సంపాదకీయ శిఖరం నార్ల

by Ravi |
సంపాదకీయ శిఖరం నార్ల
X

తెలుగు పత్రిక రచనకు రూపుదిద్దిన శిల్పులలో నార్ల వెంకటేశ్వరరావు ఒకరు. పత్రిక ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకొన్న కవి, రచయిత, సంపాదకుడు. నార్ల 1908 డిసెంబర్‌లో జబల్‌పూర్లో జన్మించారు. ఆయన పుట్టే నాటికే నార్ల కుటుంబం కృష్ణా జిల్లా కవుతరంకి తిరిగి వచ్చింది. నార్ల ఈ జిల్లాలోనే సెకెండ్, ఫిఫ్త్ పోరం చదివారు. తర్వాత గుంటూరు హిందూ కాలేజీ, మచిలీపట్నంలోని నోబెల్ కళాశాలలో చదివారు. నోబెల్ కాలేజీలో చదివే సమయంలోనే నార్ల పత్రిక రచనా వ్యాసంగాన్ని చేపట్టారు. అలాగే కృష్ణ పత్రికలో పార్ట్ టైం సబ్-ఎడిటర్‌గా కొంతకాలం పనిచేసాడు. అలాగే జన్మభూమి, లాహోర్ నుంచి వెలువడే పీపుల్స్, పూణే నుంచి వెలువడే మహారాజా పత్రికలకు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేస్తూ కాలేజీ ఫీజులకు, ఖర్చులకు వాడుకునేవారు. తర్వాత కాకినాడలో పీఆర్ కాలేజీలో చేరారు అక్కడ రఘుపతి వెంకటరత్నం నాయుడు, గోపరాజు రామచంద్రరావు తదితరుల ప్రభావంతో బ్రహ్మ సమాజ ఆలోచనలకు ప్రభావితమయ్యారు.

నార్ల కాలేజీ గ్రంథాలయాన్ని బాగా ఉపయోగించుకునేవారు. అప్పుడే ఆయన యువజన పత్రికను ప్రారంభించి నేనే 'కమల్ పాషా నైతే' అనే వ్యాసాన్ని రాశారు. 1928లో కాకినాడలో జరిగిన జాతీయ కాంగ్రెస్ మహాసభ కు వెళ్లి అక్కడ గాంధీకి ఇష్టం లేని సంపూర్ణ స్వాతంత్య్రం తీర్మానానికి మద్దతు పలికారు. కానీ గాంధీ ప్రభావంతో ఆ తీర్మానం కాంగ్రెస్‌పై పడలేదు. అప్పుడే ఆవేదనతో కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ మద్దూరి అన్నపూర్ణయ్య సంపాదకత్వంలో వస్తున్న కాంగ్రెస్ పత్రికకు వ్యాసం రాశారు. ఆ వ్యాసాన్ని యువ మిత్రుని ఆవేదన అంటూ ప్రచురించారు అన్నపూర్ణయ్య. ఆ తరువాత వ్యాసరచన మొదలుపెట్టారు నార్ల. మొదట భారతికి వ్యాసం రాసి పంపిస్తే దానిని అచ్చు వేసినందుకు కాను ఆ పత్రిక వారు 25 రూపాయలు పారితోషికంగా పంపించారు. ఆ రోజుల్లో అది ఉపాధ్యాయుల జీతం కంటే ఎక్కువ. ఆ తర్వాత స్వాతంత్య్ర పోరాటంలో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం గురించి నార్ల జన్మభూమి పత్రికకు రాసిన వ్యాసం నాటి బ్రిటిష్ పోలీసుల కంటపడి లాఠీ దెబ్బలకు గురయ్యారు. నాటి పరిస్థితుల దృష్ట్యా జర్నలిజం వృత్తిగా స్వీకరించి 25 రూపాయల జీతంతో స్వరాజ్య పత్రిక సిటీ రిపోర్టర్‌గా ఉద్యోగం లభించింది. అక్కడ 8 నెలలు పనిచేసిన ఆయన సబ్ ఎడిటర్‌గా, ప్రూఫ్ రీడర్‌గా, నైట్ డ్యూటీ ఎడిటర్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఆంధ్రప్రభ దినపత్రిక ఎడిటర్‌గా పని చేయమని రాంనాథ్ గోయెంకా కోరితే ఒప్పుకున్నారు కానీ కొన్ని కారణాల వలన న్యాపతి నారాయణమూర్తిని సంపాదకుడుగా నియమించారు. కానీ కొద్ది కాలానికే నార్ల సంపాదకత్వ బాధ్యతలు చేపట్టారు.

ఆంధ్రపభలో పనిచేస్తున్న సమయంలో ఆయన ఎన్నో సంపాదకీయాలు సామాన్య జనానికి సైతం సులభంగా అర్థమయ్యేలా రాసేవారు. ప్రభుత్వ విధానాలు, ప్రజా వ్యతిరేకంగా ఉంటే వాటిని నిశితంగా విమర్మించేవాడు. తన కలం బలంతో ప్రజాసమస్యలకు పత్రిక ద్వారా ఉద్యమ రూపం పోరాట స్ఫూర్తి కలిగించే వాడు. ఆయన వ్యాఖ్యలు హేతుబద్ధంగా, నిర్భయంగా, నిష్కర్షగా ఉండేవి. ఆయన జీవితాంతం జర్నలిజం వృత్తిలో నీతివంతంగా ఉంటూ ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు తన పత్రికను వేదిక చేసి, తెలుగు పత్రిక రచనా వ్యాసంగానికి కొత్త ఒరవడులు దిద్దారు. ఆయన జీవితం, సంఘాన్ని గూర్చి తనదైన శైలిలో శతక పద్య రచన చేసిన కవి నార్ల. 1958లో రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఆంధ్రప్రభకు రాజీనామా చేశాడు. తన జీవితంలో జర్నలిస్ట్ గానే కాక వివిధ స్థానాలలో పనిచేసిన నార్ల 1985 ఫిబ్రవరి 16న కన్నుమూశారు.

(నేడు నార్ల వెంకటేశ్వర రావు వర్ధంతి)

కొలనుపాక కుమారస్వామి

9963720669

Next Story

Most Viewed