పేరుకే రిజర్వేషన్ కానీ ఆ ఫలాలు వారికందవు! కారణం?

by Disha edit |
పేరుకే రిజర్వేషన్ కానీ ఆ ఫలాలు వారికందవు! కారణం?
X

ఎస్‌సీ ఉప కులాలవారు నేటికి కూడా అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉన్నారు. భిక్షాటన చేసుకుంటూ, అంగడిలో పూసలు అమ్ముకుంటూ, రోడ్డుపై చెప్పులు కుట్టుకుంటూ సంచార జీవనం గడుపుతూ రెక్కల కష్టంపై బతుకుతున్నారు. ఎస్‌సీ కార్పొరేషన్ నుంచి 2014-2021 వరకు ఎస్‌సీ జనాభాలో 34 శాతంగా ఉన్న ఉపకులాలవారు 7.4 శాతం రుణాలను మాత్రమే పొందారు. కాబట్టి ఉపకులాలకు సామాజిక న్యాయం జరిగే విధంగా హేతుబద్ధంగా వర్గీకరణ జరగాలని కోరుకుంటున్నాము.

గిరిజనుల రిజర్వేషన్ పది శాతానికి పెంచుతామని బంజారా, ఆదివాసీ భవనాల ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. వారం రోజులలో జీఓ కూడా ఇస్తామని, గిరిజన బంధు ని కూడా అమలులోకి తెస్తామని చెప్పారు. భూమి లేనివారికి భూమి ఇస్తామని కూడా అన్నారు. దీంతో రిజర్వేషన్‌ల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో ఉన్న 22 లక్షల మంది ఎస్‌సీ ఉపకులాలవారు గిరిజనుల కంటే అత్యంత వెనకబడి ఉన్నారు. ఎంతోకాలంగా అణిచివేతకు, వివక్షకు గురవుతున్నారు.

జనాభా నిష్పత్తి ప్రకారం తమ రిజర్వేషన్‌లను 20 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కోరుతున్నారు. జనాభా పెరిగినా, అందుకు అనుగుణంగా రిజర్వేషన్ లేకపోవడంతో ఎంతో నష్టపోతున్నామని ఎస్‌సీ ఉప కులాలవారు వాపోతున్నారు.

ఆ ఫలాలు వారికే

సామాజికంగా అత్యంత వెనుకబడి ఉండే కులాలు సమానస్థాయికి చేరుకునేందుకు వీలుగా ఎస్‌సీ, ఎస్‌టీలకు రాజ్యాంగంలో రిజర్వేషన్‌ కల్పించారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా నేటికీ ఆయా కులాలు అసమానతలను ఎదుర్కుంటూనే ఉన్నాయి. ఎస్‌సీలలోని ఉన్నత శ్రేణి కుటుంబాలు రిజర్వేషన్‌లు అనుభవిస్తుండటంతో కింది కులాలవారు ఇంకా వాటి ఫలాలు అందుకోలేక పోతున్నారు. ఉమ్మడి ఏపీలో నాటి ప్రభుత్వం 1996లో ఎస్‌సీ రిజర్వేషన్‌లో అసమానతలను నిర్ధారించడానికి జస్టిస్ రామచంద్రరాజు కమిషన్‌ను నియమించింది.

ఎస్‌సీలలో ఉండే కొన్ని కులాలు మాత్రమే రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్నాయని ఈ కమిటీ తేల్చి చెప్పింది. ఈమేరకు నివేదికను ప్రభుత్వానికి అందించింది. దీంతో ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసి 2000 -2004 వరకు వర్గీకరణను అమలు చేసింది. కానీ, 2004లో సుప్రీంకోర్టు వర్గీకరణను రద్దు చేసింది. ఆ అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉందని తీర్పునిచ్చింది. అనంతరం కేంద్ర ప్రభుత్వం జస్టిస్ ఉషామెహ్రా కమిషన్‌ను నియమించింది. అది 2008 మే నెలలో తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. కేంద్రం, రాష్ట్రం నియమించిన కమిటీలు మాల, మాదిగలతో పోల్చితే మిగిలిన 57 ఉపకులాలు తీవ్ర అన్యాయానికి గురయ్యాయని వెల్లడించాయి.

ఇంకా అభివృద్ధికి దూరంగా

ఎస్‌సీ ఉప కులాలవారు నేటికి కూడా అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉన్నారు. భిక్షాటన చేసుకుంటూ, అంగడిలో పూసలు అమ్ముకుంటూ, రోడ్డుపై చెప్పులు కుట్టుకుంటూ సంచార జీవనం గడుపుతూ రెక్కల కష్టంపై బతుకుతున్నారు. ఎస్‌సీ కార్పొరేషన్ నుంచి 2014-2021 వరకు ఎస్‌సీ జనాభాలో 34 శాతంగా ఉన్న ఉపకులాలవారు 7.4 శాతం రుణాలను మాత్రమే పొందారు. కాబట్టి ఉపకులాలకు సామాజిక న్యాయం జరిగే విధంగా హేతుబద్ధంగా వర్గీకరణ జరగాలని కోరుకుంటున్నాము.

ఎస్‌సీ, ఎస్‌టీలకు ఇతర వర్గాలతో సంబంధం లేకుండా వారి నిష్పత్తి ప్రకారం పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ పెంచుకునే అవకాశం రాష్ట్రాలకు ఉంది. రాజ్యాంగపరంగా ఎలాంటి అడ్డంకులు లేవు. దీని ఆధారంగా రిజర్వేషన్‌లను అమలు చేయాలని కోరుచున్నాం.


బైరి వెంకటేశం మోచి

అధ్యక్షుడు, ఎస్‌సీ ఉప కులాల హక్కుల పోరాట సమితి

94919 94090



Next Story

Most Viewed