టుకుంటే చాలన్నా. కోట్లాది జనం గుండెల్లో మా స్థానం పదిలంగా భద్రపరచబడిందని తెలుసు కదా. నాకు అడవిలో ఎందరో పేరీలు (పెద్దమ్మలు), కూచిలు (చిన్నమ్మలు) వున్నారు. నేను కొద్ది మాసాలు అగుపడకుంటే తల్లడిల్లిపోతారు. వాకబు చేస్తుంటారు, 'బిడ్డకు ఏం కాలేదు కదా?' అని. ఆ ప్రేమ చాలు. అమరుడైన నా సోదరుడి సహచరి నా వదిన ఈ వార్తను ఎలా తట్టుకుంటుందోనన్నదే ఇపుడు నా చింత. ఈ మధ్యనే నన్ను కలసి వెళ్లింది. క్షేమంగానే వుంది. ఉంటానన్నా. అన్నా. నీ అనుమతి లేకుండా నీ ఫోన్‌ నంబర్‌‌కు ఈనా స్పందనను పంపుతున్నందుకు మన్నించన్నా.

సోదరుడు

('అమ్మా మళ్లీ పుడుతావా?' అంటూ 03-11-2022 నాడు 'దిశ' లో ప్రచురితమైన కథనానికి స్పందనగా)

Also read: అలాంటి అమ్మ మళ్లీ పుడుతుందా!?


మల్లోజుల వేణుగోపాల్

మావోయిస్టు పార్టీ

పొలిట్ బ్యూరో సభ్యుడు


Next Story

Most Viewed